కవులు అన్ని జీవనచర్యల్లోనూ అప్రమత్తంగా ఉంటారు. అనుభవాలను హృదయం లోపలికంటా తీసుకుంటారు. ఆ ఉద్వేగాలను అక్షరాలుగా మారుస్తారు. తాను పొందిన ఆనందం, దుఃఖం, నిర్వేదం వీటన్నింటినీ ఎంత గొప్ప బొమ్మలుగా, బలమైన రేఖలతో మనసులో నిలుపుకొంటాడనేది అతని కవిత్వానికి ఊతమవుతుంది.
పుట్టుకతో మనిషి కవి కాదు. ఆకలైతే ఏడుస్తాడు. కొన్నాళ్లకు అమ్మను చూసి నవ్వుతాడు. నాన్నను గుర్తుపడతాడు. కుటుంబసభ్యులను దగ్గరికి తీసుకుంటాడు. వీధిలోకి వెళ్తాడు. స్నేహితులను చుట్టుకుంటాడు. అతని బాల్యం నిండా కొన్ని బొమ్మలుంటాయి. వయస్సు పెరిగేకొద్దీ ఆ బొమ్మలు జ్ఞాపకాలుగా మారుతాయి. ఆ తర్వాత మనిషిగా ఇతను బువ్వ సంపాదించుకోవడం, కాస్త దాచుకోవడం, కోపం, భయం, బెదురు, అసూయ, కుట్ర, ఆరోగ్యం, అనారోగ్యం వీటన్నింటి వలలో పడిపోతాడు. చిన్నప్పుడు సూర్యుడిని చూసి పరవశించిన తాను, చంద్రుడిని చూసి ఎగిరి గంతులేసిన తాను వయస్సు పెరిగే కొద్దీ వాటిని వదిలేసుకుంటాడు.
కవిత్వం వచ్చాక, విమర్శ మొదలవుతుంది. ఈ రోజు తెలుగు సాహిత్యంలో, కవి సంగమం వేదికగానూ, ఇతరత్రానూ కూడా చాలామంది కవులు కవిత్వం రాస్తున్నా, ఇంకా సంపుటులు ప్రచురించలేదు. అటువంటివారిని తెలుగు విమర్శాలోకం గుర్తిస్తుందా, కనీసం వాళ్లను చదివిందా అంటే జవాబు దొరకడం కష్టం. వీళ్లలోనూ, సంపుటులు ప్రచురించిన వాళ్లలోనూ, మంచి కవిత్వం రాసేవారిని, రాయగలిగిన వారినీ గుర్తించడం విమర్శకుడి పని. ఆ కవి సాధనాలు ఏమిటి? ఎట్లా కవిత్వం అవుతున్నాడు, ఎక్కడ విఫలమవుతున్నాడు, ఆ కవి మెరుగయ్యేందుకు ఏమైనా సూచనలు చేయగలమా అని ఆలోచించాలి. విమర్శ లక్ష్యం కవిత్వ స్థాయిని పెంచడమే తప్ప, సాహిత్య సృజనను అడ్డుకోవడం కాకూడదు. అది సాధ్యపడాలంటే, విమర్శ నిర్మాణాత్మకంగా ఉండాలి. దురదృష్టవశాత్తు ఇవాళ విమర్శ వ్యక్తుల మీద మళ్లింది. కేవలం లోపాలు వెతకడమే విమర్శగా మారిపోతున్నది. ఇది కవులకు, విమర్శకులకు మధ్య శత్రుత్వం పెంచడానికే తప్ప, సాహిత్యానికి ఎలాంటి హితవూ చేయబోదు.
కొన్ని వాస్తవాలు మాట్లాడుకుంటే మన కవిత్వ క్షేత్రం చాలా చిన్నది. కవిత్వం రాయనందువల్ల నష్టం లేదు. రాసినందువల్ల ఒనగూడే లాభమూ ఘనమైనదేమీ కాదు. సాహిత్యం ఒక కళగా భావించి, అది మరికొన్ని తరాలు నిలబడాలన్న సదుద్దేశం విమర్శకుల్లో ఉంటే, రాస్తున్న వాళ్లను గౌరవంగా చూడాల్సిన బాధ్యతను మొదటగా వాళ్లు తలకెత్తుకోవాలి. విమర్శ కఠినంగా ఉండవచ్చు, అచ్చుతప్పుల నుంచీ అన్వయ దోషాల వరకూ చర్చ పెట్టవచ్చు. రాసినవాటిలో బలం లేని వాక్యాలను కోకొల్లలుగా కోట్ చెయ్యవచ్చు, వాటినలా అనడానికి గల కారణాలను విశ్లేషించవచ్చు.
కానీ, రాయని కవితల గురించి మాట్లాడటం సబబు కాదు. ఒక కవిని పూర్తిగా చదవకుండానే, అతని కవిత్వాన్ని అంచనా కట్టడం సద్విమర్శకుల పని కాదు. మనకు నచ్చని ఒక కవి పుస్తకం తీసుకొని (అతను నచ్చకపోవడానికి అనేక కారణాలుంటాయి) దానిమీద విమర్శ రాసి, అది కూడా కేవలం లోపాలు చెప్పే విమర్శ చేస్తే విమర్శ లక్ష్యం సాధించలేకపోవచ్చు. దీని అర్థం విమర్శలో ప్రశంస ఉండాలని కాదు, అలా అని నిందలు వేయడం కూడా విమర్శ కాబోదు. విమర్శకుడికి సహృదయత మొట్టమొదటి లక్షణం. సాహిత్య సంస్కారం మొదటి అర్హత. ఉదాహరణకు ఒక కవి తన ఇల్లు, భార్య, అమ్మ, పిల్లలు చుట్టూ కవిత్వం అల్లాడనుకుందాం. ఇందులో అతను సమాజం గురించి మాట్లాడలేదు కాబట్టి ఇది చెత్త కవిత్వం అనకూడదు. ఇల్లు సమాజంలో భాగం కాదా?
