ఇప్పుడు మనం కథానిక, నవల అని పిల్చుకునే ఆధునిక సాహిత్య ప్రక్రియలు రాత్రికి రాత్రి వూడిపడినవేం కాదు!వాటి వెనుకాల వందల ఏండ్ల సమష్టి కృషి దాగి ఉన్నది. సాహిత్య చరిత్రను సక్రమంగా అధ్యయనం చేయాలనే ఆసక్తి ఉన్నవాళ్లు ఓపిగ్గా ఆ కృషిలోని విభిన్న దశలను స్థలకాలాల ప్రాతిపదికగా పరిశీలించక తప్పదు! ఇక్కడ మనం ఆ ‘తప్పని పనే’ చేస్తున్నాం. అత్యధికులు అంగీకరించిన విషయమేమిటంటే, ఆధునిక కథానిక మన దేశంలోకి ఆంగ్ల సాహిత్య పరిచయం ద్వారానే అడుగుపెట్టింది. అచ్చుయంత్రం, పత్రికలు తదితర సమాచార సాధనాల ఆవిష్కరణ నేపథ్యంగానే ఇది సాధ్యమైందని ప్రత్యేకంగా చెప్పుకోవాలా? నగరాలుగా మారిన రేవు పట్టణాలను ఆశ్రయించుకునే భారతీయ భాషల్లో తొలితరం కథానికలు వికసించడమే ఇందుకు నిదర్శనం. ఇది కథానిక ప్రక్రియకు అమరిన చారిత్రక నేపథ్యమనే వాస్తవం మనసులో ఉంచుకొని ముందుకు పోదాం!
ప్రపంచమంతటా ‘మధ్యతరతి’ అని ఇప్పుడు మనం పిల్చుకునే ఆర్థిక సామాజిక, సాంస్కృతిక వర్గం ఆవిర్భవించడంతోనే, 18వ, 19వ శతాబ్దాల నాటికి నవల, కథానిక అనే ప్రక్రియలు వేళ్లూనుకుని నిలబడ్డాయి. 1719లో డేనియల్ డీఫో రాసిన ‘రాబిన్సన్ క్రూసో’నే ఇంగ్లిష్లో వచ్చిన మొదటి ఆధునిక నవల అని చదువుకున్న వాళ్లంటారు. గోల్, పో, చేవ్, మపాసాను తొలితరం కథానికా రచయితలుగా పరిణిస్తారని ఇంతకుముందు అనుకున్న మాటేగా! ఇక్కడ చెప్పుకున్న రచనలను లాక్షణిక క్లాసికల్ నవలా, కథానికా రూపాలని, అధ్యయన సౌలభ్యం కోసం అనుకుందాం. అయితే, వాటికి సాంప్రదాయిక లక్షణ గ్రంథాలతో దూరపు చుట్టరికం కూడా లేదని మన్నించ ప్రార్థన!
పాశ్చాత్య సమాజాల్లో కథానిక వెలువడిన 25-30 ఏండ్లకే భారతీయ భాషల్లోనూ తొలి కథానిక వెలువడింది. బంకిమ్చంద్ర తమ్ముడు పూర్ణచంద్ర ఛటోపాధ్యాయ 1870లో రాసిన ‘మధుమతి’ అనే బంగాలీ కథే మొట్టమొదటి భారతీయ కథానిక అంటారు. మరో ఏడేండ్లకు రబీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ‘బిఖారిణీ”కే ఆ గౌరవం దక్కాలని కొందరంటారు. అదలా ఉంచితే, రెండు మూడేండ్లనే తెలుగులో కథారచన మొదలైందన్నది ప్రముఖ రచయిత, పరిశోధకుడు వివిన మూర్తి లెక్క. ఆయన లెక్క ప్రకారం, గురజాడ తొలి కథానిక ‘దిద్దుబాటు’కు ముందు వెలువడిన ‘తొలి కథ’లు మొత్తం కలిపితే 92.
