కవి అనే మాటకు పర్యాయపదంగా నిలిచినవాడు కాళిదాసు. కవికుల గురువుగా, కవి యువరాజుగా పిలువబడే కాళిదాసు మరువలేని అత్యద్భుత కవిత్వాన్నీ, నాటకాలనూ సృష్టించడమే ఇందుకు కారణం. కవి కాళిదాసు గొప్పదనం గురించి ఒక శ్లోకం చాలా ప్రచారంలో ఉన్నది. ‘పురా కవీనాం గణసా ప్రసంగే / కనిష్ఠికాధిష్ఠిత కాళిదాసా/ అద్యాపి తత్తుల్య కవే రభావా/ దనామికా సార్థవతీ బభూవ’ అంటే పూర్వం పండితులు ఉత్తమ కవులెవరని లెక్కిస్తూ కాళిదాసు పేరు చెప్పి చిటికెనవేలు (కనిష్ఠిక)ను మడిచి తరువాతి ఉంగరం వేలును మడవబోగా కాలిదాసుకు సమానుడైన కవి ఎవరూ లేకపోవడంతో ఆగిపోయారట. అందుకే ఉంగరం వేలు అనామకంగా ‘అనామిక’గా సార్థకమైంది అని అర్థం.
ఇక ఒక రసిక శిఖామణి ‘కాళిదాస కవితా నవం వయః/ మాహిషం దధి సశర్కరం పయః/ వెణమాంస మబలా చ కోమలీ/ సంభవంతు మమ జన్మజన్మని’ అంటూ తనకు ప్రతి జన్మలో కాళిదాసు కవిత్వం నవ యౌవనం, గేదె పెరుగు, చక్కెర కలిపిన పాలు లేడిమాంసం, కోమలమైన స్త్రీ దొరకాలనీ కోరుకున్నాడు. కాళిదాసు అంటే కాళికామాత భక్తుడు, సేవకుడు అనీ అర్థం. ఏమీ తెలియని, చదువురాని పామర యువకుడు కాళికామాత అనుగ్రహంతో గొప్ప విద్వాంసుడై మహాకవి అయినాడని, అందుకే కాళిదాసుగా పేరు వచ్చిందని ఒక ఐతిహ్యం.
కాళిదాసు రచనలు: సంస్కృతంలో పంచ మహా కావ్యాలుగా ప్రసిద్ధి పొందిన ‘రఘువంశమ్’, ‘కుమార సంభవమ్’ కావ్యాలను కాళిదాసు రచించాడు. ‘మాళవికాగ్ని మిత్రం’, ‘విక్రమోర్వశీయం’, ‘అభిజ్ఞాన శాకుంతలమ్’ అనే మూడు నాటకాలనూ రాశాడు. ఈ ‘అభిజ్ఞాన శాకుంతలమ్’తో ప్రపంచం చేత ప్రశంసింపబడి, ముప్ఫై ఏడు నాటకాలు రాసిన విలియం షేక్స్పియర్తో పోల్చబడి పాశ్చాత్యులతో ‘ఇండియన్ షేక్స్పియర్’ అనిపించుకున్నాడు.
‘ఋతు సంహారః’, ‘మేఘ సందేశం’, అనే రెండు ఖండకావ్యాలూ రాశారు. ఇవి కాకుండా ‘శృంగారతిలకం’, ‘పుష్ప బాణ విలాపం’, ‘రాక్షస కావ్యం’ అనే మూడు ముక్తక కావ్యాలూ కాళిదాసు శృతులుగా చెప్పబడుతున్నాయి. అద్భుత సందేశ కావ్యం ‘మేఘ సందేశమ్’: మహాకవి కాళిదాసు రచించిన, ఇప్పటికి వన్నె తరగని సందేశకావ్యం ‘మేఘ సందేశమ్’. ఇది ప్రపంచ సాహిత్యంలోనే సర్వోత్కృష్ట రచన అని చెప్పబడుతోంది.
