“భోగే రోగభయం, కులే చ్యుతిభయం, విత్తేనృపాలాద్భయం,
మానే దైన్య భయం, బలే రిపు భయం, రూపే జరాయా భయం,
శాస్త్రే వాద భయం, గుణేఖల భయం, కాయే కృతాన్తాద్భయం,
సర్వం వస్తు భయాన్వితం భువినృణాం, వైరాగ్యమేవాభయం”
భోగాలకు సుఖరోగాలతో భయం, సద్వంశానికి అందలి అనాచారులతో భయం, ధనానికి రాజుతో భయం, అభిమానవంతులకు ఎప్పుడు దైన్య పరిస్థితి దాపురించునోననే భయం, బలానికెపుడూ
శత్రుభయం, సుందర రూపానికి వార్ధక్యంతో భయం, శాస్త్ర చర్చలకు లేనిపోని కలహాలు పుడతాయన్న భయం, గుణవంతులకు దుర్జనుల భయం, దేహానికి యముడితో భయం.ఇట్లా ఇలలోని నరులకు అన్ని విషయ వస్తువులూ భయంతో కూడుకున్నవే,ఏ భయం లేనిది వైరాగ్యమే అంటూ కారణాలను సోదాహరణంగా చూపుతూ వైరాగ్యమే మేలైనదని ప్రబోధించే ఈ శ్లోకం భర్తృహరి రచించిన ‘వైరాగ్య శతకమ్’ లోనిది.
సాంసారిక జీవితంలో ఉన్నప్పుడు ‘నీతి శతకమ్’, ‘శృంగార శతకమ్’లను సంతరించిన కవి భర్తృహరి, తాను అమితంగా ప్రేమించిన మూడో భార్య తనను నమ్మకద్రోహం చేయడంతో సన్యాసిగా మారి అడవిదారి పట్టిన తర్వాత ఆ యోగ జీవనంలో ఈ ‘వైరాగ్య శతకమ్’ రచించాడని చెప్పవచ్చును. ‘చూడోత్తంసితచారుచన్ద్రకవికా చంచచ్చిఖాభాస్వరో..’ (శ్లో 1.) సుందర చంద్రకళికను శిరోభూషణదీపంగా చేసుకొని భాసిస్తూ, అంతరంగ మోహాంధకారాన్ని తొలగిస్తూ యోగుల మనో మందిరాలలో జ్ఞానదీపమై శివుడు విరాజిల్లుతున్నాడని స్తుతిస్తూ భర్తృహరి ‘వైరాగ్య శతకమ్’ ప్రారంభించాడు.
ఇందులో శ్లోకాల భావాల ననుసరించి ‘తృష్ణాదూషణము’, ‘విషయ పరిత్యాగ విడంబనము’, ‘యచ్ఙా దైన్య దూషణము’, ‘భోగాైస్థెర్య వర్ణనము’, ‘కాల మహిమానువర్ణనము’, ‘యతినృపతి సంవాదము’, ‘మనస్సంబోధన నియమనము’,‘నిత్యానిత్య వస్తు విచారము’,‘శివార్చనము’, ‘అవధూత చర్య’ అనిపది శీర్షికలున్నాయి. శీర్షికకు పది చొప్పుననూరు శ్లోకాలున్నాయి.
