సలికాలం సొచ్చిందంటే
ఇగం షురువైందంటే
ఇగ సగవెట్లుంటుండే…
మబ్బుల్నే లేసి సలిమంట కాగేతాన్కి
మక్క సొప్ప, నువ్వు కట్టె, కంది పొర్క,
వరి గడ్డి, సెక్క పొట్టు
సుదురాయించుకుంటుంటిమి…
గా సలి మంటనే నాకు దినాం
మబ్బుల లేసుడు నేర్పింది…
ఇప్పుడంటే తీరొక్క
గరపంగీలు తొడుక్కుంటున్నం…
అప్పుడు మా బాపు
పాద్దోతిని మడుతవెట్టి
సంకటి సేత్తుండే…
ముసి ముసి సీకట్లు వడంగ
సంకటి కట్టుకున్నమంటే
తెల్లారి ఎండెల్లే దాంక
ఇడకపోతుంటిమి…
గది మాకు ఇగపు సెగ
అంటకుంట ఎచ్చగుంచుతుండే…
పాద్దోతే గాదు
పాత సెద్దర్ల తోటి సుతం
సంకటి కట్టుకుంటుంటిమి…
ఇగ గొంగడి తోటైతే ఇంకా ఎచ్చగుంటుండే…
గప్పట్ల మా అందర్కీ గరపంగీలు
కొనాలంటే యాడైతుండే
గా సంకటే సక్కటి గరపంగి మాకు…
పిరపు గరపంగి కన్నా
పుకట్లనే తయారయ్యే
సంకటి కట్టుకొని
సంబుర పడుతుంటిమి…
గది నాకు లేకపాయే అని
మనాది పెట్టుకోకుంట
ఉన్నదాంతోటే తుర్తి పడి
సంబురాలకు పునాది ఎయ్యాలే…
సంకలమంటి సలినైనా
సంకటి ఆపినట్టు
అణికిచ్చే సలి అసుంటి
ఏ పాటి కట్టెమొచ్చినా
ఎచ్చటి సంకటి అసుంటి
ఇకమతులుండనే ఉంటయి…
ధైర్యం సెడకుంట దారి నడాలే…
అల్లాడి శ్రీనివాస్
83416 63982