తెలుగు, సంస్కృత, తమిళ భాషల్లో ఉద్ధండ పండితుడైన సిరిశినహల్ కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌లో 1905, ఆగస్టు 13న జన్మించారు. తల్లిదండ్రులు వెంకటాచార్యులు, రంగనాయకమ్మ. పండిత వంశంలో జన్మించిన కృష్ణమాచార్యులకు చిన్నప్పటి నుంచే కవితలు, పద్యాలు రాయడం అలవాటైంది. వీరి విద్యాభ్యాసం మోర్తాడ్‌లో, తమిళనాడులోని శ్రీ పెరంబుదూర్‌లో జరిగింది. వీరి తాత గొప్ప సంస్కృత పండితులు. ఆయనతో కలిసి అనేక మంది కవి పండితులను తరచుగా కలిసే అవకాశం కలిగింది. దీనివల్ల కవిత్వంలో లోతైన అధ్యయనానికి వెలుగు బాట పడింది. కృష్ణమాచార్యులు జగిత్యాల జిల్లా కోరుట్లలోని సంస్కృత పాఠశాలలో అధ్యాపకులుగా చేరి అక్కడే స్థిరపడ్డారు. అందుకే, కోరుట్ల కృష్ణమాచార్యగా ప్రసిద్ధి పొందారు.
కృష్ణమాచార్యులు తెలంగాణ రాష్ట్రంలోనే తొలి శతావధానం చేశారు. వీరికంటే ముందు తెలంగాణలో ఎవరూ శతావధానం చేయలేదు. అందుకే నైజాం రాష్ర్టాద్య శతావధానిగా పేరు పొందారు. వీరు అనేక అష్టావధానాలు, శతావధానాలు చేశారు. తెలుగు, సంస్కృత భాషల్లో ఎన్నో కావ్యాలు, హరికథలు రాశారు. వీరికి చిత్రలేఖనంలో, సంగీతంలో చక్కని పరిజ్ఞానం ఉన్నది. వీరు పలికిందల్లా పద్యమై, రాసిందల్లా శ్లోకమై విరాజిల్లుతుంది. అలవోకగా, ఆశువుగా కవిత్వం అల్లడం ఈయనకు చిన్నప్పటి నుంచి అలవాటు.
కృష్ణమాచార్యులు కళాశాలాభ్యుదయం, మనస్సందేశ కావ్యం, ఆంధ్ర మహా నాటకం, రామానుజ చరిత్ర, మనోజ విజయ భాణము, జయతాల కోరుట్ల శతావధానములు, స్తుతిగీతములు, గాంధీ తాత నీతి శతకం మొదలైన పదిహేను కావ్యాలు తెలుగులో రాశారు. అలతి అలతి పదాలతో వినసొంపుగా సాగిన గాంధీ తాత శతకం ప్రసిద్ధ తెలుగు శతకాల సరసన నిలబడుతుందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఉదాహరణకు
మానవుడే మాధవుండును జ్ఞానంబున ప్రజల సేవ సలుపు మదియెనీ మానవతలోని మాన్య స్థానంబనె గాంధి తాత సద్గుణ జాతా
కృష్ణమాచార్యులు తెలుగులోనే కాక సంస్కృతంలోనూ అనేక కావ్యాలు రాశారు. సంపత్కుమార సంభవమ్, గురువంశ మహాకావ్యం, ధర్మపురి నృసింహ సుప్రభాతం, జియ్యరుస్వామి చరిత్రమ్, తత్తప్రకాశిక, అక్షరాది మార్గం, రహస్యత్రయమ్ మొదలైన పన్నెండు కావ్యాలు రాశారు. వీరి కవిత్వం మృదు మధురంగా, శైలి ప్రసన్నంగా ఉంటుంది. ఎంత తేటతెల్లమైన కవిత్వం రాయగలడో, అంత ప్రౌఢమైన పద్యాలనూ ఆశువుగా చెప్పగల ప్రతిభాశాలి కృష్ణమాచార్యులు. ధర్మపురి సుప్రభాతం నుంచి మచ్చుకు ఒక శ్లోకం.
సుర పండిత సుందర పాదయుగం వరదం మురదంభ హరం హృదమే ధర నివ్యరథాంగ ధరం మధురం వర ధర్మపురీ నరసింహమయే
మహాకవి కాళిదాసు సంస్కృతంలో రాసిన కావ్యత్రయమ్ రఘువంశం, కుమార సంభవం, మేఘదూతం, వీటికి బదులుగా కృష్ణమాచార్యులు సంస్కృతంలో గురువంశ మహాకావ్యమ్, సంపత్కుమార సంభవమ్, మనస్సందేశ కావ్యం అనే కావ్యత్రయాన్ని రాసి ‘అభినవ కాళిదాసు’గా పేరు పొందారు. నైజాం రాష్ర్టాద్యశతావధాని, ఉభయ వేదాంతాచార్య, ఢిల్లీ పీఠం వారిచే అత్యున్నత గౌరవ పురస్కారం, విద్యాభూషణ స్వర్ణ పతకం, తిరుపతిలో అఖిల భారత విద్వత్సభా సత్కారం, తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం వంటి పురస్కారాలు,బిరుదులు అందుకున్నారు.
ఆయన కలమెత్తితే కావ్యాలు అలవోకగా జాలువారుతాయి. ఆయన గొంతెత్తితే పద్యాలు పరవళ్లు తొక్కుతాయి. ఆయన ఆశు కవిత్వం అవధానమై అలరారుతుంది. ఆయన పలికిన ప్రతి పదంలోనూ పలుకులమ్మ నాట్యం చేస్తుంది. ఇంతటి ప్రతిభా సంపద కలిగిన సిరిశినహల్ కృష్ణమాచార్యులు తగినంత గుర్తింపు పొందకుండానే 1992, ఏప్రిల్ 14వ తేదీన పరమపదించారు.
-తిరునగరి శ్రీనివాస స్వామి
94403 69939