తెలంగాణలో గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రచార రథాలకు జెండాలూపిన మేధావులు కొందరున్నారు. తమ ఆశయాల సాధన కోసం ఉద్యమాలు చేసి, అవి నెరవేరని స్థితిలో నిరాశ చెంది, బీఆర్ఎస్ ప్రభుత్వం రాత్రికి రాత్రి అన్నీ చేసేయాలన్న లక్ష్యాలు తామే నిర్దేశించి, అట్లా ఆచరణలో అన్నింటికి అన్నీ జరుగలేదని ఆగ్రహించి, కాంగ్రెస్‌కు ప్రచారాలు చేసిన లెఫ్ట్ మేధావులు కొందరున్నారు. ఈ రెండు బృందాల వారికి రెండేండ్ల కాంగ్రెస్ పాలన గడిచే సరికి జ్ఞానోదయం కలుగుతున్నా, ఇంతలోనే బీఆర్ఎస్ను బలపరచటం ఇబ్బందికరం గనుక అలీనత వైపు కదులుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ దశలు, పరివర్తనా దశలు ఆసక్తికరమైనవి, అర్థం చేసుకోవలసినవి.
ముందు 2014కు వెళదాము. ఉద్యమ ఫలితంగా అప్పుడే స్వరాష్ట్రం ఏర్పడింది. ఆ రోజున తెలంగాణ ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులు ఏమిటో అందరికీ తెలిసినవే. అంతా చిందరవందర అయిన స్థితి నుంచి మూడు రంగాలు కూడా మొదట కుదుటపడాలి. దానితోపాటు క్రమంగా ముందుకు పోవాలి. అది, వలస పాలన నుంచి విముక్తి చెందిన ఒక దేశం, లేదా అంతర్గత వలస పాలన నుంచి బయటపడిన ఒక ప్రాంతం వంటి పరిస్థితి. ఆ స్థితి తెలంగాణకే కాదు ఏ దేశానికైనా, ఏ ప్రాంతానికైనా వర్తించేదే. దాని నుంచి ముందు పడటం చరిత్రలో ఎవరికీ తేలిక కాలేదు, కాదు కూడా. అటువంటి తొలిదశలో జరగవలసిందేమిటి? తెలంగాణ వంటి వ్యవసాయిక గ్రామీణ సమాజం, ఆర్థిక వ్యవస్థ, గ్రామీణ ఆర్థికంపై ఆధారపడే ఇతర స్థానిక రంగాలు కోలుకోవటం, స్థిరపడటం అన్నింటికి మించిన ప్రాధాన్యతలు కావాలి. అది జరిగినా కొద్దీ ఇతర రంగాలపై, ప్రజలందరి జీవితాలపై ఉండగల అనేకానేక ప్రభావాలు ఏమిటో ఇక్కడ పేర్కొనలేము గానీ, పైన చెప్పిన రెండు విధాలైన మేధావులకు తెలియనివి కావు.
2014 నుంచి మొదలై తెలంగాణ వ్యవసాయ రంగం కోసం, ఇతరత్రా గ్రామీణుల జీవితాల కోసం, పేదల కోసం అవసరమైన పనులపై బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా దృష్టి కేంద్రీకరించి పని చేసిందో, కేంద్రంలోని ప్రత్యర్థి అధికార బీజేపీ ప్రభుత్వంతోపాటు దేశమంతా గుర్తించింది. ఆ పనుల ఫలితాలను జీవితంలో అనుభవించిన రైతులు, ఇతర గ్రామీణులు, ఆ నేపథ్యాల నుంచి వచ్చి పట్టణ ప్రాంతాల్లో నివసిస్తూ ఉద్యోగాలు, పనిపాటలు చేసుకుంటున్నవారు గుర్తించారు. ఆ చర్యలు విద్యుత్తు, సాగునీరు, మంచినీరు, ఎరువుల సరఫరా, వ్యవసాయ పెట్టుబడుల అందజేత, పంటల మార్కెటింగ్, నిస్సహాయులకు విస్తారంగా పెన్షన్లు, పెండ్లిళ్ల నుంచి కాన్పుల వరకు సహాయాలు, విద్యా, వైద్య రంగాల్లో చర్యలు అన్నీ లెక్కకు మించినవి. అయినా విచిత్రం ఏమంటే, వీటన్నింటి ఫలితంగా వేర్వేరు అభివృద్ధి సూచీలు కేంద్రం లెక్కలలో, స్వతంత్ర సంస్థల లెక్కలలో వేగంగా పైకిపోతున్నా, సామాన్య ప్రజల అనుభవంలోకి అవన్నీ తమ కండ్ల ముందే వస్తుండినా, పైన చెప్పిన రెండు రకాల మేధావులు మాత్రం గుర్తించలేదు, లేక గుర్తించదలచలేదు. ఎందువల్లనో చెప్పుకొనే ముందు మరొకటి చూడాలి.
