పచ్చని బాటలో చేతగాని ఆటలు..
చెత్తబుట్టల కథలు..
‘చేదు నిజాల’ను అణగదొక్కుడు..
అడవి తల్లిని కుదువవెట్టుడు..
ఆకలి కడుపులల్ల మేకులు దించుడు..
ఒప్పదిది.. ఒప్పదు..!
సాంకేతిక ఆధారమట
డ్రోన్ల క్లిక్కులట
శాటిలైట్ చిత్రమట
కారడవిల బూట్ల సప్పుడట
దాని పేరు ‘కగార్’ అట..!
ప్రశ్నలొద్దట
జవాబే లేదట..
చర్చలొద్దట
తూటాలే పొడిసేటి పొద్దట..
ధర్మం, అధర్మమేదో
‘కర్మ’కు తెలుసట..!
ఢిల్లీ దోపిడీ ఒడిసి
ఒర్రెల సూపు వడ్డది
నేలమ్మ గర్భమొకటే ఉన్నది
‘కుటిల నీతి’ కుతంత్రమిది
‘పగటి కలల’ పాపమిది..!
శత్రు గుండెల్లో ‘సింధూర్’ నాదమట
కోరితే ‘శతష్నుల మౌనమట’
అవినీతికే అధిక గౌరవమట
అన్నలు నేలకొరిగితే అప్పగించరట
ఆత్మఘోషలే ఆఖరి చూపులట
ఒప్పదంటే ఒప్పదిది..!
డబ్బు ఆకలి నచ్చని ఊరిలో..
అణచివేత నడిచే దారిలో..
కులమతాల కలుషిత వీధిలో..
వేగుచుక్కలై పుడతరు
మండే కడుపున మళ్లా
ఉదయిస్తరు.. ప్రశ్నిస్తరు..!
ఎర్ర పూలకు ఎదురుకాల్పులు
‘దంతెవాడ’ను పంటి బిగువున దాసుకున్నది
‘మానాల’ను మదిల వెట్టుకున్నది
పాణాలను మింగే హక్కెక్కడిదన్నది
కర్రెగుట్టల డేరాల జూసి
కడుపుల పేగు కదులుతున్నది..
కొమ్మ సాటున యెక్కి యెక్కి ఏడ్సినది
కండ్లెర్రవడి అడుగుతున్నది ఈ నేలతల్లి..
కగార్ ‘కానా’ల కాదని
అవినీతి గుండెల్ల వెట్టమని…
– సురేంద్ర బండారు 9010847120