మానవ జీవితాల్లోని అన్ని అంశాలను స్పృశించిన మహాభారతానికి విశ్వసాహిత్యంలో ప్రముఖ గుర్తింపు ఉన్నది. ‘రాజకీయాలు ఎలా ఉంటాయి, నేతలు తమ పదవులు, అధికారాన్ని కాపాడుకోవడం కోసం ఎలాంటి ఎత్తుగడలు వేస్తారు’ అన్నది భారతంలో ఉన్నది.
ధర్మరాజు తన సద్గుణాల చేత ప్రజల మనస్సులను ఆకర్షించి తండ్రి పాండురాజును మరపింపజేశాడు. భీముడు ఖడ్గ, రథ యుద్ధాల్లో శిక్షణ పొందాడు. ప్రత్యేకించి గదా యుధ్ధంలో చాలాకాలం బలరాముని వద్ద శిష్యరికం చేశాడు. అర్జునుడు వివిధ ఆయుధ ప్రయోగాల్లో తనకు ఎవరూ సాటిలేరని నిరూపించుకున్నాడు. నీతిమంతుడైన సహదేవుడు దేవేంద్రుని నుంచి నీతిశాస్త్రం అంతా అభ్యసించాడు. ద్రోణాచార్యుల వద్ద సకల శస్ర్తాస్త్ర విద్యలు నేర్చుకున్న నకులుడు చిత్రయుద్ధంలో ప్రవీణుడయ్యాడు. ఈ విధంగా పాండవుల కీర్తి దినదినాభివృద్ధి పొందుతుంటే ధృతరాష్ట్రుని మనస్సులో అసూయ కూడా పెరిగిపోయి రాత్రిళ్లు నిద్ర పట్టేది కాదు.
ఒకనాడు ధృతరాష్ట్రుడు రాజనీతిశాస్త్రంలో విశారదుడైన కణికుడు అనే మంత్రిని పిలిచి ‘బ్రాహ్మణోత్తమా..పాండవులు రోజురోజుకీ అభివృద్ధి చెందుతున్నారు. అది నేను సహించలేకపోతున్నాను. వాళ్ల విషయంలో నేను ఏ విధమైన రాజనీతి అనుసరించాలో చెప్పు! అలాగే చేస్తాను’ అని అన్నాడు. కణికుడు చెప్పడం ప్రారంభించాడు. ‘మహారాజా.. రాజనీతి శాస్త్రంలోని అంశాలు వినడానికి కాస్త కటువుగా ఉంటాయి. అలాంటి విషయాలను చెప్తున్నానని నాపై ఆగ్రహం చెందకండి! దండం చేతనే ప్రజలు లొంగుతారు. అందుచేత పాలకులు తమ పౌరుషాన్ని ప్రదర్శిస్తూ నిత్యం దండన విధించాలి. తమలోని లోపాలను కనబడనీయకుండా జాగ్రత్తపడుతూ ఇతరుల లోపాలను కనిపెడుతూ ఉండాలి’ అంటూ..
నిత్యముద్యతదండః స్యాత్ నిత్యం వివృతపౌరుషః,
అచ్చిద్రశ్ఛిద్రదర్శీ స్యాత్ పరేషాం వివరానుగ: (ఆదిపర్వ 139.6)
శత్రువు దుర్బలుడే కదా అని ఉపేక్షించకూడదు. శరణు జొచ్చినవాని మీద దయచూపకూడదు. అగ్నిహోమాలు చేస్తూ యజ్ఞాలు ఆచరిస్తూ, కాషాయవస్ర్తాలు, జతలు, అజీనమూ ధరిస్తూ, లోకుల్ని నమ్మించాలి. తరువాత తోడేలు మీద పడ్డట్లుగా వాళ్లను నశింపచెయ్యాలి.
అగ్న్యాధానేన యజ్ఞేన
కాషాయేణ జటాజినైః,
లోకాన్విశ్వాసయిత్వైవతతో లుమ్పేద్యథా వృకః (ఆదిపర్వ.139.19)
కొంతకాలం పాటు శత్రువును కూడా భుజం మీద ఎక్కించుకొని మోయాలి. సరైన సమయం దొరకగానే కుండను రాతిమీద వేసి బద్దలుకొట్టినట్లుగా పడేసి తొక్కాలి.
వహేదమిత్రం స్కంధేన
యావత్ కాలస్య పర్యాయః
తత: ప్రత్యాగతే కాలే భిన్ద్యాద్ఘటమివాశ్మని (ఆదిపర్వ. 139.21)
ఎంత దీనంగా వేడుకొన్నా శత్రువును విడిచిపెట్టకూడదు. సామ- దాన-భేద-దండోపాయాల్లో ఏదైనా ఒకటి, లేదా అన్నింటినీ ప్రయోగించి శత్రువును నాశనం చెయ్యాలి. మహారాజా! పిరికివానిని భయం చూపి భేదింపచెయ్యాలి. శూరుడికి నమస్కరించి, ధనాశ గలవానిని డబ్బు ఎరజూపి, సమబలుడిని, దుర్బలుడిని బలం ప్రయోగించి భేదింపచెయ్యాలి.
భయేన భేదయేద్భీరుం
శూరమజ్గిణలికర్మణా,
లుబ్ధమర్ధ ప్రదానేన సమం న్యూనం తథౌజసా. (ఆదిపర్వ. 139.50)
అభివృద్ధ్ధి కావాలనుకునేవాడు ఎదుటివాడు పుత్రుడు, మిత్రుడు, సోదరుడు, తండ్రి, గురువు, ఎవరైనా కానీ శత్రుస్థానంలో ఉంటే వానిని పరిమార్చాలి. శత్రువును అసత్యమైన ఒట్టు పెట్టి లేదా అద్దెకి తెచ్చుకున్న హంతకులకు డబ్బు ఇచ్చైనా విషం చేత, మాయచేత చంపించివేయాలి. మంచి చెడ్డలు తెలియక వక్రమార్గంలో ప్రవర్తిస్తున్న గురువునైనా శాసించడం న్యాయసమ్మతం.
గురోరప్యవలిప్తస్య
కార్యాకార్యమజానతః,
ఉత్పథమ్ ప్రతిపన్నస్య
న్యాయం భవతి శాసనమ్.
(ఆదిపర్వ. 139.54).
ఎంత కోపం వచ్చినా పైకి కనబడనీయకూడదు. చిరునవ్వు నవ్వుతూ మాట్లాడాలి. కోపంతో ఎవరినీ చీదరించుకోకూడదు.
కృద్ధో ష్యక్రుద్ధరూపః
స్యాత్ స్మితపూర్వాభిభాషితా,న చ్యాప్యన్యమపధ్ధ్వంసేత్ కదాచిత్కోపసంయుత:.(ఆదిపర్వ. 139.55)
ఎదుటివాని మీద దెబ్బ తీసే ముందు, దెబ్బ తీసేటప్పుడు ప్రియంగా మాట్లాడాలి. దెబ్బ తీసిన తర్వాత జాలిపడాలి, పశ్చాత్తాపం చూపాలి, అవసరమైతే ఏడ్వాలి!
ప్రహరిష్యన్ ప్రియం బ్రూయాత్ ప్రహరన్నపి భారత, ప్రహృత్య చ కృపాయీత శోచేత చ రుదేత చ.
(ఆదిపర్వ. 139.56)
ఘోరమైన అపరాధం చేసినవాడు ధర్మమార్గంలో ఉంటే ఆ అపరాధం ‘పర్వతం తెల్ల మేఘాలచే కప్పబడిపోయినట్లుగా’ కప్పబడిపోతుంది. ఎవని విషయంలో శంక ఉం డడానికి అవకాశం లేదో వానిని కూడా శం కించాలి. శంకించే అవకాశం ఉన్నవాన్ని మా త్రం నిత్యం శంకిస్తూ ఉండాలి. మన పట్ల విశ్వాసం ఉన్నవాడిని కూడా నమ్మకూడదు.
న విశ్వసేదవిశ్వస్తే
విశ్వస్తే నాతివిశ్వసేత్,
విశ్వాసాద్భయముత్పన్నం మూలాన్యపి నికృన్తతి.(ఆదిపర్వ. 139.62)
ఏదైనా క్రూరమైన పని చేయదలచినవాడు వినయం ఉట్టిపడేటట్లు మాట్లాడాలి. హృదయం మాత్రం కత్తి వలె తీక్షణంగా ఉంచుకోవాలి. నవ్వుతూ మాట్లాడాలి. అభివృద్ధిని కోరేవాడు సవినయంగా మాట్లాడుతూ ఒట్టు పెడుతూ ఉండాలి. మంచి మాటలు మాట్లాడాలి. శిరస్సుతో పాదాభివందనం చేస్తూ ఉండాలి. ఆశ చూపుతూ ఉండాలి. తాను దీనస్థితిలో ఉన్నప్పుడు మృదువైన విధానంతో లేదా దారుణమైన పద్ధతితో కష్టాల నుంచి బైటపడాలి. సమర్థుడైన తర్వాత ధర్మం ఆచరించాలి. రిస్క్ తీసుకోకుండా మానవుడు మంచి ఫలితాన్ని, ఉన్నతిని పొందజాలడు. సంశయమైన పనిచేసిన తర్వాత బతికిఉంటే మంచిని, అభివృద్ధిని చూస్తాడు.
న సంశయమనారుహ్య
నరో భద్రాణి పశ్యతి,
సంశయం పునరారుహ్య యది
జీవతి పశ్యతి.(ఆదిపర్వ.139.73)
శత్రువుతో సంధి చేసుకొని, ‘హమ్మయ్యా! కృతకృత్యున్నయ్యాను’ అని నిద్రపోయేవాడు చెట్టుకొమ్మ చివర పడుకున్నవాడి వలే కింద పడిన తర్వాతనే మేలుకొంటాడు.
యో రిణా సహ సంధాయ
శయీత కృతకృత్యవత్,
స వృక్షాగ్రే యథా సుప్త: పతిత:
ప్రతిబుధ్యతే.(ఆదిపర్వ. 139.75)
చేపను చంపేవానివలె పరుల మర్మాలు ఛేదించకుండా అనగా మనిషి బలహీనతలపై దెబ్బ తీయకుండా, దారుణమైన పనులు చేయకుండా, చంపకుండా ఎవ్వడు కూడా గొప్ప ఐశ్వర్యాన్ని పొందజాలడు.
నాచ్ఛిత్వా పరమర్మాణి
నాకృత్వా కర్మ దారుణమ్,
నాహత్వా మత్స్యఘాతీవ
ప్రాప్నోతి మహతీం శ్రియం.
(ఆదిపర్వ. 139.77)
ఏదైనా పని ఉంటేనే ఒకడు మరొకని దగ్గరికి వెళ్తాడు. పని పూర్తయిపోతే ఇంకా రావడమే ఉండదు. అందుచేత అన్ని పనులను అరకొరగానే చేసిపెట్టాలి.
నార్థికో (నా+అర్ధిక) ర్థినమభ్యేతి కృతార్థే నాస్తి సంగతమ్, తస్మాత్సర్వాణి సాధ్యాని సావశేషాణి కారయేత్.(ఆదిపర్వ. 139.79).
తాను చేస్తున్న పనులను గురించి శత్రువులకు, మిత్రులకు తెలియకూడదు. అది ప్రారంభం అయిన తరువాత లేదా పూర్తి అయిన తర్వాత ఇతరులకు తెలియాలి.
నాస్య కృత్యాని బుధ్యేరన్
మిత్రాణి రిపవస్తథా,
ఆరబ్ధాన్యేవ పశ్యేరన్ సుపర్యవసితాన్యపి.
(ఆదిపర్వ. 39.81).
ఆపద రానంతవరకు దానికి భయపడుతున్నట్లు ప్రతిక్రియ చేసుకోవాలి. ఆపద వచ్చిందా, దానిని ధైర్యంగా ఎదుర్కోవాలి.
భీతవత్ ప్రతికర్తవ్యం
యావద్భయమనాగతమ్,
ఆగతం తు భయం దృష్ట్వా ప్రహర్తవ్యమభీతవత్.(ఆదిపర్వ. 139.82)
పై వానికి ఆశ చూపించాలి. ఆ కాలానికి ఏదో విఘ్నం జోడిస్తూ ఉండాలి. ఆ విఘ్నానికి ఏదో కారణం చెబుతూ ఉండాలి. దానికి ఒక హేతువు చూపుతూ ఉండాలి.
ఆశాం కాలవతీం కుర్యాత్ కాలం
విఘ్నేన యోజయేత్, విఘ్నం నిమిత్తతో బ్రూయాత్ నిమిత్తం వాపి హేతుత: (ఆదిపర్వ. 139.88).
మహారాజా! పాండవుల విషయంలో, ఇతరుల విషయంలో నీకు ఏది న్యాయం అనిపిస్తే అది చెయ్యి! నువ్వు ఎలా మునిగిపోకుండా ఉంటావో చూసుకొని ప్రవర్తించు! అని ఉపదేశించి ఇంటికి వెళ్లిపోయాడు. కణికుడు బోధించిన కూటనీతిని అన్ని కాలాల్లోనూ, అన్ని దేశాల్లోనూ పాలకులు, ఏదోవిధంగా అధికారాన్ని పొందాలని కోరుకునేవారు, ధనం సంపాదించాలనుకునేవాళ్లు అనుసరిస్తున్నారు. ‘అన్ని సంక్షోభాలకు మూలకారణం ఈ కూట నీతే!’ విషయాన్ని అందరూ గ్రహించి దాన్ని విడనాడడం కోసం ప్రయత్నిస్తే విశ్వశాంతి
ఏర్పడుతుంది.
-సారంగ వడ్డేపల్లి
9390251502