తెలుగు నేలమీద అనాదిగా అపూర్వమైన జానపద కళావారసత్వం విరాజిల్లుతూ ఉన్నది. భావి కళల నిర్మాణానికి అవసరమయిన పునాదిలాంటి ఆకారాలను జానపద కళలు అందిస్తాయనటంలోఎటువంటి అతిశయోక్తిలేదు. జానపదులు అంటే పల్లె ప్రజలు. వారు పాడేవి, ఆడేవి వారు కులాల పరంగా రూపొందించుకున్న కళారూపాలే జానపద కళలు.
మన దేశంలో జానపదకళలకు, సంగీతానికి ప్రత్యేక స్థానమున్నది. వేదకాలం నుంచి కాంస్యయుగం, రాతియుగం నాటి యాస, భాష పల్లెప్రజల నోటినుండి శ్రమైక జీవన సౌందర్య చిహ్నాలుగా, వినోద కాలక్షేపాలుగా వివిధ కులాలవారి గీతాలుగా జానపద కళలు, సాహిత్యం రూపొందాయి.
ఈ దేశంలో అనేక మతాలు, భాషలు, ఆచార వ్యవహారాలున్నాయి. ఎక్కువమంది ప్రజ లు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఏ ఒక్క విషయంలోనైనా భాగస్వామ్యం గలిగిన జన సముదాయాలను జానపదులుగా భావిస్తే వాళ్ళకు సంబంధించిన కళలను, సాహిత్యాన్నీ జానపద కళలు, సాహిత్యమనీ, పామర కళలు, సాహిత్యాలనీ ఇలా పలుపేర్లతో పిలిచారు. వారు తమ మానసికోల్లాసం కోసం, సంతోషం కోసం ఉత్సవాలు, జాతరలు, వేడుకల సమయాల్లో ప్రజారంజనకు కొన్ని కళలను సృష్టించుకున్నారు. ఇవే జానపద కళలు. ఇవి ప్రజల సొత్తు కాబట్టే వాళ్ల జీవితాలకు, అలవాట్లకు, ఆచార వ్యవహారాలకు, సుఖదుఃఖాలకు అద్దం పడుతాయి.
జానపద కళలు తెలుగునాట వివిధ రూపాలుగా కనిపిస్తాయి. అనుకరణ నృత్యాలు, బొమ్మలాటలు, వీధినాటకాలు, యక్షగానాలు, వీధిభాగవతాలు, పగటివేషాలు, కలాపాలు, భజనలు, కులగాథాగానాలు, సుద్దులు, జాతర వేషాలు ఇలా ఎన్నో. వీరిలో ఎక్కువమంది విద్య నేర్వకున్నా ప్రత్యేక ఉచ్చారణతో గేయాలు, పద్యాలు, కథలు కంఠస్థం చేసి ఉన్నారు. వీరే మన మౌఖిక సాహిత్య సంరక్షకులు.
తెలుగునాట జానపద కళలు రెండు రకాలు (1) సర్వ జానపదకళలు (2) వృత్తి జానపదకళలు ఎన్నో జానపదకళలు మన తెలుగువారి సొత్తుగా శతాబ్దాలుగా ప్రజలకు వినోదాన్నీ, విజ్ఞానాన్ని అందిస్తున్నాయి. తెలుగువారి జానపదకళల్లో ఎక్కువగా ఒక ప్రత్యేక కులం వారు వారికి జీవనోపాధినిచ్చే వృత్తిగా స్వీకరించిన కళాకారులు ప్రదర్శించే కళలే! ఒగ్గుకళ, పంబకథ, ఆసాధికథ, బైండ్లకథ, కొమ్ములకథ, పాండవకథ, రుంజకథ ఇలాంటివి. ఇవికాక కోలాటం, చెక్కభజన, పండరి భజన మొదలయినవి.
