ఆయన పద్యాలను హృద్యంగా ఆవిష్కరిస్తాడు. గేయాలను ఆర్ధ్రంగా పలికిస్తాడు. గంభీరమైన ప్రసంగాలతో అందరినీ మరపిస్తాడు. తెలుగులోనే కాదు, ఉర్దూలో కూడా కవిత్వం రాసి మెప్పిస్తాడు. కొత్త కొత్త భావాలతో కవిత్వమై అవతరిస్తాడు. ఆయనే అచ్చతెలుగు నుడికారాలతో, తెలంగాణ యాసలో, తెలంగాణ భాషలో శ్వాసించిన ప్రముఖ కవి వేముల పెరుమాళ్ళు.
వేముల పెరుమాళ్ళు 1943 జనవరి 8న ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రస్తుత జగిత్యాల జిల్లా రాయికల్లో రాజాగౌడ్, ఆండాళమ్మ దంపతులకు జన్మించారు. జగిత్యాలలో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన పెరుమాళ్ళు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని గ్రామసేవక్ శిక్షణా కేంద్రం నుంచి గ్రామీణాభివృద్ధిలో డిప్లొమా పూర్తి చేశారు. 1963 నుంచి 18 ఏండ్లపాటు గ్రామీణాభివృద్ధి అధికారిగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. చిన్నప్పటి నుంచే కవిత్వం పట్ల మిక్కిలి ఆసక్తి ఉన్న పెరుమాళ్ళు తెలుగు కావ్యాలు, వ్యాకరణ, అలంకార, తర్కశాస్ర్తాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. తెలుగులోనే కాదు, హిందీ, ఉర్దూ, ఆంగ్లభాషల్లో కూడా చక్కని పాండిత్యం సంపాదించారు.
పెరుమాళ్ళు తాత కైరం భూమదాసు గొప్ప వైష్ణవ భక్తుడు. వాగ్గేయకారుడు. ఆయన రచించిన కీర్తనలను పరిష్కరించిన పెరుమాళ్ళు ‘వరకవి భూమదాసు కృతులు’ అనే గ్రంథాన్ని ప్రచురించారు. రాజరాజేశ్వర శతకం, ధర్మపురి నృకేసరి శతకం, కిట్టు శతకం, నిమ్ము శతకం, గాంధీమార్గం, లోగుట్టు, తెలంగాణ జాతీయాలు, మానవతా పరిమళాలు మొదలైన 15 పుస్తకాలు రచించారు. ఆయనది మధురమైన కంఠస్వరం. ఆయన గొంతెత్తి కవితాగానం చేస్తుంటే సభాసదులంతా పరవశించిపోయేవారు. పద్యాలు, గేయాలు, పాటలు, వచనకవితలు మొదలైన ప్రక్రియల్లో రచనలు చేసి తెలుగు సరస్వతిని అలంకరించారు పెరుమాళ్ళు.
‘విద్దె గలుగువాడు బుద్ధి గలుగువాడు పైస గలుగువాని పాలబడిరి లక్షపతుల కేళి రాజకీయాలన మరువరానిది పెరుమాళ్ళు మాట’
‘లోగుట్టు’ రాజనీతి శతకంలో ‘మరువరానిది పెరుమాళ్ళు మాట’ అనే మకుటంతో ఆయన రాసిన ఇలాంటి నైతిక విలువలతో కూడిన అనేకమైన, అద్భుతమైన పద్యాలు మనకు లభ్యమవుతాయి. మహాత్ముని మహోన్నతమైన సూక్తులను ‘గాంధీమార్గం’ పేరుతో త్రిశతిగా రచించారు పెరుమాళ్ళు. ఈ పుస్తకాన్ని అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అంకితం చేయడం విశేషం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ‘జ్యోతిపథం’ శీర్షికన 20 సంవత్సరాల సుదీర్ఘకాలం ఆయన చేసిన ప్రసంగాలు అనేకమంది శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఆయన రాసిన పద్యాలు, కవితలు, వ్యాసాలు, ప్రముఖ దిన, వార, మాసపత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఎన్నో సాహిత్య సంస్థలతో సత్సంబంధాలు కలిగిన పెరుమాళ్ళు లెక్కలేనన్ని సభల్లో ప్రసంగాలు, కవితాగానాలు చేశారు.
