సామాజిక మాధ్యమాలా?
వైరుధ్య అగ్నికీలల మంటలా?
ఏ మాధ్యమం ఎవడి ప్రతినిధి అయినా..
‘సత్యం వద! ధర్మం చర!!’
ఆర్యోక్తిని ప్రతినిత్యం వధించడమెందుకు?
పవిత్ర దేవాలయాలు, న్యాయ సంస్థలు
సత్యాసత్య విచక్షణా ప్రతిరూపాలు..
ప్రభుత్వ నిఘా సంస్థలు
ప్రజల ధర్మాగ్రహ మెరుగని దీనావస్థలు
భరోసా కరువైన సత్యశోధన విచారణలు
అత్యున్నత స్థాయిలోని అక్రమాల పుట్టలు
విష కీటకాల నెలవైన వికృతరూపాలు
అరణ్య రోదనలో అలమటించే నిజ నిర్ధారణలు
దేశవ్యాప్త సిగ్గుమాలిన ప్రజాస్వామ్య ఖూనీలు
నేటి ఆటవిక రాజ్యంలో…
దురాచారాల పాలైన సదాచారాలు
ప్రజాభీష్టమనే ప్రజల నాడి-కల్పతరువు
ప్రలోభాల వేలంలో విలపించే దుర్దశ
నివ్వెరపోయిన నాగరిక సమూహాలు
వ్యవస్థల విష వలయాల్లో
బందీయైన రాజకీయ చదరంగం
తక్షణ పరిష్కారమెరుగని అక్రమాల అకృత్యాలు
రాజ్యాధికార చట్రంలో దాక్కున్న అక్రమార్కులు
అధికారం పెనుగులాటలో విద్వేష ధోరణులు
స్థాయిమరచి ప్రకోపాలపాలైన దుర్బల మనస్తత్వాలు
ఓ నా భారతమా!
సనాతన సత్సాంప్రదాయాలు..
నిష్ఠాగరిష్ఠుల నిలయమా!
ఏమిటీ దుస్థితి?
నడిసంద్రంలో తీరంకై తీరని అన్వేషణ
దరిచేర్చే నాథుడెవరో?
కలగన్న ‘కాలం’ కనుక్కుంటుంది.
కె.లక్ష్మణ్‌గౌడ్
97049 30509