తిమ్మాపూర్, జూలై13: దేశ రక్షణకు పాటుపడే సైనికుల వాహనాలకు టోల్ నుండి మినహాయింపు ఇవ్వాల్సి ఉన్నా.. టోల్ సిబ్బంది మాత్రం వసూల్ ఆపడం లేదు. ‘ఎవరైతే మాకేంటి.. మాకు కావాల్సింది టోల్’ అనే విధంగా సిబ్బంది వ్యవహరిస్తున్నారు. గతంలో పలుమార్లు ఫిర్యాదులు చేసినా, గొడవలు జరిగినా వారి తీరు మారడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కరీంనగర్ నుండి హైదరాబాద్ వైపు సోమవారం సాయంత్రం నాలుగు ఆర్మీ కంటైనర్లు వెళ్తుండగా.. మండలంలోని రేణికుంట శివారులో ఉన్న టోల్ ప్లాజా వద్ద సిబ్బంది టోల్ కట్టాలని డిమాండ్ చేశారు.
ఆర్మీకి సంబంధించిన వాహనాలు అని చెప్పినా టోల్ సిబ్బంది వినకుండా ఆపారు. సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్మీ అధికారులు కంటైనర్లను ప్లాజా కౌంటర్ల వద్దే నిలిపారు. దీంతో హైదరాబాద్ వైపు వెళ్లే రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విషయం తెలిగానే ఎల్ఎండీ పోలీస్ సిబ్బంది అక్కడకు చేరుకుని టోల్ సిబ్బందితో మాట్లాడి ఆర్మీ వాహనాలను పంపించి, ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ ఘటనపై వివరణ కోరగా.. కొన్ని వాహనాలకు ఆర్మీ మినహాయింపు ఉందని.. వాటిని పంపించామని, తాము నిలిపిన వాహనాలు రెండు రోజుల క్రితం టోల్ కట్టే వెళ్లాయని.. రికార్డు ఉండడంతో వాటిని ఆపినట్లు టోల్ సిబ్బంది చెప్పారు.