‘తల్లి తలంటు పోసుకొనదల్చియు పిండితొ బొమ్మ చేసి శోభిల్లగ పోసె నాయువును, పెట్టెను కాపల ఈశుడెర్గకన్ వెళ్లగ పిల్లడాపె తలపెట్టి ఫణంబు గజాననంబుతో మళ్లీ వినాయకుండయిన మాన్యుని మ్రొక్కెద శ్రీ నృకేసరీ!’
తేటతేట మాటలతో అందరికీ అర్థమయ్యే రీతిలో కవిత్వం రాయడం పెరుమాళ్ళుకు వెన్నతో పెట్టిన విద్య. ఇలాంటి అద్భుతమైన పద్యాలెన్నో ధర్మపురి నృకేసరి శతకంలో మనకు దొరుకుతాయి. పార్వతీదేవి పిండితో ఒక బొమ్మను చేసి, దానికి ప్రాణం పోసి కాపలా పెట్టిన సన్నివేశాన్ని ఎంత రమణీయంగా అభివర్ణించాడో పై పద్యం చెబుతున్నది. తెలంగాణ భాష, తెలంగాణ యాస, తెలంగాణ తడి, తెలంగాణ సంస్కృతి, ఆయన కవిత్వంలో అడుగడుగునా మనకు కనిపిస్తాయి. దశాబ్ద కాలంగా కృషి చేసి, ఆయన మనకందించిన ఒక అపూర్వమైన కానుక ‘తెలంగాణ జాతీయాలు’. ఈ పుస్తకంలో కొంత భాగాన్ని ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు పాఠ్యాంశంగా రూపొందించటం మనకందరికీ గర్వకారణమైన విషయం.
‘తల్లంటే కనిపెంచి నేర్పి పెరిమన్ తప్పుల్ సహించేది ఆ తల్లే గాక మరొక్క తల్లి మనుచే దైవంబు వెన్నంటి, మాకెల్లన్ కొల్లగ సౌఖ్య సంపదలు కల్గించేది రాజవ్వ! రాజిల్లెన్ వేములవాడ అమ్మకు నుతుల్ శ్రీ రాజరాజేశ్వరా!’ అమ్మ అనురాగాన్ని, ఆత్మీయతను, అనుబంధాన్ని ముగురమ్మల మూలపుటమ్మ ప్రేమతో ముడివేసి వర్ణించడం ఒక్క పెరుమాళ్ళుకే సాధ్యమవుతుందనడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు.
‘విశ్వమంత కలిసి వెలివేసినను గాని దైవమందు సత్యధర్మమందు కలిగియున్న నమ్మకము వీడగా రాదు జాతిపిత హితోక్తి సత్యసూక్తి’
ఇలాంటి మనోజ్ఞమైన పద్యాలు ఆయన కలం నుంచి జాలువారాయి. వేముల పెరుమాళ్ళు హైదరాబాద్, బొంబాయి, పుణె వంటి ప్రాంతాల్లో పర్యటించి తన సాహిత్య స్పర్శతో అందరినీ అలరించారు. ఎన్నో పురస్కారాలు, బిరుదులూ, గౌరవ సత్కారాలు అందుకున్న వేముల పెరుమాళ్ళు 2005 సెప్టెంబర్ 17న పరమపదించినప్పటికీ సాహితీలోకంలో చిరంజీవియై వెలుగొందుతూనే ఉంటారు.
-తిరునగరి శ్రీనివాసస్వామి
9440369939