కష్టాల్ని పాటలుగా కట్టి
తెలంగాణ కన్నీటి సెమటను
పాటల చెలిమెలుగా
మలిచిన గొంతు!
చెప్పాల్సింది పాటతో చెప్పాడు
చేరాల్సిన చోటికి
పాట ద్వారా చేరాడు.
సభల ముందు పాట
కోటి గొంతుల ఆటపాట
ఆ పాటలేని సభలేదు
ఆ పాట దుమ్ము రేగకుండా
ఏ పథకం పొద్దు పొడవదు.
ఇప్ప కొమ్మల్లో పాట
దోపిడిపై తూటా పాట.
ఊపిరులూదిన పాట
స్ఫూర్తి నింపిన పాట.
బతుకును శకలాలు శకలాలుగా
పాడిన పాట
తుడుం మోతకు డోలు దెబ్బకు
డప్పుల దరువుకు
తెలంగాణ ధూం ధాం కు
కోరసైన పాట.
చెరువు నీటి గలగలలైన పాట
జనం గుండెల్లో డప్పుల మోత.
కూడు లేని పేదోళ్లకు ఆసరా
పాట సరదా కోసం కాదు
మార్పు కోసమని నమ్మిక.
తెలంగాణ పల్లె
గుండెల్లో నాదమైన పాట
ఇప్పుడు ఆ పాట మూగబోయింది.
ఇప్పుడు బతుకును
పాటగా మలిచేదెవరు?
గాలి అలల సంగీతంగా మారిన
ఆ పాట వింటాను
స్ఫూర్తి పొందుతాను.
గుడిపల్లి , నిరంజన్
94933 19878