నేను
చేవ చచ్చిన కలాన్ని మాట్లాడుతున్న
నన్ను, మట్టిలో కప్పిపెడితే గన్నై లేసి
అక్షరాలను తూటాల్లా మలిచి
దోపిడిపై యుద్ధం చేసి
జీవచ్ఛవంలా బతుకీడుస్తున్నా!
ప్రజల నెత్తి మీద
పేదరికం తాండవం చేస్తుంటే
ఆకలి పెను మంటై
తనువు దహించుకపోతే
ప్రశ్నించిన పాపానికి
ఊచలు లెక్కిస్తుంటే
అడగాల్సిన నేను
మెడలో దండలేసుకుని
ఊరేగుతూ
తలరాతలు మార్చినట్లు
సంబరపడుతున్నా!
ఇంద్రవెల్లి, బషీర్‌బాగ్
ముదిగొండ అడుగులో
అడుగులేస్తున్న కాళ్లను
నెత్తిన పెట్టుకొని
మోస్తున్న!
ఒక్కప్పుడు
న్యాయం కోసం, ధర్మం కోసం
నిప్పులు కక్కి
నేడు
అణగారిన ప్రజల
అస్థిపంజరాలపై
కార్పొరేట్‌కు బాటలేస్తున్న!
ఆకలి తీర్చుకొని
నడక నేర్చుకొని
నలుదిశలా పరిచయమై
మార్పు అనివార్యమని
జంధ్యాన్ని ప్రేమిస్తున్నాను
ఇదే.. అంతిమ లక్ష్యం అని
పేర్చిన శవాల గుట్టల కిందే
సేద తీరుతున్నాను..
నేను చేవ చచ్చిన పెన్నై
పుట్టినందుకు సిగ్గు పడుతున్నా!
– ఎదిరెపల్లి కాశన్న 96400 06304