మన భారతావని వ్యవసాయాధారితం.. అది పారంపర్య వృత్తి కావచ్చు, పారిశ్రామికం కావచ్చు, జీవనాధారమైనదీ కావచ్చు సకలం వ్యవసాయ నేపథ్యం కలది. వ్యవసాయ ఉత్పత్తికి ముందు.. పంటకోత తర్వాత ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, మార్కెట్ ఇలా అన్ని స్థాయిల్లోనూ మహిళలు ముందంజలో ఉండటం మహిళా సాధికారతకు గొప్ప సూచకం.
భారతదేశంలో 85% గ్రామీణ మహిళలు వ్యవసాయంలో నిమగ్నమై ఉన్నారు. భూమిలో విత్తు నాటినప్పటి నుంచి పంట చేతికొచ్చే వరకు పొలంలోని ప్రతి మూలా ఆమె చెమటతో తడుస్తుంది. శ్రామిక మహిళల చేయి తగలగానే పుడమి పొరలు పులకరించి పోతాయి.
మట్టి రేణువుల ప్రతి అణువణువూ సే ద్యానికి సిద్ధమంటూ మహిళకు దాసో హం అవుతాయి. పుడమి, పడతి పునరుత్పత్తి శక్తికి ఆనవాళ్లు. అందుకే అంటారు మేదినికి..మహిళలకు అవినాభావ సంబంధం ఉంటుందని. శ్రమ ను మరిచిపోయేందుకు పాటతో పనిలోనూ ఆనందాన్ని వెతుక్కుంటారు జానపదులు.
భూమి మొక్కకు జీవమిస్తుంది. అమ్మ జీవికి ప్రాణం పోస్తుంది. అందుకే అతివకు అవనికి మ ధ్య గల సంబంధం విడదీయరానిది. పొద్దు పొడ వగానే సద్ది కట్టుకొని పొలం పనులకు బయలు దేరుతారు మహిళలు. నారుమడులు వేసేటప్పటి నుంచి పంట కోతకొచ్చి తూర్పార బట్టే దాకా వాళ్లకు ఎంత శ్రమ ఉంటుందో పల్లెటూరి వాసనను ఆఘ్రాణించే ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రసవ వేదనేంటో నవమాసాలూ మోసి పురిటినొప్పులుఅనుభవించే ఆ అమ్మలకే తెలుసు భూగర్భం నుం చి విత్తు మొలిచేదాకా ఆ నేలతల్లి నిశ్శబ్దపు గాట్లబాధ. వీరి సమష్టి కృషిలో శ్రమైక జీవనం కని పిస్తుంది. ఆ కఠిన శ్రమను సైతం మరిచిపోయే లా పనిలోనూ ఆనందాన్ని వెతుక్కుంటూ పాడుకునే పాటలు వింటుంటే ఆ..నాగేటి చాళ్లల్లో అలా జీవి తం గడిచిపోతే ఎంత బాగుంటుంది. విత్తు నాట డం నుంచి వడ్లు దంచేదాకా వాళ్ళు పాడుకునే పాటల్లో ఆ సహజత్వం, దాన్లో ఇమిడి ఉండే నిగూ ఢార్థం అదే. పనిలోనే అలసటను తగ్గించి శ్రమను మరిపించి ఉత్సాహ ఉల్లాసాలను పంచి ఉత్పత్తిని పెంచే శక్తి పాటకుంది. అంతేకాదు జనజీవన సంస్కృతికి దర్పణం పట్టేవి కూడా ఈ జానపద పాటలే.. నాట్లు వేసే సమయంలో ఆ దేవదేవుడిని తలుచుకుంటూ..పాడుకునే ఓ చక్కటి పాట ఇది..
సేనూ ..సేనూ.. మల్లేశా
సేనులో నీ సేవ చేతును మల్లేశా…
నీ సేవ జేయంగ పానం మల్లేశా నిలువెల్ల సెమటలు దేవా మల్లేశా పాతాళ గంగల్లా నేను తానమాడంగా పాపాలు జర ఎడబాపంగా మల్లేశా..
బొమ్మంత పొద్దెక్కి పానం మల్లేశా.. బోనానికి వేళాయే .. సేనూ.. మల్లేశా
ఇక..సరదాగా పాడుకునే
బావా మరదళ్ల పాట ఇది..
మల్లె చెట్టు కిందికెల్లి పోయేటోళ్లు మదనో నా వయ్యారి
నా బావ బాలరాజు
మదనో నా వయ్యారి..
మల్లె చెట్టు కిందికి వెళ్లి మల్లే పూలు దెంపినాడే మదనో నా వయ్యారి..
