‘రఘువీర్ లక్ష్మీకాంత్ శ్రీనివాస్ రాం రాజా కాళోజీ’ అంటే ఎవరో, తెలిసినవాళ్లు ఒక్కసారి చేతుల్లేపండి ప్లీజ్! అయ్యో-మిమ్మల్ని లెక్కపెట్టడానికి రెండు చేతుల వేళ్ల అవసరం కూడా పడదు కదా! ఆల్రైట్- ‘ప్రజాకవి’ కాళోజీ నారాయణరావు ఎవరో, ఆయన తెలంగాణ ప్రజలకు ఏం చేశారో తెలిసిన వాళ్లు చేతుల్లేపండి ప్లీజ్! నాలుగు కోట్ల పిడికిళ్లే అలలై, కలలై ఎగసిన జనసంద్రం అదిగదిగో! సెభాష్- మీ ‘గొడవ’ కాళోజీకి తెలుసు, కాళోజీ ‘గొడవ’ మీకు తెలుసు! ‘ఎవని భాష వాడు రాయాలె.
ఇట్ల రాస్తే అవతలోనికి తెలుస్తదా లేదా అని ముందర్నే మనమనుకునుడు, మనల్ని మనమే తక్వ చేసుకునుడే! నీ భాషల్నే నీ బతుకున్నది; నీ యాసల్నే నీ సంస్కృతున్నది; ఆ యాసలున్న పలుకుబళ్లలోనే తెలంగాణ జీవితమున్నది’ అనే కాళోజీ తల్లి ఓ కన్నడిగురాలు; ఆయన తండ్రి ఓ మరాఠీ. అయితే దేశమంటే మట్టి కాదు-మాటా కాదు! ఆ మట్టిలో పుట్టి మాట్లాడే మందే మన దేశమంటే! దేశంలో ఎన్ని ప్రాంతాలు, వర్గాలు, కులాలు, మతాలు, లింగాలు ఉంటే అన్ని పలుకుబళ్లూ ఉంటా యని కాళోజీకి తెలుసు. మంది గొడవే ‘నా గొడవ’ అనుకున్న వానికి అంతమాత్రం తెలియదా? నైఘంటికులు, లాక్షణికులు, వైయాకరణులు మందికి బాస-యాస-పలుకుబడి నేర్పలేదు; మందే ఆ తలపండిన పండితులకు నోరిచ్చింది! మనలో ఎందరు గుర్తించారో ఏమో తెలియదు కానీ, ఇది బాస-యాస-పలుకుబడి లాంటి వాటికి పరిమితమైన విషయం కాదు! ఇది భాషలూ-యాసలూ తెలిసినవాళ్లకు పరిమితమైన విషయం కూడా కాదు. ఇది మౌలిక మానవ మన్ననకూ, మానవ హక్కులకూ విస్తరించిన గంభీరమైన విషయం!
అలనాటి హైదరాబాద్ స్టేట్ అనే నిజాం పాలిత ప్రాంతంలో ప్రధానంగా మూడు భాషావర్గాల ప్రజలు ఉండే వారు. సగానికి సగం మంది తెలుగు వారు కాగా, 25 శాతం మరాఠీలు, 12 శాతం కన్నడిగులు, మరో 12 శాతం ప్రజలు గోండీ-కోదు తదితర గిరిజన భాషలు మాట్లాడే వారు. మంది నుంచే కాళోజీ తెలుగు, మరాఠీ, కన్నడం, ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్ భాషలు నేర్చుకున్నారు. తనకు తెలిసిన భారతీయ భాషలన్నింటిలోనూ కాళోజీ కవిత్వం రాశారు; కథానికలు అల్లారు; నాన్-ఫిక్షన్ రచనలను అనువదించారు; హిందీ, ఉర్దూ, కన్నడ భాషల నుంచి పిట్టకథలకు అనువాదాలు చేసి తెలుగులకు అందించారు.
1938లో కాల్వల చంద్రసేన గుప్తా, వెల్దుర్తి మాణిక్యరావు, గుండవరపు హనుమంతరావు సంపాదకులుగా ‘అణా గ్రంథమాల’ సంస్థ మొదలైంది. 1941లో కాళోజీ కథానికలను ‘అణా కథలు’ అనే పుస్తకంగా అచ్చేసిందీ గ్రంథమాల. అందులోని కథానికలన్నీ ఏటికి ఎదురీతలాంటివే! ఈ సంకలనంలోని ‘మనమే నయం!’ అనే కథానిక రెండు ఎద్దుల మధ్య సంభాషణగా సాగుతుంది. సాటి మనుషుల దుర్గతిని గురించి పట్టించుకోని ఫ్యాషనబుల్ జంతుప్రేమికులను ఈ కథానిక ఘాటుగా అధిక్షేపించింది. ఈ జంతుప్రేమికుల్లో ఎక్కువమందికి ఎద్దులకూ, గుర్రాలకూ తేడా తెలియదంటాడు కథకుడు. తమను బాల్యంలోనే నిర్బంధించి గొడ్డుచాకిరీ చేయించే ‘నరుడా మనపై దౌర్జన్యములను నిరోధించునది?’ అని ప్రశ్నించుకొని వారి జంతుప్రేమ అంతా బూటకమనుకుంటాయి ఆ ఎద్దులు. అక్కడితో ఆగక, ‘అత్యల్ప సంఖ్యాకులైన భాగ్యవంతులు (అందరి కష్టాలకు మూలకారకులు) తప్ప మిగతా కోట్లకొద్దీ ప్రజల జీవితం మనకన్నా ఎన్నియో రెట్లు అసహ్యకరంగా ఉంది’ అని అనుకోవడం నుంచే ఈ కథకు శీర్షిక పుట్టినట్లుంది. ‘తెలియక ప్రేమ-తెలిసి ద్వేషము’ అనేది కాళోజీ రాసిన మరో కథానిక. ఏక కాలంలోనే అతి ప్రాచీనమూ-అత్యాధునికమూ అయిన అలంకారం ఈ రచనలో కనిపిస్తుంది. కాళోజీ కథానికల్లో జానపద-పౌరాణిక కథనాలూ, పాత్రలూ, సన్నివేశాలూ ప్రస్తావనకు వస్తుంటాయి. అతి సామాన్యులకు సైతం ఇవి తెలిసి ఉంటాయనే అంచనాతోనే రచయిత వాటిని ప్రయోగించి ఉంటారనిపిస్తుంది.
వాస్తవానికి ఏ దేశంలోనైనా అతిసామాన్యులకు సైతం తెలిసి ఉండేది జానపద-పౌరాణిక పాత్రలూ, వాటి చుట్టూ అల్లిన సాహిత్యమే. మనం ఎంచుకున్న కథనానికి అలాంటి పాత్రలూ-కథలను గుర్తించడంలోనే సృజనాత్మక రచయిత నేర్పు దాగిఉంటుంది. ఈ నేర్పు కాళోజీలో అపారంగా ఉన్నది. దానికితోడుగా, జానపద-పౌరాణిక పాత్రలు, కథనాలను ఏరుకునే సందర్భంగా రచయిత కించిత్ హాస్యరస స్ఫోరకత-అధిక్షేప స్వరం ప్రయోగించగలిగితే సగం పని అవే చేస్తాయి! ఈ ప్రయోగంలో కాళోజీ విఫలమైన సందర్భం దాదాపు లేదని చెప్పొచ్చు.
శివుడు-పార్వతి-గంగ-విష్ణువు-సత్యభామ-దక్షుడు-నారదుడు-వ్యాసుడు, రాముడు-సీత- హనుమంతుడు – సుగ్రీవుడు-విభీషణుడు-సుమంత్రుడు ఇలా తనకు పనికొచ్చే పాత్రలను ఎంచుకోవడంలో కాళోజీ హాస్యాన్ని తగు మోతాదులో కలిపి వ్యంగ్య అధిక్షేపాలను విస్తృతంగా వాడుకున్నారు. ఇక మరాఠీ నుంచి ఆయన చేసిన పిట్టకథల అనువాదాలు అనేక పత్రికల్లో అచ్చయ్యాయి. కథానికి ఉన్న సమస్త కోణాలనూ తెలుసుకొన్న కాళోజీ తన శక్తియుక్తులు మొత్తం సాహిత్యరంగానికే కేటాయించి ఉంటే, ఎలా ఉండేదో ఏమో! కానీ ఆయన కార్యాచరణ ప్రధానంగా, సామాజిక-రాజకీయ రంగాల్లోనే కేంద్రీకృతమై ఉండడం ఓ వాస్తవం.
చివరిగా ఒక్క మాట- జయప్రకాశ్ నారాయణ్ కన్నుమూసినపుడు ‘పుటక నీది- చావు నీది- బతుకంతా దేశానిది!’ అన్నారు కాళోజీ. ఇదేమాట ‘రఘువీర్ లక్ష్మీకాంత్ శ్రీనివాస్ రాం రాజా కాళోజీ’ జీవితానికి కూడా యథాతథంగా వర్తిస్తుంది!
– మందలపర్తి కిశోర్