గ్రామీణ ఆర్థికాలు, జీవితాల దృశ్యాలు పై విధంగా ఉండగా, నగర కేంద్రీకృత స్థితిగతులు ఏ విధంగా మారసాగాయి? ఆధునిక రంగాలైన ఐటీ, ఇతర సర్వీస్ రంగాలు, వివిధ పరిశ్రమలు, నగరంలో మౌలిక సదుపాయాలు, విద్యా,వైద్య రంగాలకు ఆరంభం గతంలోనే జరిగినా, వాటి అభివృద్ధి 2014 నుంచి బాగా వేగం పుంజుకున్నది. కొత్త పారిశ్రామిక విధానాన్ని అపూర్వమంటూ మెచ్చని పారిశ్రామికవేత్త, ఆర్థిక నిపుణులు లేరు.
విద్యుత్తు, నీరు, రవాణా సదుపాయాలు వీటికి కీలకంగా పని చేశాయి. ఈ రంగాల్లోని ఫలితాల గణాంకాలు వ్యవసాయం, సంక్షేమం సహా అన్ని విధాల అభివృద్ధి ర్యాంకుల పెరుగుదల కూడా కండ్ల ఎదుట ఉన్నవే. అయినప్పటికీ, అందరూ గుర్తించిన ఈ వాస్తవాలను పై రెండు రకాల మేధావులు విస్మరించారు. తెలియక విస్మరించటం వేరు, ఉద్దేశపూర్వకంగా విస్మరించటం వేరు. దీనంతటి అర్థం అన్ని రంగాలకు సంబంధించి సమస్తం అన్ని విధాలుగానూ జరిగిపోయాయని కాదు. జరగనివి ఉన్నాయి. జరిగిన వాటిలో లోపాలూ ఉన్నాయి. ఆ మాట స్వయంగా బీఆర్ఎస్ ఒప్పుకొన్నదే. మేధావులు చేయవలసింది రెండు వైపులా ఓపెన్ మైండ్‌తో చూస్తూ, అన్నింటిని ఒకవైపు ప్రభుత్వం చెప్పే దానితో మరొకవైపు తాము స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించే దానితో కలిపి అధ్యయనం చేయటం. ఆ మీదట నిష్పక్షపాతంగా ఒక అంచనాకు వచ్చి తెలంగాణ సమాజానికి ప్రకటించటం. అటువంటి అధ్యయనాలను చివరకు ప్రభుత్వాలు సైతం పైకి కాదన్నా ఆంతరంగికంగా గుర్తిస్తాయి. విలువ ఉండేది ఆ తరహా అధ్యయనాలకు, విమర్శలకు మాత్రమే.
కానీ ఈ రెండు తరహాల మేధావి బృందాలు చేసిందేమిటి? ఇది ముఖ్యంగా రెండవ దశ (2018-2023)కు సంబంధించిన మాట. వాస్తవానికి 2018కి ముందు కూడా అంతేగానీ, 2023 సమీపిస్తుండగా వారి తీరు పెచ్చరిల్లసాగింది. అందుకు కారణాలేమిటన్నది అర్థం చేసుకోవలసిన విషయం. ఒక్కమాటలో చెప్పాలంటే వారిద్దరి సహజ స్వభావాలే అందుకు కారణమయ్యాయి. కాంగ్రెస్ మేధావుల స్వభావానికి, లెఫ్ట్ మేధావుల స్వభావానికి మధ్య యథాతథంగా కొన్ని తేడాలుంటాయి. కానీ, బీఆర్ఎస్ పాలనను విమర్శించటంలో ఆ రెండు స్వభావాల మధ్య ఏకీభావం కుదిరింది. అట్లా ఎందుకో చూద్దాము.
వీరంతా మన చుట్టూ ఉండేవారే గనుక ఎవరేమిటో గుర్తించటం కష్టం కాదు. కాంగ్రెస్ మేధావులనే వారు చిరకాలంగా ఆ పార్టీ అభిమానులు. వాస్తవానికి అది సమస్య కానక్కరలేదు. ఎవరు ఎవరి అభిమానులైనా, అభివృద్ధిని, ఆ ఫలితాలను పైన అనుకొన్న తరహాలో మేధావులు ఏ విధంగా అధ్యయనాలు చేయాలని ఆశిస్తామో, ఆ ప్రకారం చేసినట్టయితే వారిని ప్రశంసించాలి. వారి అధ్యయనాలతో విభేదించినా, అసలు అధ్యయనాలంటూ జరపటం ప్రధానం. కానీ వీరు 2014 నుంచి 2023 వరకు ఎటువంటి అధ్యయన ప్రకటనలు చేయలేదు. పైపైన స్థూలంగా చూసిన వ్యాఖ్యానాలు ఏవైనా ఉన్నా, గణాంకాలను, క్షేత్రస్థాయి పరిశీలనలను కలిపిన సీరియస్ అధ్యయనాలు కనిపించవు. అటువంటి వారికి నైతికమైన వ్యాఖ్యాన హక్కులుండవు. అయినప్పటికీ వారు యథేచ్ఛగా మాట్లాడుతూ చివరకు కాంగ్రెస్ ప్రచారానికి జెండాలూపే స్థితికి వెళ్లారంటే, కాంగ్రెస్ పట్ల, గాంధీ కుటుంబం పట్ల అంధప్రేమ తప్ప మరొక కారణం కనిపించదు. లేక ఏమైనా ఆశించి అయినా కావచ్చు. అవి బీఆర్ఎస్ నుంచి లభించకపోవటమైనా కావచ్చు.
