బీఆర్ఎస్ను క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేసే విషయమై పార్టీ ప్రధాన కార్యదర్శులకు ఈ నెల 12 నాటి సమావేశంలో నిర్దిష్టమైన సూచనలు చేసిన ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, పది రోజులైనా తిరగకముందే ఈ నెల 21న అందుకోసం మరింత స్పష్టమైన కార్యక్రమాన్ని ప్రకటించారు. సమీక్షల నుంచి మొదలు పెట్టి, పార్టీ శ్రేణులకు వరుసగా చేస్తున్న సూచనలు, హెచ్చరికలు, ప్రకటిస్తున్న సభ్యత్వ కార్యక్రమాలు, శిక్షణలలోని వేగం బీఆర్ఎస్ సభ్యులు, అభిమానులతోపాటు పరిశీలకుల దృష్టిని ఆకర్షిస్తూనే ఉండాలి. ఈ వేగం చెప్తున్నది చాలా ఉన్నది.
ఇతరత్రా చర్చలోకి వెళ్లే ముందు గమనించవలసినవి కొన్ని ఉన్నాయి. అవి, సభ్యత్వాన్ని గతంలో వలె గాక డిజిటలైజ్ చేయటం. ప్రతి సభ్యుడు, సభ్యురాలి గురించిన వివరాలన్నీ ఒక్క క్లిక్‌తో తెలుసుకోగల అవకాశం ఏర్పడటం. దీనితోపాటు బహుశా ఎవరు చేస్తున్న కార్యక్రమాలు ఏమిటో తెలుసుకోగల వెసులుబాటు కూడా ఉంటుందేమో చూడాలి. అది అవసరం కూడా. ఎందుకంటే, పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో (మే 12న) కేసీఆర్ చెప్పిన మాటలు, లక్ష్యాలు నెరవేరేందుకు ఆచరణల మానిటరింగ్ అవసరమవుతుంది. ఆయన అన్నది ఒకసారి గుర్తుచేసుకుందాము. అధికారంలో ఉన్నా లేకున్నా పనిచేసే నిబద్ధత గలవారు కావాలని, రాశికన్నా వాసి ముఖ్యమని, తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టే ఫైటర్స్‌గా వారిని తీర్చిదిద్దాలని, మనమే వారిని ఎంపిక చేసుకొని నిరంతర శిక్షణల ద్వారా సైనికులుగా తయారు చేసుకోవాలని చెప్పారాయన.
ఇందులో ప్రతి మాట వెనుక లోతైన ఆలోచన కనిపిస్తుంది. అంతేకాదు, కార్యకర్తలు, నాయకుల విషయమై గత అనుభవాల సారాంశం కూడా అందులో ఉన్నది. మరొక విధంగా చెప్పాలంటే ఆ అనుభవాలు తెలియజెప్పిన పాఠాలన్నమాట. ఇంతకుముందు కూడా పార్టీ వాదుల్లో నిబద్ధతలు, వాసి ఉన్నాయి. అవి తెలంగాణ పట్ల, ఉద్యమం పట్ల నిబద్ధతల వల్ల కలిగినవి. అదే సమయంలో నిబద్ధతలేని, వాసి అంటూ లేని రాశి కూడా చాలానే పోగుపడింది. అందుకు కారణాలు ఊహించగలవే గనుక ఇక్కడ చెప్పనక్కరలేదు. కేసీఆర్‌కు అదంతా దృష్టిలో ఉన్నదే అయినందున మే 12 నాటి సందర్భంలో వివరించలేదు. కానీ ఇతరులు గ్రహించవలసిందేమంటే, తనకు అదంతా దృష్టిలో లేనిదే రాశికన్నా వాసి ముఖ్యం, అధికారంలో ఉన్నా లేకున్నా నిబద్ధత వంటి మాటలు తన నుంచి రావు. అంతే ముఖ్యంగా తెలంగాణ అస్తిత్వం, అందుకోసం పోరాడటం, తెలంగాణకు కించిత్ హాని కలిగినా సహించకపోవటం వంటి మాటలకు కూడా అర్థం ఎంతైనా ఉన్నది. సుదీర్ఘ ఉద్యమాలు, లెక్కలేనన్ని త్యాగాలతో సాధించుకున్న స్వరాష్ర్టానికి తిరిగి క్రమంగా పొంచి వస్తున్న హానిని ఆయన గమనించటం కూడా ఈ మాటల వెనుక స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నది. భవిష్యత్తుకు సంబంధించి నిబద్ధతలు, రాశి కన్నా వాసి ముఖ్యం కావటాలు, తెలంగాణకు కించిత్ హాని కలిగినా సహించకపోవటాల వంటివి క్షేత్రస్థాయిలో ఆధారపడేది ముఖ్యంగా యువతరం కార్యకర్తలు, సాధారణ సభ్యులపైనే. అది ఒక భవనానికి పునాది వంటి స్థాయి. అందువల్ల, కేసీఆర్ ప్రకటించినట్టు వారిని తామే ఎంపిక చేసి శిక్షణలు ఇవ్వటం ఎంత అవసరమో, ఇదే డిజిటలైజేషన్ ఏర్పాటు ద్వారా వారి కార్యక్రమాల తీరును గమనించి, మదింపు చేయటం కూడా అంత అవసరం.
