పక్షి ఎత్తుకు ఎగరడం
ఆనందం అంచులు చూడటం
ప్రకృతి తీరు
వీరులు పోలికల వేగుచుక్కలు
అయినట్టు
విప్పార్చిన హస్తాలతో
ముడిచిన అస్ర్తాలతో
వాళ్లు పనుల్లోకి దిగుతారు
సంతోషానికి మార్గాలు
తవ్వుతుంటారు
ఉల్లాస హృదయమో
కష్టపోతు తనమో
నేర్చుకోవడం అనే పోరాటమో
నేర్పించడం అనే ఆరాటమో
అలుపెరుగని శ్రమ తత్వాన్ని రక్తనిష్టతో
వాళ్లకు నైపుణ్యాలను తెచ్చిపెట్టింది
వాళ్లే మీ ముందు ఉండేటందుకో
పైపైకి ఎక్కేసేటందుకో కాదు
ఓ వస్త్రంగానో
ఓ వస్తువుగానో
శబ్ద నాదం అవుతారు
వాళ్లు వికసిత నయనాలతో
నేల తవ్విన ప్రతిసారి
బొగ్గు రవ్వలు వాళ్లతో
ముచ్చటిస్తుంటాయి
అందరి మనసుల్లో కొలువుండేందుకో
కొందరి చేతుల్లోనే
కనిపించాలనేందుకో కాదు
సూర్యుని నీడ జారి చెమట చుక్క
అయినప్పుడు
ఆ చూపుల్లోనో
ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లోనో
ప్రాణవాయువంతటి విలువ
ఉంటుందని వాళ్లకు తెలియదు
చిక్కటి చీకటిలో తెల్లని వెలుగులలో
ఆకాశాన్ని పరుచుకోకముందే
పనుల్లోంచి దిగేసినా
నాలుగు చుక్కలు నోట్లో పడగానే
యుద్ధంలో గెలిచిన సైనికుని ధీమాతో
నిద్ర మత్తుల్లోకి వెళ్తారు
మెలకువ బుద్ధికి ఉండాలనే
మేధావి వర్గానికి
బోలెడంత మెటీరియల్
అందిస్తారే గాని
ఇమ్మెటీరియల్గా నడుస్తూ ఉంటారు
పలుగు పారా తట్ట చీపుర్లను
చేతబట్టుకొని
వెనుదిరుగని రైలులా
పట్టాలెక్కుతూనే ఉంటారు
వాళ్లు శ్రామికులని పిలవబడుతుంటారు
పిలవబడటమే కాదు
మనందరికీ తెలిసిన కార్మికులూ వాళ్లే
వాళ్ల కోసం
ఒక్క మే డేనేనా?
పన్నెండు ఆకుల కాలానికి
ఇరుసు వాళ్లే చక్రం వాళ్లే!!
డాక్టర్ కొండపల్లి నీహారిణి