లెఫ్ట్ మేధావుల విషయానికి వస్తే వారు గొప్ప ఆశయాల కోసం దశాబ్దాల తరబడి పలు రూపాల్లో గొప్ప కృషి చేయటాన్ని ఎవరూ కాదనలేరు. ఆ తరహా లక్ష్యాలు ముఖ్యంగా తెలంగాణ వంటి సమాజాలకు అవసరమైనవే. కానీ, ఏ పరిస్థితుల వల్లనైతేనేమి అవి నెరవేరటం లేదు. అందుకు మేధావులను నిందించవలసిందేమీ ఉండదు. అయితే అదంతా వామపక్ష రాజకీయం అనే పరిధికి సంబంధించినది.
తెలంగాణ విషయమై జరగవలసింది జరగనిది అంతా కూడా వామపక్ష భావజాలానికి, లక్ష్యాలకు వెలుపలిది. సాధారణ ప్రజాస్వామిక వ్యవస్థలకు సంబంధించినది. ఆ జరిగేది వీలైనంత మేర వామపక్ష భావజాలానికి అనుగుణంగా జరగాలనుకోవటం, అందుకోసం ప్రభుత్వంపై ఒత్తిడి సృష్టించటం వేరు. అదే ప్రకారం జరిగితీరాలని , లేనట్టయితే కక్ష వంటి వైఖరి తీసుకుంటామని ఆలోచించటం వేరు. అది స్వీయ వైఫల్యాల వల్ల కుంగిపోయినప్పుడు నిష్కారణంగా ఇతరులపై కలిగే ఆగ్రహం వంటిది. అసమర్థ దుర్జనత్వం. సీపీఐ, సీపీఎంలది కేవలం సీట్ల ఆరాటం. తాము సాధించలేనిది తాము నిర్దేశించే ప్రకారం ఇతరులు చేయాలనుకొనేతత్వం. ఒక విధంగా అది ఒక బలహీనమైన, జాలిగొలిపే స్థితి. ఆ స్థితిలో వారు అసలు నక్సలిజానికి గానీ, వేలాది మంది నక్సలైట్ల చావుకు గానీ కారణం కాంగ్రెస్ అన్నది విస్మరించారు. మొత్తం మీద ఇటువంటి రెండు విధాలైన మేధావుల మధ్య ఒక సయోధ్య వంటిది 2023 నాటికి ఏర్పడిన దశలో కుదిరింది. దానితో కాంగ్రెస్‌కు ఉభయులు కలిసి ఉత్సాహంగా, పట్టుదలతో ప్రచారాలు చేశారు. ఆ లక్ష్యాన్ని సాధించగా వారి సంతోషానికి అవధులు లేకపోయాయి. ఇక అంతా స్వర్ణయుగమనుకున్నారు.
ప్రస్తుతం వారొక కొత్త దశలోకి ప్రవేశించారు. మొదటి ఆరు మాసాలు, ఏడాదిపాటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను చూసినా, అందుకు ప్రభుత్వం చెప్పిన సాకులనే తమవైపు నుంచి కూడా ప్రచారం చేస్తూ, ప్రజలను మభ్యపెడుతూ తాము గెలిపించిన పాలనకు సమర్థనలు చెప్పి కాలం గడిపారు. కాలం ఇంకా గడిచేకొద్దీ, ఆ సాకులేవీ ప్రజలు నమ్మటంలేదని అర్థమవుతున్నా కొద్దీ, తామిక సమర్థించలేమని బోధపడినా కొద్దీ, ఈ రెండు విధాలైన మేధావులకు కూడా గొంతులో వెలగకాయ ఇరుక్కుంటున్నది. దాని సైజు నానాటికి పెరుగుతున్నది. రేవంత్‌రెడ్డిని ప్రేమించటం కష్టమవుతున్నది. అటువంటి స్థితిలో వారు ఇటీవల అలీన లక్షణాలను చూపటం కనిపిస్తున్నది. పరిపాలనకు సంబంధించి ఏమేమి జరుగుతున్నాయో, అవి క్రమంగా ఎట్లా విషమిస్తున్నాయో సమర్థించలేని విధంగా కనిపిస్తున్నప్పుడు, కనీసం తమ పరువు కాపాడుకొనేందుకు అలీనత వైపు కదలటం ఒక తెలివైన ఎత్తుగడే. అయినప్పటికీ ప్రజలు ఆహ్వానించవచ్చు. ఎందుకంటే, పశ్చాత్తాపాలు ఎప్పుడూ మంచివే. అందువల్ల స్వయంగా తమతోపాటు అందరికీ మంచి జరుగుతుంది. వీరి దెబ్బతిన్న విశ్వసనీయత ఎప్పటికి తిరిగి వస్తుందన్నది వేరే ప్రశ్న.