భూమి మీద ఉన్న అన్ని జీవులకు నీరు అత్యంత అవసరం. అందుకే నీరు నాగరికతను ప్రభావితం చేసింది. నీరు కేవలం ఒక పదార్థం కాదు. అది జీవితం. అది సంస్కృతి. అది అభివృద్ధికి మూలం. నీటిని సక్రమంగా ఉపయోగించకపోతే నాగరికతలు కూలిపోవచ్చు. దానికి చారిత్రక ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. నదుల నుంచి నీటిని కాలువల ద్వారా తీసుకొని పంటలు పండించడంతో ఆహారం సమృద్ధిగా లభించడంతో జనాభా పెరిగింది. స్థిరంగా ఆహారం లభించడంతో మనుషులు ఒక చోట స్థిరపడి నగరాలు ఏర్పడ్డాయి. మన సంస్కృతుల్లో నీటిని పవిత్రంగా భావిస్తాం. అందుకే తీర్థయాత్రలు చేస్తాం. తెలంగాణ ఉద్యమ నినాదం నీళ్లు, నిధులు, నియామకాలు. స్వరాష్ట్ర పోరాట ఆశయంలో నీటి హక్కుల సాధన కీలకమైంది.
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ నీటిపారుదల రంగం తీవ్ర నిర్లక్ష్యం, వివక్షకు గురైంది. సుదీర్ఘ పోరాటం తర్వాత సాకారమైన స్వరాష్ట్రంలో ఉద్యమనాయకుడు, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కృష్ణా, గోదావరి నదుల నుంచి తెలంగాణకు నీళ్లు మళ్లించడంపై దృష్టి సారించారు. మొదటి రెండేండ్లలో పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేశారు. మిషన్ కాకతీయ పథకం కింద 46 వేల పైచిలుకు చెరువులు, కుంటలు బాగుచేశారు. కేసీఆర్ కృషి తెలంగాణ నీటి హక్కుల కోసం ఆయన దృఢ సంకల్పాన్ని ప్రతిబింబిస్తాయి. నీటి విలువ తెలిసిన వ్యక్తి కాబట్టే కేసీఆర్ మిషన్ భగీరథ కింద ఇంటింటికి సురక్షితమైన తాగునీరు అందించారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలతో తెలంగాణ సస్యశ్యామలం చేయబూనారు. నీటికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి, రాష్ట్ర అభివృద్ధికి మూలస్తంభంగా చూశారు. నీటిని రాజకీయంగా ఎన్నడూ భావించలేదు. అభివృద్ధి సాధనంగానే చూశారు. రైతే రాజు అన్నది నినాదంగా కాకుండా ప్రభుత్వ విధానంగా మలుచుకున్న వ్యక్తి కేసీఆర్.
కేసీఆర్ ప్రభుత్వం మీద జరిగిన విష ప్రచారం, కాంగ్రెస్ పార్టీ అబద్దపు హామీలతో కేవలం 1.85 శాతం ఓట్ల తేడాతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్‌రెడ్డి సీఎం కుర్చీలో కూర్చున్నాడు. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సమాజంతో ఆయనకు ఎలాంటి భావోద్వేగ సంబంధాలు లేవు. తెలంగాణ ఉద్యమకారుల మీదకు తుపాకీ ఎక్కుపెట్టినవాడు రేవంత్‌రెడ్డి. వచ్చిన తెలంగాణను ఆగం చేసేందుకు యత్నించిన వాడు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయి జైలుకు వెళ్లినవాడు. అలాంటి వ్యక్తికి తెలంగాణ మీద, తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ రైతుల మీద అభిమానం ఉంటుందని అనుకోవడం భ్రమనే అవుతుంది. ఇదే విషయం కాళేశ్వరంపై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తేటతెల్లమైంది. గ్రామస్తులు దొంగను పట్టుకొని పోలీసులకు అప్పగిస్తే, ఊరి మీదనే పగ పెంచుకున్నట్టుగా రేవంత్‌రెడ్డి తెలంగాణ మీద పగ పెంచుకున్నట్టు కనిపిస్తున్నది. అందుకే కాళేశ్వరం నీళ్లు ఎత్తాలని సూచించిన విశ్రాంత ఇంజినీర్ల మీద అవాకులు చవాకులు పేలారు.
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు 2016 మే 2న శంకుస్థాపన చేసిన కేసీఆర్, 2019 జూన్ 21న పూర్తి చేసి ప్రారంభించారు. కేవలం మూడేండ్లలోనే నిర్మాణం పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువచ్చారు. ఇది తెలంగాణకు జీవధార లాంటి ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 2004లో ప్రారంభమై ఇప్పటికి కొనసాగుతూనే ఉన్నది. 2019 వరదల్లో డయాఫ్రం వాల్ కొట్టుకుపోయి రూ.600 కోట్ల నష్టం వాటిల్లింది.
