ప్రపంచ జనాభాలో భారతదేశం 2023లో చైనాను వెనుకకు నెట్టి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నది. ప్రస్తుతం మనదేశ జనాభా 147 కోట్ల పైచిలుకుగా ఉన్నది. అయితే క్రమంగా జననాల రేటు తగ్గుతుండటంతో మరో 20 ఏండ్లల్లో జనాభా గ్రాఫ్ నేలచూపులు చూడటం ఖాయమని నిపుణుల అంచనా. జననాల రేటు వేగంగా పడిపోతుండటమే అందుకు కారణం. వార్షిక పెరుగుదల రేటు 1961లో 2.41 శాతం ఉండగా ప్రస్తుతం అది 0.86 శాతం వద్ద కొనసాగుతున్నది. ప్రస్తుత జనాభా రేటు స్థిరంగా కొనసాగాలంటే ప్రతి మహిళ సగటున 2.1 శిశువులకు జన్మనివ్వాల్సి ఉండగా 1.9 జననాలు మాత్రమే నమోదవుతున్నాయి. భారతదేశంలో పడిపోతున్న జననాల రేటు సంతానోత్పత్తి సంక్షోభాన్ని స్పష్టం చేస్తున్నది. ఇలా ఎందుకు జరుగుతున్నది అనేది ఆలోచించాల్సిన విషయం. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోయి సామాజికార్థిక విపరిణామాలు చోటుచేసుకొనే ప్రమా దం తొంగిచూస్తున్నది. జననాల రేటు పడిపోవడం అనేది ఏదో యథాలాపంగా జరుగుతున్న పరిణామం కాదు. దీని వెనుక పెద్ద సమస్యే ఉన్నదని నిపుణులు చెప్తున్నారు.
జనాభా గణాంకాలకు అతీతంగా, ప్రత్యుత్పత్తి ఆరోగ్యంపై విధాన నిర్ణేతలు ప్రత్యేకించి దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. పెరుగుతున్న వంధ్యత్వం, ఆలస్యంగా తల్లిదండ్రులు కావడం, జీవనశైలి సంబంధిత ఆరోగ్య సమస్యలు, సంతానోత్పత్తిపై తక్కువ అవగాహన వంటివి దీనికి కారణాలని సంతానోత్పత్తి నిపుణులు చెప్తున్నారు. ప్రత్యుత్పత్తి ఆరోగ్యం అనేది కేవలం వ్యక్తిగత సమస్యగా మిగిలిపోకుండా, క్రమంగా ప్రజా ఆరోగ్య సమస్యగా మారుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఇది భారతీయులు కుటుంబ నియంత్రణను అనుసరించే విధానాన్ని ప్రభావితం చేస్తున్నది. ఈ సమస్యలో రెండు పార్శ్వాలున్నాయి. ఒకటి, సామాజిక, ఆర్థిక కారణాల వల్ల ఐచ్ఛికంగా పిల్లలను వద్దనుకొనే, లేదా పరిమితంగా కనే ధోరణి పెరుగుతుండటం. రెండు, దాంతోపాటే సంతానం కావాలనుకున్నవారికి కలుగకపోవడం. ఈ రెండో జాబితాకు చెందిన జంటలు సంతానోత్పత్తి చికిత్సా కేంద్రాలను ఆశ్రయించడం అంతకంతకూ పెరుగుతున్నది. సంతానలేమికి దారితీసే అనారోగ్య పరిస్థితుల వెనుక జీవనశైలితో పాటుగా పర్యావరణ సమస్యలూ ఉండటం గమనార్హం. ఎంత ఆలస్యమైతే సం తాన సాఫల్యత అవకాశాలు అంతగా మృగ్యం అవుతుండటం కొట్టొచ్చినట్టు కనబడే అంశం. వివిధ ప్రాంతాల్లో సంతానోత్పత్తి రేట్లలో భౌగోళిక, సామాజిక, ఆర్థిక అంశాలు తేడాలు కలిగిస్తున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో హెచ్చుతగ్గులుండటం సర్వసాధారణం. అయితే ఇక్కడ ప్రత్యేకించి గమనించాల్సింది ఉత్తర, దక్షిణ తేడాలు. భారతదేశ జనాభా కథ ఏకరీతిగా లేదు.
యూపీ, బీహార్ సహా ఏడు ఉత్తరాది రాష్ర్టాల్లో జనాభా పెరుగుదల రేటు జాతీయ సగటు మించి 2.5-3.0 శాతంగా ఉన్నది. దక్షిణాది రాష్ర్టాలలో వృద్ధుల జనాభా వేగంగా పెరుగుతుండగా, వృత్తిఉద్యోగాల పేరిట ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారి సంఖ్య మందగిస్తున్నది. ఉత్తరాది రాష్ర్టాలలో యువ జనాభా అధికంగా ఉండటంతో వలసల స్వరూప స్వభావాలే మారిపోతుండటం మనం చూస్తున్నాం. ఒకప్పుడు దుబాయ్ వంటి విదేశాల్లో పనికి వెళ్లేవాళ్లలో దక్షిణాది వారిదే పైచేయిగా ఉండేది. ఇప్పుడు యూపీ, బీహార్ ప్రథమ, ద్వితీయ స్థానంలో ఉండటం గమనార్హం.
దేశంలో జనాభా తగ్గుముఖం పట్టడం, అందులో భౌగోళిక తేడాలు ఉండటం తేలికగా తీసుకునే వ్యవహారం ఎంత మాత్రం కాదు. ఈ చర్చ కేవలం జనన గణాంకాలకే పరిమితం కాకుండా, పునరుత్పత్తి ఆరోగ్యం మరియు శ్రేయస్సుపై మరింత విస్తృతంగా దృష్టి పెట్టాలి. పునరుత్పత్తి ఆరోగ్యం గురించి ప్రజల్లో, ముఖ్యంగా యువతలో అవగాహన పెంచేందుకు విధాన నిర్ణేతలు కృషి చేయాలి. పునరుత్పత్తి ఆరోగ్యాన్ని ప్రజారోగ్య సమస్యగా గుర్తిస్తేనే ఈ సమస్యలకు తెరపడుతుంది.