పాపకు జ్వరమొచ్చింది
ఆసుపత్రి పిలిచింది
భోరున అమ్మ ఏడ్వచ్చు..
నాన్నవు నువ్వేడువద్దు..
కొడుకుకు యాక్సిడెంటు..
చిన్న దెబ్బలే ..
అమ్మది లబోదిబో ఏడుపు
నాన్నవు నువ్వు ఏడువరాదు..
పిల్లలను దూర ప్రాంతంలోని
చదువులకు పంపడం
ఆపై విదేశాలకూ, ఉద్యోగాలకూ..
అమ్మ హాయిగా ఏడ్వచ్చు..
నాన్నవు నువ్వేడువకూడదు..
బిడ్డకు పెండ్లి చేసి
అత్తారింటికి సాగనంపినప్పుడు..
తల్లిది గుండలవిసేలా ఏడుపు
నాన్నవు నువ్వేడువనేవొద్దు…
నాన్న ఏడిస్తే బాగుండదు
నాన్న ఏడిస్తే.. ఒప్పుకోరు
నాన్న ఏడిస్తే.. ఆశ్చర్యపోతారు
నాన్న తన
ఏడుపు సముద్రాలను మింగి దిగమింగి
ఒంటరి నావలా బేలగా జీవన
తీరాల వైపు చూస్తూనే ఉంటాడు..
నాన్న.. తన గుండె పర్వత భారాలను
నిత్యం మోస్తూనే ఉంటాడు…
ఈ సముద్ర దుఃఖం
ఎవరూ చూడనిది,
ఈ కల్లోల భాష ఎవరూ చదువనిది!
ఎక్కడన్నా, ఎప్పుడన్నా సముద్రాన్ని చూస్తే
నాన్ననే గుర్తుకువస్తాడు!
డాక్టర్ కాసర్ల నరేశ్రావు
94414 06252