1902 నవంబర్ 1న వెలువడిన ‘హిందూసుందరి’ అనే మాసపత్రికలోనే ‘ధన త్రయోదశి’ అనే కథానిక రాశారు భండారు అచ్చమాంబ. 1893 నుంచీ ఆమె కథానికలు రాస్తూనే ఉన్నారట. కానీ, నిర్మాణపరంగా ఈ కథానిక పరిపూర్ణత సాధించింది. 1910లో ‘ఆంధ్రభారతి’ పత్రికలో ‘దిద్దుబాటు’, ‘మీ పేరేమిటి?’ కథానికలు అచ్చువేశారు. గురజాడ అప్పారావు. అదే పత్రికలో మరో రెండేండ్లకు మాడపాటి హనుమంతరావు తొలి కథానిక ‘హృదయ శల్యము’ అచ్చయింది. ఆ తర్వాత దశలో వచ్చిన కలుపు మొక్కలు, అరికాళ్ల కింద మంటలు (శ్రీపాద), మంత్రపుష్పం (మల్లాది), వింత విడాకులు (సురవరం), డిప్రెషన్ చెంబు (వేలూరి), ఎంకన్న (పి.యశోదారెడ్డి), చార్మినార్ (నెల్లూరి కేశవస్వామి) తదితర కథానికలు ప్రపంచంలోనే అత్యుత్తమ కథానికల శ్రేణిలో సుస్థిరస్థానం సంపాదించుకున్నాయి. దాదాపు రెండు శతాబ్దాలుగా తెలుగు సాహిత్యసీమను ఏలుతున్న రెండు ప్రక్రియల్లో కథానిక ఒకటి. (రెండోది, ఖండకావ్యం అనే కవిత; ముఖ్యంగా వచన కవిత!)
ఇప్పుడు మనం కథానిక అని పిల్చుకుంటున్న ప్రక్రియనే వందేండ్లకు ముందు చిన్న కథ, కథానికము, ఆఖ్యాన(క)ం లాంటి పేర్లతో ప్రస్తావించేవారు కాస్త చదువుకున్నవాళ్లు. (శ్రీపాద చిన్నకథల్లో అన్నీ కథానికలు కావు ‘వడ్ల గింజలు’లాంటివి కొన్ని నవలికలు కూడా. అదలా ఉంచండి!) 1936లో అనుకుంటా, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి ఈ ప్రక్రియకు కథానిక అనే పేరు సూచించారు.
అగ్నిపురాణంలో కథానిక అనే పద్య ప్రకియ ప్రస్తావన ఉందట. మధ్యయుగాలనాటి అష్టాదశ పురాణాల్లో అగ్నిపురాణం ఒకటి. అందులో కనబడిన ఓ ప్రక్రియ పేరు, వెయ్యేండ్ల తర్వాత ఇరవయ్యోశతాబ్దిలో రూపుదిద్దుకున్న సాహిత్య ప్రక్రియకు పెట్టడం భావ్యమేనా? అని ప్రశ్నించిన వాళ్లు లేకపోలేదు. కానీ, కవితకు ఆ పేరు స్థిరపడిన వైనం కూడా ఇందుకు భిన్నంగా లేదు! సామాన్యశకం ఏడెనిమిది శతాబ్దాల్లో అంటే మధ్యయుగాల ప్రారంభదశలో మొదలైందని చెప్పే భక్తి ఉద్యమం తొలిదశల్లోనే ఖండకావ్యానికి ‘కవిత’ అనేపేరు వాడుకలోకి వచ్చింది. అంటే కథానిక, కవిత అనే పేర్లు దాదాపు ఒకే సమయంలో వాడుకలోకి వచ్చిన కొత్త ప్రక్రియలు; ఈ కొత్తప్రక్రియలు రెండింటికీ వెయ్యేండ్ల నాటి పాతపేర్లు దాదాపు ఒకే సమయంలో వాడుకలోకి వచ్చాయి.
తెలుగు కథానిక విషయానికి వస్తే, హనుమచ్ఛాస్త్రి పెట్టిన పేరును చాలామంది రచయితలు అంగీకరించి, పాటించడం మొదలుపెట్టడంతో “షార్ట్ స్టోరీ” తెలుగులో ‘కథానిక’ పేరిట స్థిరపడింది. అలా, ఈ ప్రక్రియను కథానిక అనాలనే ఆనవాయితీ మొదలై తొంభై ఏండ్లు కావస్తున్నదన్నమాట.
మందలపర్తి కిశోర్
8179691822