‘భ్రాన్తం దేశమనేక దుర్గ విషమం ప్రాప్తం న కించిత్ఫలమ్…’ (శ్లో.2) ఎవరూ పోలేని కొండా కోనల్లోనూ, దేశ ప్రదేశాల్లోనూ తిరుగుతూ సంపన్నుల కడ సేవావృత్తులు చేశాననీ, సిగ్గు విడిచి పరుల ఇళ్ళల్లో కాకి వలె భయపడుతూ మెతుకులు గతికాననీ కానీ తనకు ఏ ప్రయోజనమూ లభించలేదనీ, అయినా ఓ తృష్ణా! తృప్తి పడకుండా ఇంకా విజృంభిస్తూనే ఉంటావు. అంటూ భర్తృహరి తృష్ణా దూషణం చేస్తాడు. ‘ఆశానామనదీ మనోరథ జలా, తృష్ణా తరంగాకులా..’ (శ్లో.10). కోరికల జలాలూ, తృష్ణాతరంగాలూ, అజ్ఞాన సుడిగుండాలూ గల ఆశ అనే పేరు గల దాటరాని నదిని- స్వచ్ఛ హృదయ యోగీశ్వరులే దాటి ఆవలిగట్టున ఆనందంగా ఉండగలరనీ చెబుతాడు. ‘అవశ్యం యాతా చిరతరముషి త్యాపి విషయాః..’ (శ్లో.12) పరితాపాన్ని కలిగిస్తూ వెళ్లిపోయే భోగాలను మనిషే స్వయంగా పరిత్యజిస్తే అనంత మనశ్శాంతితో ఉండగలడు కదా అని సూచిస్తాడు.
‘స్తనౌ మాంసగ్రంథీ కనక కలశానిత్యుపమితౌ..’ (శ్లో.16) కవివరులు మాంసపు ముద్దలైన పయోధరాలను బంగరు కలశాలనీ, తెమడకు నెలవైన ముఖాన్ని చంద్ర బింబమనీ
ఇట్లా వెగటు వాస్తవాలను ఎంతో ఉన్నతంగా చేసి వర్ణించారనీ కవికులాన్నీఘాటుగా విమర్శిస్తాడు.
‘యే సన్తోష నిరన్తర ప్రముదితా..’ (శ్లో.29) లోకం లోపై వాడిచ్చిన సుఖాలతోనే కొందరు ప్రమోదంగా ఉండేవారుంటారనీ, ధన లుబ్ధుల ఆశాదాహం ఎంతకూ తీరనిదనీ, మరి గొప్ప సంపదలున్న బంగారు మేరు పర్వతాన్ని ఆ బ్రహ్మ ఎందుకు, ఎవని కోసం సృష్టించాడని ప్రశ్నిస్తూ, తనకు మాత్రమిది నచ్చడం లేదనీ పెదవి విరుస్తాడు భర్తృహరి. ‘సా రమ్యా నగరీ, మహా స్స నృపతీ, సామన్త చక్రం చత…’ (శ్లో.41) ఆనాటి అందమైన రాజధానీ నగరమూ, ఆ మహారాజూ, ఆ సామంతరాజ సమూహమూ, పండిత సభా, చంద్ర బింబాననలూ, వందిమాగధులు, ఆ కథాకలాపాలన్నీ ఇపుడు స్మృతులు గానే మిగిలిపోయాయనీ, ఏదైనా, ఏమైనా చేయగలిగే ఆ కాలానికి నమస్కారం అంటూ మహా బలీయమైన కాల పురుషుడికీ నమస్కరిస్తాడు.
‘యత్రానేకే క్వచిదపి గృహే తిష్ఠ, త్య ధైకో.. కాలః కాళ్యా భువన ఫలకే క్రీడతి ప్రాణి శారైః’ (శ్లో.42) లోకం ద్యూతపాళి అనీ, కాలుడూ, కాళికాదేవీ ఇద్దరూ రాత్రీ దినమూ అనే పాచికలను పారిస్తూ మనుషులనే కాయలతో ఆటలాడుతున్నారనీ చెప్తాడు.