దీనికీ, తిరిగి కేసీఆర్ అదే మే 12 నాటి సమావేశంలో స్పష్టంచేసినట్టు ఇకముందు ఎన్నికల్లో పోటీ కి ముఖాలు చూసి టికెట్లు ఇవ్వటం ఉండదు. పరిస్థితి గతం వలె ఉండదు. క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా పనిచేసే వారికే అవకాశం. ఇది ముందే చేస్తున్న హెచ్చరిక అన్న మాటలకు సంబంధం ఉన్నదని భావిస్తే పొరపాటు కాకపోవచ్చు.
ఇక్కడ మరొకటి చెప్పుకోవాలి. అసెంబ్లీ ఎన్నికలు 2023లో మూడవసారి వచ్చినప్పటి వాసి తగ్గుతూ రాశి పెరగటం మొదలైంది. తెలంగాణ సాధన లక్ష్యాల పట్ల నిబద్ధతతో కూడిన వాసి తగ్గుతూ, అధికారం చుట్టూ పరిభ్రమించే రాశి పెరగటమన్నమాట. ఎప్పుడైనా, ఎక్కడైనా ఒకసారి ఈ ధోరణి మొదలైతే అందువల్ల వచ్చి చేరే అవలక్షణాలు అనేకం ఉంటాయి. ఒక దశ వరకు నిబద్ధతతో ఉండిన వారిలో కొందరు కూడా నెమ్మదిగా ఆ లక్షణాన్ని వదలుకొని స్వప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వటం వాటిలో ఒకటి. ఇది 2023 ఎన్నికల కన్నాముందే కొంత జరగగా, అప్పుడు బీఆర్ఎస్ అధికారం కోల్పోవటంతో ప్రకోపించి బయటపడింది. దానితో, ఆ వ్యక్తులూ, వర్గాలూ బీఆర్ఎస్లో తప్పులు వెతకటం మొదలుపెట్టారు. నిన్నటివరకు పొగిడిన నోటితోనే తెగడటం కనిపించింది. అవకాశవాదానికి ఇది సాధారణ లక్షణమన్నది తెలిసిందే. అయితే, ఇక్కడ చర్చించదలచింది అది కాదు. మౌలిక స్థాయిలో నిబద్ధత తగ్గటం వాసి కన్నా రాశి పెరగటం వల్ల జరిగేది ఇది. అంతకన్నా ప్రమాదకరమైనది మరొకటి కూడా ఇందులో ఉన్నది. ఒక పార్టీగా బీఆర్ఎస్ పట్ల నిబద్ధత తగ్గటం వేరు, అసలు తెలంగాణ ప్రయోజనాల పట్లనే ఆ లక్షణం తగ్గటం, పోవటం వేరు. అట్లా తగ్గిన వారు తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతిన్నా నోరు విప్పరు. ఇది కూడా జరిగినట్టు 2023లో బీఆర్ఎస్ ఓటమి నుంచి కనిపించిన పరిస్థితులు చెప్తున్నాయి. ఆ స్థితిలో వారికి స్వప్రయోజనాలే సర్వస్వం అవుతాయి. ఈ మార్పు సాధారణ వ్యక్తుల స్థాయిలో జరిగితే అందుకు సమర్థనలేవో చెప్పుకోవచ్చు. కానీ మహామహులు, మేధావుల స్థాయిలో కూడా జరిగితే?
ఇదంతా గుర్తుచేసుకోవటం కేవలం గతాన్ని చెప్పుకోవటం కోసం కాదు. మే 12న కేసీఆర్ నిబద్ధతల గురించి, రాశి-వాసి గురించి, తెలంగాణకు మేలు-హాని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించినందున ఈ మాటలన్నీ అనుకోవలసి వస్తున్నది. ఆయన అన్నది జరిగిపోయిన దాని గురించి చింతించటం కోసమని భావించలేము. గత అనుభావాల దృష్ట్యా రాగల కాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటనే దాని గురించి అనుకోవాలి.