భార్యాభర్తల ప్రేమ విరహగాథ ‘మేఘ సందేశం’లోని కథ. యక్షులకు రాజైన కుబేరుడి దగ్గర ఒక యక్షుడు ఉద్యోగం చేస్తుంటాడు. శివపూజా తత్పరుడైన కుబేరుడికి- మానస సరోవరంలోని స్వర్ణ కమలాలను రక్షిస్తూ, ప్రతిదినం పూజ కోసం ఆ కమలాలను రాజు కుబేరుడికి అందించడం అతడి విధి. ఒకరోజు ఆ యక్షుడు తన భార్యతో ఒక ప్రొద్దు కాలం గడుపుతూ తన ఉద్యోగ విధిని మరిచిపోతాడు. అందుకు కుబేరుడు కోపించి ఒక సంవత్సరం పాటు ఇల్లాలికీ, ఇంటికీ దూరంగా ఉండాలని శిక్ష వేస్తాడు. ఆ శాపానుసారంగా ఆ యక్షుడు అలకాపురికి దూరంగా రామగిరి (చిత్రకూట పర్వతం) ప్రాంతాల్లో ప్రవాసాన ఉంటూ ఎనిమిది నెలలు భార్యా విరహంతో భారంగా గడుపుతూ, ఆషాడమాసంలో కనిపించిన మేఘంతో తన క్షేమ సమాచారాన్ని సందేశంగా తన భార్యకు విన్పించమని కోరుతూ అలకాపురి వెళ్లే దారినీ, అలకాపురి వైభవాన్ని వివరించి చెప్తాడు. మేఘడు వెళ్లి ఆ సందేశాన్ని యక్షుడి భార్యకు దేవభాషలో విన్పిస్తాడు. యక్షరాజైన కుబేరుడు అది విని యక్షుడి శాపకాలాన్ని తగ్గించి యక్షుడినీ, యక్షుడి భార్యనూ కలపడంతో కథ ముగుస్తుంది.
‘మేఘ సందేశమ్’లో రెండు సర్గలున్నాయి. ప్రథమ సర్గ అయిన పూర్వ మేఘంలో అరవై ఏడు శ్లోకాలు, రెండవ సర్గ ఉత్తర మేఘంలో యాభై ఏడు శ్లోకాలున్నాయి. మొత్తం 124 శ్లోకాలు. ఈ ఖండకావ్యం మొత్తం మందాక్రాంత వృత్తాల్లో రచింపబడింది.
కశ్చిత్కాంతా విరహగురుణా స్వాధికారాత్ప్రమత్తం / శాపేనాస్తంగమితమహిమం వర్షభోగ్యేన భర్తుకి / యక్షశ్చక్రే జనక తనయా స్నానపూర్వోదకేషు / స్నిగ్ధచ్ఛాయా తరుషు వసతిం రామగిర్యాశ్రమేషు. (అలయక్షుడొకడు పరాకున / భృత్యవిధిని మరిచిన ఫలితంగా / యక్షరాజు చేత ఏడాదిపాటు భార్యా విరహభార శిక్షానుభవ్య శప్తుడై / సీతాస్నాత పునీత జలాలనూ, చిక్కటి నీడల చెట్లనూ కలిగివున్న / రామగిరి మలనివాసాలందున / తన ప్రవాస నివాసాన్ని ఏర్పరచుకున్నాడు! అంటూ ప్రారంభమవుతుంది మేఘసందేశమ్ ఖండకావ్యం. (ఇది నా స్వేచ్ఛానువాదం).
శ్రుత్వా వార్తాం జలదకధితాం తాం ధనేశోపి సద్యః/ శాపస్యాన్తం సదయ హృదయః సన్నిధాయాస్తకోపః/ సంయోజ్యైతౌ విగళిత శుచౌ దంపతీ హృష్టచిత్తౌ/ భోగా నిష్టా నభిమత సుఖాన్ప్రాపయామాస భూయః’ – (మేఘుడు వినిపించిన ఆ యక్ష విరహ సందేశాన్ని/ ఆలకించిన యక్షరాజైన ధనేశ కుబేరుడు కోపాన్ని వదిలి దయాహృదయుడై వెనువెంటనే తన / భృత్యయక్షుడి శాపాంత వ్యవధిని తగ్గించి/ వియోగశోక విముక్తులైన ఆ యక్షదపంతులను తిరిగి చక్కగా ఒక్కటిగా చేసి/ మళ్లీ వాళ్ళు తమ ఇష్టంగా కోరుకున్న సుఖభోగాల ప్రాప్తిని ప్రసాదించినాడు!!) అనే శ్లోకంతో సుఖాంతంగా ముగుస్తుంది. పరుష పదాల కూర్పు లేకుండా, కఠిన పదాలు లేకుండా, దీర్ఘ సమాసభూయిష్టంగా ఉండకుండా, సరళంగా, లలితంగా ఉండే వైదర్భీరీతిలో సాగుతుంది కాళిదాసు కవిత్వం. అటువంటి రీతిలో సాగిన ఈ కావ్యానికి నలభై టీకాటిప్పణులు వెలువడటం ‘మేఘ సందేశమ్’ ప్రఖ్యాతిని తెలియజేస్తుంది.
