Samantha | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమా ప్రీమియర్ షోలు ప్రారంభం కాగా, అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ కొత్త లుక్‌లో కనిపించనుండగా, ఆయన చేసిన ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పెద్ది పై అంచనాలు ఓ రేంజ్లో ఉండగా, పలువురు సినీ సెలబ్రిటీలు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో స్టార్ హీరోయిన్ సమంత కూడా ప్రత్యేకంగా స్పందించింది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఒక వీడియోను పంచుకున్న సమంత, చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలియజేసింది.
ఆ వీడియోలో సమంత మాట్లాడుతూ, “నేను ‘పెద్ది’ సినిమా కోసం చాలా ఎగ్జైట్‌గా ఎదురుచూస్తున్నాను. ఇది పూర్తిగా ‘పెద్ది’ సమయం. చరణ్ ఈ సినిమాలో అద్భుతమైన నటన కనబరుస్తాడనే నమ్మకం ఉంది. ఈ పాత్ర కోసం అతను ఎంతో కష్టపడ్డాడు. చిత్ర బృందం మొత్తం విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకు నాకు బ్లాక్‌బస్టర్ వైబ్స్ కనిపిస్తున్నాయి” అని చెప్పింది. సమంత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ అభిమానులు ఆమెకు ధన్యవాదాలు తెలుపుతూ వీడియోను విస్తృతంగా షేర్ చేస్తున్నారు. గతంలో రంగస్థలం సినిమాలో రామ్ చరణ్, సమంత కలిసి నటించి భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఆ జోడీకి ఇప్పటికీ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది.
ఇక సమంత ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా జూన్ 19న విడుదల కానుండగా, మరోవైపు ‘పెద్ది’ విడుదల కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.