‘క్షణం బాలో భూత్వా, క్షణమపి యువా కామ రసికః..’ (శ్లోకం) జీవిత నాటకంలో నరుడు క్షణకాలం బాలుడై, క్షణకాలం యౌవన కామరసికుడై, క్షణం ధనం లేనివాడై, క్షణం సంపన్నుడై, ముసలివాడై నాటకాంతంలో యమరాజధాని అనే తెరవెనుకకు చొచ్చుకొని వెళ్లిపోతాడనీ భర్తృహరి వివరిస్తాడు. (16వ శతాబ్దంలోని ఆంగ్లకవి షేక్స్పియర్ సైతం జీవితాన్ని నాటకంతో పోల్చాడు) ‘మోహం మార్జయ, తాముపార్జయ రతిం చన్ద్రార్ధచూడామణౌ..’ (శ్లో.64) ఓ మనసా! ఇకనైనా అర్ధ చంద్ర చూడామణీధారుడైన శివుడి ఆరాధనలో లీనమవ్వు, మందాకినీ తీరభూముల్లో నివాసానికి అంగీకారం తెలుపు! అలలూ, నీటి బుడగల పట్లా, మెరుపుతీగల పట్లా, స్త్రీల పట్లా, జ్వాలా శిఖముఖాల పట్లా, పాముల పట్లా, పడియల పట్లా ఇల లో విశ్వాస ముంచదగునా- అంటూ తన మనసుకూ జాగ్రత్తలు చెబుతాడు. ‘మహేశ్వరే వా జగతామధీశ్వరే, జనార్దనే వా జగదన్త రాత్మని..’ (శ్లో.84) తనకు మహేశ్వరుడి పట్లా, మహా విష్ణువు పట్లా భేదభావం లేదని అంటూ అయినా తరుణ చంద్రుడిని ‘తలపై ధరించిన మహేశ్వరుడి పైన తన ప్రగాఢ భక్తి’ అని అంటాడు.
‘కదా వారణస్యామమర తటి నీరో ధసి వసన్’ (శ్లో.87) కాశీలోని పవిత్ర గంగానదీ తీరాన, గోచీ పెట్టుకుని కూర్చుండి శిరసుపై చేతులను ప్రాంజలిగా జోడించి నిలిపి ఉంచి’ ఓ గౌరీనాథా! త్రిపురాంతకా ‘పాలాక్షా! నను దయచూడు’మని ప్రార్థిస్తూ దినములను నిముషాల వలె తానెప్పుడు గడపల గలనో- అంటూ తహతహలాడుతాడు.
‘మహి రమ్యా శయ్యా, విపులముపధానం
భుజలతా..’ (శ్లో.94) భూమి అతడికి-నిద్రించే విశాలశయ్య; అతడి బాహులతే విపులమైన తలగ డ; అతడికి ఆకాశమే-ఆశ్రయమిచ్చే చలువ పందిరి; మందమారుతమే అతడికి వింజామర; చంద్రుడే అతడికి దీపం; అతడు వైరాగ్య వనితా సమాగమంతో సంతృప్తుడూ, శాంతుడు; ఆ యోగి ఆఖండైశ్వర్య మహారాజు వోలె హాయిగా నిదుర పోతాడు- అని యోగి జీవనాన్ని వర్ణిస్తాడు.
‘మాతర్మేదిని! తాత మారుత! సఖే తేజః సుబన్ధో జల!…’ ’శ్లో.100) నా తల్లీ భూమీ! నా తండ్రీ.. ఓ మారుతమా ! నా మిత్రుడా ఓ అగ్ని! నా చుట్టమా ఓ ఆకాశమా! మీకిదే చివరిసారిగా నమస్కరిస్తున్నాను, మీ సాంగత్య పుణ్యంతో కలిగిన ఉజ్జల స్వచ్ఛ జ్ఞాన ప్రకాశంతో మోహాంధకారం తొలగిపోయిన వాడినై పరబ్రహ్మలో సంలీనమైనపోతున్నాను!!! – అంటాడు భర్తృహరి ‘వైరాగ్య శతకం’లోని చివరి శ్లోకంలో! విధాత సృష్టిలో స్థిరమైనదేదీ లేదంటూ భర్తృహరి రచించిన ఈ శతకంలోని శ్లోకాలు వైరాగ్యాన్ని ప్రబలంగా ప్రబోధించేవే! మనసుపెట్టి లోతుగా చదివితే సంసారులూ యోగులుగా మారే అవకాశాలు లేకపోలేదు!
‘రఘువర్మ’ (టీయల్యన్)
92900 93933