ఎక్కడో పాతరేశాం
ఆత్మీయ బంధాలకు
ఉరికొయ్యలు తగిలించి..
బలహీనమై
దిగులుగా చూస్తుంటే
పగలబడి నవ్వుతున్నాం
దూరాలకు విలువలనిస్తూ
అక్కడెక్కడో.. పాతవైన
అనురాగాలు పలుచబడి
మనసును చీలుస్తూ
చిరుగుతున్నాయి.
తగిలే గాయాలు ఎండిపోతూ
తిరిగి ఒరుసుకుంటున్నాయి
పచ్చిగా ప్రాణం పోసుకుంటూ..
ఓ మనిషీ!
భూమ్మీద ఒకచోట
ఆరడుగుల నేల
నీ రాక ఎప్పుడని అడుగుతున్నది
వినపడనట్టు పరిగెడుతావేం?
కొరగాని బంధాలు బిగించుకొని
డబ్బు చుట్టూ తిరుగుతుంటే
స్వార్థానికి అభిమానాన్ని
అమ్మకానికి పెడితే
ఎవరూ మిగిలి ఉండరు
కన్నీటి చుక్క విడవడానికి కూడా…
అరుణ ధూళిపాళ
87123 42323