బీఆర్ఎస్ అధినేత మాటలలో ఇదే కోవలోకి వచ్చేది మరొకటి ఉన్నది. సోషల్ మీడియా అవసరమే గాని అందుకు పరిమితం కావొద్దు. పార్టీ కార్యక్రమాలకు సమాజంలోనూ విస్తృత ప్రచారం జరగాలి అని ఒక కీలకమైన జాగ్రత్తను చెప్పారాయన. కేసీఆర్ తన సుదీర్ఘ రాజకీయంలో క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య కార్యకలాపాలు నిర్వహిస్తూ, వారితోపాటు జీవిస్తూ వచ్చిన నాయకుడు.
ఆ తరం నాయకత్వమంతా అట్లానే చేసింది. ఇటీవలి కాలంలో సోషల్‌మీడియా పాత్ర, ప్రాధాన్యత తెలిసిందే. సామాజిక తరాలు, సాంకేతికతలు మారుతున్నందున దాని పాత్రను ఎవరూ కాదనలేరు. అదే సమయంలో జాగ్రత్తగా అర్థం చేసుకోవలసినవి కొన్ని ఉన్నాయి. ఎప్పుడైనా టెక్నాలజీకి, దాని ద్వారా చెప్పదలచుకున్న విషయానికి, ఆ విషయం ఎవరికి చెప్పదలచుకున్నామనే దానికి పరస్పర సంబంధం ఉంటుంది. ఉదాహరణకు కేవలం యువతరానికి చెప్పదలచుకుంటే సోషల్‌మీడియా వరకు సరిపోతుంది. అది కూడా కొంత వరకే. ఇటీవల కొన్ని దేశాల్లో జరిగిన జెన్-జీ ఉద్యమాలు, ప్రస్తుతం మనవద్ద కనిపిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ కలకలం అటువంటిది.
కానీ తెలంగాణ వంటి విషయాల్లో సోషల్ మీడియా పాత్ర తప్పక ఉంటుంది గాని అది ఒక పార్శం మాత్రమే. యువతరం విషయంలోనైనా. వయసుతో నిమిత్తం లేకుండా ఎవరైనా మనుషులే గనుక. సోషల్ మీడియా ఫిజిక్స్ అయితే, క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య నిత్య సంబంధాలతో పని చేయటం కెమిస్ట్రీ వంటిది. తెలంగాణ వంటి విషయాలు ఆయా అంశాలను బట్టి, సందర్భాన్ని బట్టి, శ్రోతలను బట్టి సోషల్‌మీడియా ద్వారా ప్రచారానికి రావచ్చు. ఆ మేరకు ప్రభావాన్ని కూడా చూపవచ్చు. కానీ అది ఒక పార్శం. ఆ సాధనాన్ని సందర్భోచితంగా ఉపయోగించుకుంటూనే, ప్రజలతో నిత్య సంబంధాలనే కెమిస్ట్రీని, మౌలిక సాధనాన్ని విస్మరించటం, లేదా తక్కువ స్థాయిలో వినియోగించుకోవటం ఎంతమాత్రం సరికాదు. కేసీఆర్ ఈ రెండు సాధనాల వినియోగాన్నీ గమనించిన మీదట, మే 12న ఆ విధమైన జాగ్రత్తలు చెప్పి ఉంటారని భావించాలి.
ఈ రెండింటి వినియోగానికి సంబంధించి ప్రస్తుతం కనిపిస్తున్న ఒక ధోరణిని చెప్పుకోవాలి. సోషల్ మీడియా వినియోగం తక్కువ శ్రమతో, తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో వేగంగా జరిగిపోయే కార్యక్రమం. ప్రచారం, పటాటోపం ఎక్కువ. పార్టీలకు ఇది ఎంత అవసరమో, పైన అనుకున్నట్టు సామాన్యులతో, వివిధ వర్గాలతో, ముఖాముఖిగా మానవ సంబంధాలు రసాయనిక సంబంధాలు అంతకన్నా ఎక్కువ అవసరం. దీని ప్రాముఖ్యతను, దీర్ఘకాలికతను, మౌలికతను గుర్తించని వారు సోషల్ మీడియాకు పరిమితం కావటం నానాటికీ పెరుగుతున్నది. ఆ హడావుడినే సర్వస్వం చేసి, పార్టీ నాయకత్వానికి చూపి మెప్పు పొందజూడటం కనిపిస్తున్నది. అది గ్రహించినందుకే కావొచ్చు కేసీఆర్, పార్టీ కార్యక్రమాలకు సమాజంలోనూ విస్తృత ప్రచారం జరగాలని చెప్పారు. ఈ 21వ తేదీన వివరంగా చెప్పిన సభ్యత్వ నమోదు, శిక్షణల ప్రణాళికలు ఇంతే వేగంగా ముందుకుసాగినకొద్దీ ఫలితాలు సర్వత్రా కనిపించగలవు కూడా.