2020 వరదల్లో అదే డయాఫ్రం వాల్ 35 శాతం దెబ్బతిన్నది. 2022 వరదల్లో డయాఫ్రం వాల్ పూర్తిగా మునిగిపోయి లోయర్ కాఫర్ డ్యామ్ దెబ్బతిన్నది. కానీ కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగమైన మేడిగడ్డ బరాజ్‌లో రెండు పిల్లర్లు మాత్రమే కుంగిపోయాయి. సరిగ్గా ఎన్నికల ముందు ఈ ఘటన జరుగడంతోపాటు, దుండగుల కూల్చివేతగా ఫిర్యాదు ఉన్నది. ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మేడిగడ్డలో కుంగిన పిల్లర్లను పునరుద్ధరించడానికి నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ సంస్థ ముందుకు వచ్చింది. ఖర్చు కూడా భరిస్తామని చెప్పింది. కానీ కాంగ్రెస్ పాలకులు అడ్డు చెప్పారు. మేడిగడ్డ బరాజ్‌లో రెండు పిల్లర్ల కుంగుబాటును సాకుగా చూపుతూ మూడేండ్లుగా కాళేశ్వరం మొత్తం కొట్టుకుపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ మరమ్మతులు చేసి, ప్రజలకు నీళ్లు అందించాలన్న ఆలోచన చేయడంలేదు. ఈ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుకొంటున్నారు.
ఈ ఏడాది ఎల్ నినో కారణంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్రంలోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు నోర్లు తెరుచుకున్నాయి. కానీ గోదావరిలో ప్రాణహిత కలిసే మేడిగడ్డ వద్ద, కన్నెపల్లి వద్ద 50 వేల నుంచి లక్ష క్యూసెక్కుల నీరు పారుతున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నీళ్లు ఎత్తిపోసి రిజర్వాయర్లు నింపుతుందని అందరూ భావిస్తారు. కానీ మేడిగడ్డ బరాజ్ వద్ద నీళ్లు ఎత్తిపోస్తే భద్రాచలం మునిగిపోతుందని, ఊర్లు కొట్టుకుపోతాయని రేవంత్‌రెడ్డి వింత, వితండ వాదనను తెరమీదికి తెచ్చారు. మూడేండ్ల క్రితం 26 లక్షల క్యూసెక్కుల పైచిలుకు వరద వచ్చినప్పుడు కూడా భద్రాచలంలోకి చుక్కనీరు రాలేదు. ఈ నేపథ్యంలోనే విశ్రాంత ఇంజినీర్లు ప్రభుత్వానికి లేఖ రాశారు. నీళ్లను ఎత్తిపోసేందుకు స్వచ్ఛందంగా తమ వంతు సహకారం అందిస్తామని ముందుకువచ్చారు.
సాధారణంగా ఇలా ముందుకు వచ్చిన ఇంజినీర్లకు ఏ పాలకులైనా అభినందనలు తెలుపుతారు. ఇబ్బందులు ఉంటే వారి దృష్టికి తీసుకువెళతారు. కానీ రేవంత్‌రెడ్డి అందుకు భిన్నంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు, విశ్రాంత ఇంజినీర్ల మీద దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు. విశ్రాంత ఇంజినీర్లకు బెల్ట్ ట్రీట్మెంట్, జైలు శిక్ష ఇవ్వాలని అన్నారు. కరువు వస్తుంది.. పంటలకు నీళ్లు ఎలా? అని ఓ జర్నలిస్ట్ అడిగితే బీఆర్ఎస్ నేతలను కోసి వారి రక్తం చల్లితే పంటలు అవే పండుతాయి అని చెప్పడం దారుణం. సాగునీరు ఇవ్వమంటే రేవంత్‌రెడ్డి హంతక భాష మాట్లాడటం అనేక అనుమానాలకు దారి తీస్తున్నది. అటు పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లను ఏపీ ఎత్తిపోసుకుంటుంటే, ఇక్కడ పంపులు ఆన్ చేయకుండా రేవంత్ చేతులు ఎత్తేశాడు. మేడిగడ్డ బరాజ్ ద్వారా సాగునీరు అందిస్తే కేసీఆర్‌కు పేరు వస్తుంది. అదే రేవంత్‌రెడ్డి భయం. సాగునీరు ఇవ్వకపోతే పంటలు పండవు, కొనుగోలు చేయాల్సిన అవసరంలేదు, ధాన్యానికి బోనస్ చెల్లించాల్సిన అవసరంలేదు. ఇదే దురుద్దేశంతో ప్రభుత్వం కాళేశ్వరం నీటిని ఎత్తిపోయడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అధికారం చేతిలో ఉందనే అహంకారంతో రేవంత్ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. కానీ తన రాజకీయ స్వార్థం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను, రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టడం దుర్మార్గం. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి చేసిన, చేస్తున్న వ్యాఖ్యలు ఇంకెవరైనా చేస్తే పోలీసులు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారు. ఇలాంటి మాటలను, చర్యలను కోర్టులు సుమోటోగా స్వీకరించాలి. ప్రజల పట్ల చిత్తశుద్ధి లేని, పాలన పట్ల అనుభవంలేని అంగుష్ఠమాత్రుడైన ఇలాంటి వ్యక్తిని తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రజల నెత్తిన కాంగ్రెస్ అధిష్ఠానం రుద్దడం దారుణం. కాంగ్రెస్ చేస్తున్న ఈ తప్పులకు భవిష్యత్తులో తెలంగాణ సమాజానికి జవాబు చెప్పక తప్పని పరిస్థితి వస్తుంది. చరిత్రలో రేవంత్ తెలంగాణ ద్రోహిగా నిలబడక తప్పదు.
అధికారం చేతిలో ఉందనే అహంకారంతో రేవంత్ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. కానీ తన రాజకీయ స్వార్థం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను, రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టడం దుర్మార్గం. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి చేసిన, చేస్తున్న వ్యాఖ్యలు ఇంకెవరైనా చేస్తే పోలీసులు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారు.