కోస్తా కన్నా ముందే నా గడ్డ నివాస యోగ్యమని
మానవ నాగరికత వికసించిన ఘనత నా నేలది!
అశ్మక ములక ముషక గణ రాజ్యాలన్నీ
బౌద్ధం కన్నా ముందే విలసిల్లిన చరిత్ర నాది!
కోటి లింగాలలో స్వాతంత్య్రం ప్రకటించిన
శ్రీముఖ శాతవాహన రాజ్యాధికారం నేనే!
॥ నేను తెలంగాణను – తెలుగు ఆణెమును॥ 2
వాత్సాయనుడు నాగార్జునుడు కుతూహలుడు కుమారిలుడు
దార్శనికతతో వెదజల్లిన బౌద్ధ పరిమళం నేనే!
విష్ణుకుండిన గోవిందవర్మ తామ్ర శాసనం
నా గడ్డమీది తొలి శిలా దాన శాసనం!
జనాశ్రయుని ఛందో విచ్ఛిత్తిలోని సీస పద్యలక్షణమూ
అచ్చమైన తెలుగు ఛందో పద్య రచనకూ తార్కాణం నేనే!
॥ నేను తెలంగాణను – తెలుగు ఆణెమును॥ 2
‘ఏకోరసః కరుణ ఏవ’ సిద్ధాంతకర్త భవభూతి
నాటకాల జన్మస్థలం ప్రదర్శన క్షేత్రం విదర్భ నాదే!
గుజరాతు లాట దేశ చాళుక్యులు మొదటగా
వలస వచ్చిచేరిన పోదన (బోధన్), వేములవాడ రాజధానులు నేనే!
చాళుక్యుల కళా సాహిత్య పోషణలో విరాజిల్లిన
విలసిల్లిన వేములవాడ, కొలనుపాక ఆలయాలు నేనే!
॥ నేను తెలంగాణను – తెలుగు ఆణెమును॥ 2
యశస్తిలకుడు సోమదేవసూరి
కథాసరిత్సాగర కవనధారి ఆశ్రయం నాదే!
కన్నడ భారత కవి పంపని జినేంద్ర పురాణం
భాష ప్రాచీనతకు కట్టిన పట్టాభిషేకం నాదే!
జినవల్లభుని గంగాధర (కురిక్యాల) శాసన కందపద్యాలు
ప్రాచీన పద్య వైభవ ప్రాభవాలు నేనే!
॥ నేను తెలంగాణను – తెలుగు ఆణెమును॥ 2
(క్రీ.పూ. బౌద్ధం పూర్వం నుంచి
క్రీ.శ. 11వ శతాబ్దం పూర్వం వరకు
తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక వైభవం)
డాక్టర్ బోయినిపల్లి
ప్రభాకర్
9490901050