నిన్నటి దాకా పాటలతో మెరిసిన రూపం
నేడు పాటలలో వెలిగే దీపం
ఎన్నో గుండెల్ని తట్టిలేపిన ఆ పాట
ఇక జ్ఞాపకాల్ని మాత్రమే
తట్టి లేపేదిగా మారటం ఎంత దుర్భరం!
ఎంత పాడినా ఇంచుక కూడా తప్పని శృతి
ఎందుకో.. ఉన్నట్టుండి గతి మార్చింది
కఱకు కాలగతి కన్నీరు మిగిల్చింది..
అసంఖ్యాక వేదికలపై నర్తించిన ఆ పదాలు
మన మనోఫలకాలపై చెరగని దృశ్య ముద్రలు
ఘన తెలంగాణను ఏ కొంచెం తక్కువ చేసినా
తన సున్నిత హృదయంతో హార్డ్ ఎటాక్ ఇచ్చిన
ఆ గుండె ఎంతో పదునైన ఆయుధం!
బారికేడ్ల గట్లు తెగి అలుగు పారిన
ప్రజాభిమానవాహినిని
కార్డ్‌లెస్ మైక్‌తో నియంత్రించిన ఆ గొంతు
ఎంతో పదపేన్న హృదయం..
పదం వెనుక పదం కురిసిన జానపద పాట
కదం వెనుక కదం కలిపిన మన పల్లెల ఆట
నేడు ఒక కలగా మిగిలింది
ఒక కళగా మెరిసింది
సోలో ఆర్కెస్ట్రాగా ప్రతిధ్వనించడం తప్ప
లయ తప్పటం తెలియని ఆ పాటపై అసూయనో ఏమో!
ఆ గుండె లయ తప్పింది
ఎదుటి గుండెల్ని బరువెక్కించింది..
నిన్నటి దాకా అతనో పాటల పూల వాన
నేడు ఆ పాటపై అభిమానుల పూల వాన..
మొన్న పిడికిలెత్తి సై అన్న ఉద్యమ వేదికల ఊపు
నిన్న చెయ్యెత్తి జై అన్న ఉత్సవ వాటికల రూపు..
మన సాయిచంద్ పాట
ఒక ఆకలి కేక
ఒక ఆవేశపు శంఖానాదం
ఒక అర్థవంతమైన ఆవేదన
ఒక ఆలోచనాత్మక అభ్యర్థన..
ఒక మార్పును కాంక్షించే హెచ్చరిక
ఒక అమర గీతమైన అంజలి
ఒక ఆత్మ విశ్వాస ప్రాంజలి
ఒక చైతన్య నినాదం
ఒక స్పందనాత్మక కళా సంవిధానం
ఒక ఉద్వేగపూరిత ఉచ్ఛ్వాస
నైరాశ్యాన్ని పారద్రోలే నిశ్వాస
తమ్ముడు సాయిచంద్..
మొన్నైనా.. నిన్నైనా.. రేపైనా..
రాష్ట్రమంతా మోగిన పాట..
తెలంగాణా తియ్యందనంతో మాగిన మాట
ఇప్పుడు హఠాత్తుగా ఆగిపోయిన పాట…
– మడిపల్లి దక్షిణామూర్తి