కుటుంబాలు కలిస్తేనే సమాజమన్న కనీస స్పృహ విమర్శకుడికి ఉండాలి. ఆ కవి ఏ వస్తువునైతే తీసుకొని రాశాడో అందులో ఏమైనా అతను నిర్లక్ష్యం చేసినా, కవిత్వ నిర్మాణంలో లోపాలున్నా మాట్లాడాలి. విమర్శకుడికి అధ్యయనం ఉండాలి. సిద్ధాంతపరమైన బలం ఉండాలి. దృక్పథం పట్ల సూటిగా ఉండాలి. కవిత నిడివిని గమనించాలి. ఆగాల్సిన చోట ఆగలేని కవితలను విమర్శకులు గుర్తుపట్టాలి. కవిత్వానికి కూడా ఒక పరిధి ఉంటుందని అర్థం చేసుకొని, విమర్శ ఆ పరిధిలోనే చెయ్యాలి. నన్నయ మహా ప్రస్థానం రాయలేడు. తిక్కన అమృతం కురిసిన రాత్రి రాయలేడు. అలాగే శ్రీశ్రీ మహాభారతాన్ని, తిలక్ రామాయణాన్ని రాయలేరు. ఆయా కాలాలను బట్టి, సమాజాన్ని బట్టి సాహిత్యం వస్తుంది. సృజన లేకపోతే విమర్శ ఉండదని గుర్తుండాలి. కవుల పట్ల కనీస గౌరవం లేకుండా విమర్శకుడు మాట్లాడటం పద్ధతి కాదు.
ప్రతి కవి ప్రపంచాన్ని గురించి మాట్లాడాలని లేదు. సమాజం గురించి చర్చించాలని లేదు. అతను ప్రకృతి గురించి రాయవచ్చు. జీవితంలోని తాత్త్వికతను చూపవచ్చు. కవిత్వం నిండా సామాజికతను నింపవచ్చు. సామాజికతను గురించి మాట్లాడిన కవి గురించి ఇతను ప్రకృతి గురించి మాట్లాడలేదనే విమర్శ చేయకూడదు. అయితే ఇవాళ ఏ ఎండకు ఆ గొడుగు పట్టే కవులూ ఉన్నారు. ఒక కవి పుస్తకంగా మన ముందుకు వచ్చినప్పుడు పుస్తకం నిండా వైరుధ్యాలున్నట్టయితే, అట్లాంటి కవిని ఎట్లా అంచనా వేస్తాం. కవికి దృక్పథం లేనప్పుడు వైరుధ్యం కనిపిస్తుంది.
తన కవిత్వ లక్ష్యం కవికే తెలియని కాలం ఒకటి నడుస్తూ ఉన్నది. పరస్పరం ఖండించుకునే భావాలతోనే కవితా సంపుటి ఉంటే కవి విఫలమైనట్టు. సరైన దృక్పథంలో కవిత్వం లేనప్పుడు విమర్శ కూడా రాణించదు. కవికే సైద్ధాంతిక దృక్పథం లేనప్పుడు, విమర్శకుడు ఎట్లా అంచనా వేస్తాడు. వీళ్లు ఒకరకం కవులైతే, మరికొంత మంది కవులు తమ కవిత్వంలోని భిన్నత్వం ద్వారా, ప్రత్యేకత ద్వారా, తమదైన ఒక ైస్టెల్‌ను సృష్టించుకుంటున్నారు. వీళ్లను అంచనా వేయడంలో విమర్శకులు ఇప్పటికీ విఫలమవుతూనే ఉన్నారు. ఇట్లాంటి కవులను అంచనా వేయడానికి సరికొత్త పరికరాలు వెతుక్కోవలసిన అవసరం ఉన్నది.
వేగుంట మోహనప్రసాద్, ఎమ్మెస్ నాయుడు, రమణ జీవి వీళ్లను ఎట్లా విమర్శకుడు అంచనా వేయాలో పరికరాలు లేవు. న్యూట్రల్ కవులను ఎట్లా అంచనా వేయాలి? లాంటి ప్రశ్నలకు విమర్శకులు సమాధానాలు వెతకాలి. కానీ, దురదృష్టవశాత్తు విమర్శ పక్కదారులు తొక్కుతున్నది. పనిగట్టుకొని నెగెటివ్‌గా ప్రచారం చేయడం, పగబట్టి విమర్శించడం, కేవలం కవితా సంపుటిలోని లోపాలను మాత్రమే చెప్పడం ఇప్పుడు నడుస్తున్న విమర్శ. ఇక్కడినుంచి కాస్త సాహిత్య సంస్కారం వైపు, సహృదయత వైపు నడవాలని చెప్పేవాళ్లు కావాలిప్పుడు.
– డాక్టర్ సుంకరగోపాలయ్య 94926 38547