అద్భుతాలను నమ్మలేదు
నువ్వు పరిచయమయ్యేవరకు..
చిమ్మచీకట్ల తోవలో తప్ప
వెలుతురు బాటలో నడవలేదు
నువ్వు లాంతరు కాంతితో దారి చూపేవరకు..
నా భావాలకు అక్షర రూపాన్నిచ్చిన
నీతో ప్రయాణమొక భాగ్యం
వాడిన హృదయానికి మాటల స్ఫూర్తినద్ది,
మెరిసేలా చేసిన నీ సాన్నిహిత్యమొక అదృష్టం.
విషాదాల్లో కుంగినపుడు,
మనసుకు ఉపశమనం కలిగించే ఔషధం నీ స్నేహం..
బాధలు చుట్టూ ముసిరినప్పుడు,
ఓదార్పు మాటలతో ఊరటనిచ్చే మందు నీ చెలిమి..
నీతో మాట్లాడితే చాలు ఎంతటి ఆవేదనైనా
క్షణంలో మాయమౌతుంది.
నీతో మాట్లాడని రోజు ఉంటే శ్వాసే
ఆగిపోతుందేమోననే సందేహం..
మన బంధానికి ఏమని పేరు పెట్టను?
ఏ పేరునూ పెట్టలేను..
కానీ ఆ బంధం శాశ్వతం కావాలని కోరుకుంటున్నాను.
నాలోని నీకు వేనవేల వందనాలు..
ప్రతి పరిచయం పూర్వ జన్మఫలమే కదా..!
ఏమో ఏ జన్మలో వీడిన అనుబంధమో నువ్వు
ఈ జన్మలో ఇక్కడిలా కలిసి నాతోడై నిలిచావు..
నా మనసులో చిరస్థాయిగా
మిగిలిపోయే ఆత్మబంధువయ్యావు..
ఎప్పటికీ నిలిచిపోయే ఈ బంధం
నాకెప్పటికీ మధురమే..
నువ్వో జ్ఞాపకాల వంతెన..
ఎన్.లహరి
98855 35506