తెంపీ జేబుల వోసినాడే మదనో నా వయ్యారి
ఇలాంటి పాటలు నారుమడి వేసే ముందు పాడుకుంటూ ఉంటారు. మరి వాళ్ళు ఏ సంగీత కళాశాలకూ వెళ్ళరు. పదాల వాడకంలో ఎలాంటి అనుభవమూ ఉండదు. తరతరాలుగా తమకు తాముగా పాడుకుంటూ వస్తున్న సంప్రదాయం ఇది. వారి జీవన సౌందర్యం ఆసాంతం ఆ పాటల్లో అలవోకగా కూర్చితే వినేవారు ఆ పాటకు దరువెయ్యాల్సిందే. ఒకరు పాడుతుంటే వారి బృందమంతా కోరస్తో అందుకుంటారు. చక్కటి పల్లె పదాలు వాడుతూ అంతే చక్కటి బాణీలు కడుతూ కఠిన శ్రమను మరిచిపోయి పాడుకునే పల్లె కోకిలలు వాళ్ళు. ఒక పాట లో దేవుణ్ణి కొలు స్తే..మరొక పాట లో సరదాగా బావా మరదళ్ల్ల సయ్యాటల సరాగాలు ఉంటాయి. ఇలా ఎన్నో… మరెన్నో..
చదువురాని పల్లె కోయిలలు పదహారేండ్ల పడుచు పిల్లల నుంచి పండు ముదుసలి వరకు అలా హాయిగా పాడుకుంటూ..చెట్టూ, పుట్టా..పులకించిపోయేలా సంగీతపు లయల్లో ఊగిపోతుంటారు. ఆ పాటలతో అనిర్వచనీయమైన అనుభూతినీ, ఆత్మ సంతృప్తినీ పొందుతుంటారు.
అల్లరి కృష్ణుణ్ణి ఆటపట్టిస్తూ గోపికలుగా మారిపోతుంటారు మరి.. ఆ పాటేంటో చుాద్దాం..
నెల్లూరి గొల్లభామ
పాలమ్మావాయో జువ్వీయో
ఈ కస్తూరి కాలువల్ల
కృష్ణుడెదురాయే జువ్వియో
ముసిముసి నవ్వులు నవ్వి
మునిగొంగులు పట్టే జువ్వీయో
పకపక నవ్వుతూ పైటలు పట్టే జువ్వీ యో /విడువిడువు కృష్ణయ్యా
నా పైటలిడువు జువ్వియో
నా చెంగు విడవయ్యా జువ్వీయో
ఇవేకాక పొలాల్లో కలుపుతీత సమయంలో పాడుకునే పాటలు కూడా ఉంటాయి. మచ్చుకు ఒక హాస్య రంజితమైన పాట ఇది..
ఓరి మగడా వయ్యారి మగడా
గొట్లూరు సెరువు కింద ఓరి మగడా
నేను వరిమడి నాటబోతి ఓరి మగడా
వరిమడి నాటబోతి నోరి మగడా
నన్ను ఎండ్రకాయ.. తేలుగుట్టే ఓరి మగడా
ఎండ్ర కాయ తేలు గుట్టే ఓరి మగడా
నాకు వరి కూడు వండి పెట్టరా ఓరి మగడా
నాకు గోధుమ రొట్టెలు
కాల్చి పెట్టరా ఓరి మగడా
నువ్వు జొన్న రొట్టెలు తినర ఓరి మగడా
నువ్వు కోరుకున్న మగనివైతే ఓరి మగడా
నాకు అన్ని జేసి పెట్టరాదే ఓరి మగడా..
మనసును ఓలలాడించే సరదా పాటలతో సాగే సేద్యం కేవలం మన తెలుగు పల్లెల గొంతుకల్లోంచి వెలువడేదేమరి..
ముఖ్యంగా పల్లె వాసులకు వ్యవసాయమే జీవనాధారం. ఆ జనాల హృదయాల్లోంచి స్వేచ్ఛగా పుట్టిందే జానపదం. ఇది కష్టపడి తయారు చేసిన సంగీతం కాదు. దీనికి ఎలాంటి నియమ నిబంధనలు ఉండవు. ఎవరికి ఇష్టమైన బాణీలో వారు పాడుకుంటూ ఉంటారు. వినోదం ఉల్లాసం అం దించడమే వీటి లక్ష్యం. తెలియకుండానే మనిషిలో మానవీయ సంస్కారాన్ని ఇనుమడింపజేస్తాయి. ఈ పాటల్లో ఉండే లయకు మనిషిలో ఒక రకమైన ఉత్సాహాన్ని రేకెత్తించే లక్షణం ఉంటుంది. పంట, ప్రకృతితో అనుసంధానమయ్యే మహాక్రతువులాంటిది. వ్యవసాయ కుటుంబాల్లోని మహిళలు విత్తు నాటేటప్పుడు తగిన పూజలు నిర్వహించి ఆ పొలంలో వాడే హలం.. దానిని వాడే హలధారికి అంతా సవ్యంగా జరగాలని కోరుతూ పాటలు పాడుకుంటూ ఉంటారు. అందరూ తోడుగా నిలిచి ఒకరికి ఒకరు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ పాడుకునే ఆ పాటల్లో ఎంతో మార్మికత దాగి ఉంటుంది.భూదేవికి ఉన్నంత ఓపిక స్త్రీమూర్తులలో ఉంటుంది కాబట్టి ఎంతో శ్రమకోర్చి ఈ వ్యవసాయ పనులు మగవారితో దీటుగా చేయగలిగే సత్తా ఉంటుంది. అంతటి శ్రమను మరిచిపోయే లా చక్కగా ఆడుతూ. పాడుతూ తమ పనులను చక్కబెట్టుకునే నైపుణ్యం కూడా వీరికి ఎవరూ నేర్పని విద్యేమరి !
ఉమారతన్ పాల్కే
99121 97473