తెలుగు జానపదకళలను మరోరకంగా కూడా విభజిస్తారు, ఎవరు, ఎవరికి ప్రదర్శిస్తారు. అనే అంశం ఆధారంగా ఈ విభజన జరుగుతుంది. వీటినే అనియతాశ్రయ కళారూపాలు, ఆశ్రిత కళారూపాలు అంటారు. అంటే కళాకారులు తాము ఎవరికోసమైనా ప్రదర్శిస్తే ఇది అనియతాశ్రయ కళారూపం.
ఉదాహరణ: పాములవారు, హరిదాసులు, బహురూపులవారు, పగటి వేషగాళ్ళు, తోలుబొమ్మలాటలు.
ఆశ్రిత జానపద కళలకు ఉదాహరణ: రుంజ కథలు. ఇది ప్రత్యేకంగా విశ్వకర్మ లేదా విశ్వ బ్రాహ్మణులయిన ఐదు దాతృకులాలకు మాత్రమే ప్రదర్శితాలు. ఇతరులు వినవచ్చు. అలాగే కూనపులివాళ్లు, జెట్టివాళ్లు, గోసంగివాళ్లు. ఇలా 60 కులాలవారికి వారి ఆశ్రితులు మాత్రమే కథ చెప్తారు. ఇది ఆశ్రిత జానపద సాహిత్యం. ఇవి మొదట ఏకవ్యక్తి ప్రదర్శనలుగా ఉండి తర్వాత బహువ్యక్తి ప్రదర్శనలయ్యాయి.
ముగ్గురు చెప్పే కథ పిచ్చుకుంటి కథ. పాండవుల కథ, గొల్ల సుద్దులు, ఒగ్గుకథ మొదలగు కళాకారులు చెప్పే కథను ముందుగా ఒక గుడ్డ మీద చిత్రిస్తారు. నాలుగైదు అడుగుల వెడల్పుగల గుడ్డ 40 నుంచి 50 అడుగుల పొడవున చుడతారు. ఈ చుట్టను సమాంతరంగా ఉన్న రెండు గుంజలపైన అమర్చి పటాన్ని విప్పుతూ ప్రధాన కథకుడు చిత్రించిన బొమ్మలను కర్రతో చూపిస్తూ కథను సంగీత వాయిద్యాల సహాయంతో పాడుతారు. ఇలాంటివి మరికొన్ని తెలుగువారి కళారూపాలు చాకలి పటం, గౌడజెట్టి పటం, డక్కలిపటం, కూనపుని పటం కథలు. ఇవే పరిణామ క్రమంలో తోలుబొమ్మలాటకు తొలిరూపాలుగా చెప్పబడ్డాయి. తర్వాత వీధి నాటక ప్రక్రియ, నాటకం తర్వాతస్థానం పొందింది. ఆహార్యం, ప్రదర్శన వస్తువులు, రంగ సౌకర్యాలు, రంగోద్దీపనలు లేకుండా వీధినాటకాలు ప్రదర్శిస్తారు. తెలంగాణ, సర్కారు ప్రాంతాల్లో ఉన్న బయలాటలు కుప్పం వీధి నాటకాలు మొదలగునవి ఉదాహరణలు.
యక్షగానం:- నాటకానికి దగ్గరగా ఉండే యక్షగాన ప్రదర్శన రంగస్థలంలో, రంగస్థలం లేకుండా కూడా వివిధ పాత్రలతో ప్రదర్శిస్తా రు. చిందు యక్షగానం అతి ప్రాచీనమైనది. కూచిపూడి యక్షగానం కూడా ఈ సంప్రదాయానికే చెందింది. తూర్పుభాగవతం, కుప్పం నాటకం, చిరుతల యక్షగానం ప్రత్యేక యక్షగాన కళాసంప్రదాయాలు.
