ఎవరున్నారని
ఆ మట్టిపై కాలు పెట్టడానికి వెళ్తున్నావు తల్లి…
నువ్వు పాతిన మొక్కలు ఇప్పుడు
అక్కడ లేవు నీతో ఊసులాడటానికి
నువ్వు చేదతో నీరు తోడిన మంచినీటి బావి
ఇప్పుడు అక్కడ లేదు
నీ రూపాన్ని ఆ తేటనీటిలో చూసుకోవడానికి…
మీ అమ్మ నడిచిన నేలపై
ఇప్పుడు కొత్త మట్టి కప్పారట
ఇకపై ఆమె అడుగులు నీతో మాట్లాడకూడదని
ఇంకా అక్కడ ఏం మిగిలిందని వెళ్తున్నావు తల్లి?
మీ నాన్న కట్టిన భవనాలు
ఆనవాళ్లు చెరిపేసి కొత్త రంగులు వేశారట
నిన్ను ఇప్పుడవి పలకరించవు…
ఇప్పుడు అక్కడ నిన్ను చూసి
నీ ఇంటి పక్క కొండగాలి నువ్వు వచ్చావని
సంతోషంగా ఒక్కసారి మాత్రం అలా వెళ్లిపోతుంది
నీ మీద వాలి…
ఆకాశంలో ఎగిరే పక్షులు
నిన్ను గుర్తుపట్టలేని కొత్త ముఖాలు
నీ జ్ఞాపకాలను చెరిపేసిన
సరికొత్త భవనాలు
అక్కడ వేలాడుతున్నాయి
ఏరుకోవడానికి ఇప్పుడు అక్కడేమీ మిగిలి లేవు
వెడితే వెళ్లు
జ్ఞాపకాలు కన్నీటిగా జారిపోవడమే తప్ప…
ఇప్పుడు నీ కన్నీటిని తుడిచే అమ్మ చేతులు లేవు
నీ హృదయాన్ని హత్తుకునే నాన్న ఆలింగనాలు లేవు
వెడితే వెళ్లు ఒంటరిగా
గుండెల్లో దుఃఖాన్ని బరువుగా మోసుకురావడానికి…
పొత్తూరి
సీతారామరాజు
99488 49607