మానవానుభూతులను నిరంతరం స్పృశిస్తూ, సార్వకాలిక భావనలతో రాసిన కవిత్వం నిత్యనూతనంగా ఉంటుంది. అటువంటి కవిత్వం రాశాడు కాబట్టే కాళిదాసు ప్రపంచ కవులలో ఒకడుగా నిలబడ్డాడు. ఇందుకే ‘మేఘ సందేశమ్’ భారతీయ భాషల్లోనే కాకుండా ఇంగ్లీష్, జర్మన్, ఫ్రెంచ్, చైనా భాషల్లోకి అనువదించబడింది. విశ్వకవి రవీంద్రుడు, డబ్ల్యూ.బీ. యేట్సు మున్నగువారు ఇంగ్లీషులోకి అనువదించారు.
ఒక చిన్న ఘట్టాన్ని తీసుకొని ఎక్కువ కథ లేకుండా వర్ణనలతో సాగేదే ఖండకావ్యం. ఇప్పటికి ‘మేఘ సందేశమ్’ను మించిన సందేశ కావ్యమ్ రాలేదని చెప్పవచ్చు. వాల్మీకీ రామాయణంలోని హనుమత్సందేశం కాళిదాసు ‘మేఘ సందేశమ్’కు ప్రధాన ప్రేరణ అని చెప్తారు పండితులు. దీనిని ఆదర్శంగా తీసుకొని ‘వాయు సందేశం’, ‘భృంగ సందేశం’, ‘కీర సందేశం’ మున్నగు కావ్యాలు వచ్చాయి.
తెలుగు అనువాదాలు: క్రీ.శ.1790లో కొటికెలపూడి వెంకటకృష్ణ కవి ‘మేఘ సందేశమ్’ అనువాదానికి అంకురార్పణ చేశారు. కానీ, ఇది అలభ్యం. వడ్డాది సుబ్బారాయుడి రచన తొలి అనువాదంగా చెప్పవచ్చు. ‘మేఘ సందేశమ్’ను ‘ద్విపద మేఘదూతం’గా నాలుగు ద్విపద పంక్తు ల్లో ఒక్కొక్క మందాక్రాంత వృత్తాన్ని అనువదించారు.
త్రిపురాన వేంకట సూర్యరాయ ప్రసాదరాయ కవి ‘మొయిలు రాయభారం’ పేరిట యక్షగానం ఏకాంకికగా రచించారు. రాయప్రోలు సుబ్బారావు ‘దూతమత్తేభం’ పేరిట యతిప్రాస రహితంగా అనువదించారు. కలచవీడు శ్రీనివాసాచార్యులు ‘విరహి’ పేరిట సీసపద్యానువాదం చేశారు. శ్రీ ముకురాల రామారెడ్డి గేయరూపంలో అనువదించారు. ఇట్లా కాళిదాసు ‘మేఘసందేశమ్’కు తెలుగులో మహామహులైన కవులెందరో పద్యగేయాల్లో అనువాదం చేసి కాళిదాసు కవిత్వ మహితత్వాన్ని చాటిచెప్పారు.
మహాకవి కాళిదాసు అద్భుతమైన సూక్ష్మమైన పరిశీలననూ, భౌగోళిక పరిజ్ఞానాన్ని ప్రకటించే ‘మేఘ సందేశమ్’ను నేనూ తెలుగులో చంద్రుడికో నూలుపోగులా వచనకవితా రూపంలో అనువదించాను.
– రఘువర్మ 92900 93933