తోలుబొమ్మలాటలు:- ఈ కళా సంప్రదాయాలలో సాధించిన విజ్ఞానానికి ప్రతీకగా తోలుబొమ్మలాటల్ని చెప్పవచ్చు. మానవ పాత్రలను బొమ్మలతో ప్రదర్శింపచేయటం మానవుని కళాతృష్టకు నిదర్శనం. చెక్క బొమ్మలాటలు. ఇవి 12వ శతాబ్దం నుంచి ఉన్న ట్టు చారిత్రక ఆధారాలున్నాయి.
డాక్టర్ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి రచించిన తెలుగువారి జానపద కళారూపాలు గ్రంథంలో ఆదిమ మానవుని నుంచి గోల్కొండ రాజుల వరకు జానపద కళారూపాల అభివృద్ధిని జిల్లాల వారీగా వివరించారు. ఇంతకుముందు పేర్కొన్న కళారూపాలు గాక పేరిణినృత్యం, పగటివేషాలు, విప్రవినోదులు, జంగం కథలు, బుడగ జంగాలు, గారడీ విద్యలు, దేవదాసి నృత్యాలు, డప్పుల నృత్యం, భజనలు, బతుకమ్మ ఆటలు, ఫకీరు వేషాలు, గోండు నృత్యం, పెద్దపులి నృత్యం. జముకుల కథలు, గాంగాలమ్మ అశ్వనృత్యం, గంగమ్మ జాతరనృత్యం, జత్తులమారి కత్తులగారడి, వీరశైవుల వీరభద్రవిన్యాసాలు, గొల్లసుద్దులు, ఆరాధనా చిందులు, గిరిజన కళారూపాలు. ఆదిమవాసులనృత్యాలు, గిరిజన సంగీత వాయిద్యాలు, వాయుజన్య శబ్దవాయిద్యాలు. చిరుతల రామాయణం, ఎరుకలసాని ఎరుక. దొమ్మరాటలు, కాటిపాపలవాళ్లు, చెంచుల శ్రీరంగనీతులు, కొలుపుల సంబురాలు, కాటమరాజు కథలు, వీరముష్ఠివాళ్ళు, బడిపిల్లల పాటలు, ఉరుముల నృత్యాలు, కోలాట సంబరాలు. గంగిరెద్దుల ఆటలు, బైండ్లవాళ్ళు, సాధనాశూరులు ఇలా అనేకం ఉన్నాయి.
‘పిట్టలదొర’ పగటి వేషం జానపద కళారూపాల్లో చాలా ప్రాచు ర్యం పొందింది. మాటల్లో కోటలు దాటు తూ అతిశయోక్తులు కుప్పలుతెప్పలుగా కుమ్మరిస్తూ మాట్లాడే మాటలు వింటున్నవాళ్ళకి నవ్వు పుట్టిస్తాయి. జానపద కళారూపాలు అనాదిగా పల్లె ప్రజల అచ్చమై న ప్రతిభకు నిలువెత్తు నిదర్శనాలు. ఆయా కళారూపాల్ని ప్రదర్శించేటప్పుడు వారి సహజసిద్ధమైన ప్రత్యేక భాష, యాస, ధోరణి శ్రోతల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. జానపదం ఒక నదీప్రవాహం, ఆకాశమంత వి శాలమైనది. సముద్రమం త లోతైనది.. గాలిలా ఆ హ్లాదకరమైనది. జానప దం మన మూలధనం. దీన్ని కాపాడుకునే బాధ్య త మనందరిదీ! సాహి త్యం కళలు, ఏదైనా తాత లూ, తండ్రులు ఇచ్చిన ఆస్తి.
తప్పెటగుళ్లు: ఉత్తరాంధ్రలో ప్రదర్శితమయ్యే ‘తప్పెటగుళ్లు కళారూపం’ ప్రదర్శనకు అవకాశం ఉన్న సంగీత ప్రధానమైన అంశం. కోలాటం, వివిధరకాల భజన సంప్రదాయాలు, గిరిజన నృత్యాలు కూడా సంగీతంతో ప్రదర్శింపబడే కళారూపాలు.
డాక్టర్.సి. భవానీదేవి
98668 47000