‘అద్దం అబద్ధం ఆడదు
మాయా దర్పణాలు సుబద్ధమాడవు
పేదరికం తగ్గింది
పేదలు పెరిగారు’
తెలుగులో అభ్యుదయ కవిత్వం మొదలుకావడంతోనే వచన కవిత్వం మొదలైంది. తెలుగు వచన కవిత్వం గత 90 ఏండ్లలో రూపపరంగా అనేక ప్రయోగాలకు లోనైంది. 18 పర్వాలు ప్రాచీన కావ్యమైతే, 18 పాదాలు ఆధునిక కవిత అనిపించుకున్నది. ఎన్ని గజాలు రాశామన్నది కాదు, ఎన్ని నిజాలు చెప్పామన్నది ప్రధానమని కూడా అనిపించుకున్నది. ఒకటి, రెండు పుటల్లో కవితలు వస్తున్న కాలంలోనే దీర్ఘకవితలు, వచన మహాకావ్యాలు వచ్చాయి. గత మూడు దశాబ్దాల్లో మినీ కవిత, హైకూలు, నానీలు, నానోలు, గాథలు, రెక్కలు వంటి అనేక ప్రయోగాలు జరిగాయి.
‘నిజం’ కలం పేరుగా గల కవి జి.శ్రీరామమూర్తి. ఈయన ‘నివురు’, ’నాలుగో పాదం’ వంటి వచనకావ్యాలు రాసి, ఇప్పుడు ‘రంగురంగుల సూర్యోదయాలు’ అనే ముక్త కవచన కవితల సంపుటి ప్రచురించారు. ఇవి నానీలు, రెక్కలు, గాథలు, మినీ కవితలు వంటి ఏ ప్రక్రియకూ చెందినవి కావు. కవి కూడా వీటికి రూపపరమైన పేరేదీ పెట్టలేదు. అన్నీ స్వతంత్ర కవితలు. నాలుగు పాదాల కవిత. ప్రతి కవితా రెండు భాగాలుగా ఉంటుంది. మొదటిభాగం ప్రతిపాదనగా, రెండవ భాగం దానికి వ్యాఖ్యగా ఉంటుంది. మొదటిభాగంలో సామాజిక వాస్తవికత వస్తువుగా, రెండవ భాగంలో దాని మీద కవి దృక్పథంగా ఉంటాయి. ‘రంగురంగుల సూర్యోదయాలు’ అంటే విభిన్న వస్తువులు గల కవితల సమాహారం.
ఈ కవితలు మాటల ముక్కలు కావు. వర్తమాన, సామాజిక వాస్తవికతను తనదైన వ్యాఖ్యలతో కవి ఆవిష్కరించారు. వర్తమాన ఆర్థిక, రాజకీయ, సాంఘిక సాంస్కృతిక, తాత్విక రంగాల మీద కవి చేసిన సృజనాత్మక విమర్శలు ఈ సూర్యోదయాలు. ఈ కవితలలో మనకు ప్రధానంగా కనిపించేవి ప్రకృతిని మానవీకరించడం, మనిషిని ప్రకృతీకరించడం, మనిషికీ ప్రకృతికీ గల సంబంధాన్ని చెప్పడం, ప్రకృతి ముందు మనిషి ఎంత దిగువన ఉన్నాడో చెప్పడం వంటివి.
‘రెండు పూల మధ్య ఖాళీని
పరిమళం పూరిస్తుంది
ఇద్దరు మనుషుల మధ్య బంధాన్ని
మతం నరుకుతున్నది’
ప్రకృతి గత వస్తువులు తమ మధ్య ఏర్పడిన ఖాళీలను పూరించుకుంటుంటే, మనుషులు తమ మధ్య మతంతో దూరం తెచ్చుకుంటున్నారని కవి దెప్పి పొడిచారు. మతోన్మాదుల మాడు పగులగొట్టే చురక ఇది.
త్రిదండి చినజియ్యరు స్వామి ఇటీవల సమతామూర్తి పేరుతో రామానుజుని విగ్రహాన్ని భారీఎత్తున హైదరాబాద్ లో ఆవిష్కరింపజేశారు. అలాంటి వారే ఒక సమయంలో కులాలు పోకూడదు, ఉండాలి. ఏ కులం పని ఆ కులం చేయాలి. ఏ తిండి తిన్న వాళ్లకు ఆ బుద్ధులు వస్తాయని చెప్పిన మాటలు చాలా వివాదమయ్యాయి. సాంఘిక వివక్షకు గురౌతున్న సామాజిక న్యాయవాదులు ఆయన అభిప్రాయాలను తీవ్రంగా ఖండించారు. బహుశా ఈనే పథ్యంలో ‘నిజం’ కవి ఒక ముక్తకం రాశారు
‘ఇక్కడ జరుగుతున్నది
ఏమిటో యికనైనా తెలుసుకోండి
కులం అణచివేతల
జియ్యరుల రాజ్యమండి’
కవిత్వం మీద కవిత్వం రాయని తెలుగు కవులు అరుదుగా ఉంటారు. పది కవితలు రాస్తే ఒకటైనా కవిత్వం మీద కవిత ఉంటుంది. నిజాం కవి కూడా ఈ తానులో పోగయ్యారు. కవిత్వం గురించి పాతిక దాకా కవితలు రాశారు. ఈయనకు తాను చేసే పనిమీద అపారమైన నమ్మకమున్నది.
‘శబ్దానికి చితి
పేర్చడమే నా పని
అది కవిత్వమై
మండుతుంది’
‘నిజం’ కవి శ్రీరామమూర్తి ‘రంగుల సూర్యోదయాలు’ కావ్యం నిండా వర్తమాన సామాజిక వాస్తవికతలోని అనేక పార్శ్వాలు విమర్శనాత్మకంగా ప్రతిబింబిస్తున్నాయి. వేమన లాగే ఈయన కూడా తన వస్తువును అభివ్యక్తం చేయడానికి తన పరిసర ప్రకృతినే ఆశ్రయించారు. ఈ కావ్యంలోని కవితలు ‘గట్టి గింజల పంట’ వంటివి. ఇవి చూడటానికి సూత్రప్రాయాలు, చెప్పడానికి భాష్యప్రాయాలు.
రాచపాళెం
చంద్రశేఖర రెడ్డి
94402 22117