అవును ఇది మా అయ్యల జాగిరే
ఇక్కడ పోరాటాలు పురుడుపోసుకున్నప్పుడు
ఇక్కడ తుపాకులు మృత్యుఘోషలై గర్జిస్తున్నప్పుడు
కొమురం భీం, సర్వాయి పాపన్న మా జాగీరే
ఇక్కడ పెయ్యి మీది బట్టపేగులు రక్తంతో తడిసి
రక్త రగల్ జెండాలై ఎగిసినరోజు
బరాబర్ ఇది కమ్మరి బ్రహ్మయ్య,
నల్ల నర్సింహులు, చాకలి ఐలమ్మ జాగీరే
వడ్ల ఎల్లయ్య ధాతికి సాకవోసిన
సాలేటి కుందెన్ల కొత్తొడ్ల కొలుపులే
పండుగ సాయన్న, మాదిగ జుట్టెంక్కయ్య జాగీరే
పెద్దగొల్ల నరసింహులు
ఏడుదుక్కుల ఎడ్ల కోండ్ర
పరుపుదాల్ల జగ్గల కింద దాసిన
ఆరుద్ర పురుగుల అయ్యజాగీరే
సిరిసనవాడల్ల కోటివేయిల
కుమ్మరిపురుగులు
మంగలోని పడె మీద మాల సూరమ్మ జోలె
పూసలి సత్తెమ్మ గాజుల గంపలు
ఎరుకలి ఎల్లమ్మ జీవులెనుబది లక్షలు
మా జాగీరే
వొట్టిపోయిన వంగపండ్ల సంగతి సూడనోడు
గద్దర్కి గజ్జెల లాగులు కొనిచ్చినాడట
దండంరా దూత
చెరువుగట్టు గుండ్ల మీద జాగిప్పిస్తం
గవ్వలు, పావులాలు, తూటుపైసలు,
యాపరిల్లలు పట్టుకొని శిగాలూగు
పచ్చని తెలంగాణాల చిచ్చుబెట్టకు
తెలంగాణను తెర్లుజేయకు
– విశ్వనాథుల పుష్పగిరి