తెలుగు కావ్య ప్రపంచంలో సరికొత్త అలంకారికతను గుబాళించిన ప్రభావశాలి కవి గుంటూరు శేషేంద్ర శర్మ. తెలుగు భాషలో ఉన్న సౌందర్య మాధుర్యాలన్నీ వడబోసి కవిత్వానికి కానుకగా ఇచ్చిన పదశిల్పి, రూపశిల్పి శేషేంద్ర శర్మ.
సంస్కృత సంప్రదాయ సాహిత్యంలోని విశేష సోయగాలను అలంకరించి, ఫ్రెంచి నవీన కవితా ప్రపంచంలోని చిత్రరీతులను మేళవించి, ఉర్దూ పారశీక సాహిత్యాల్లోని చమత్కార తరంగాలను రంగరించి తెలుగు కవిత్వ సరళిని వినూత్న శైలిలో నడిపించిన ప్రతిభామూర్తి శేషేంద్ర శర్మ. వైదిక వాఙ్మయంలోని తాత్వికతను తరచి చూడగల కౌశలం. భౌతిక విజ్ఞానంలోని శాస్త్రసత్యాలను పరిశీలించే నిశిత దర్శనం శేషేంద్ర శర్మ రచనల్లోని ప్రత్యేకత.
సంతరించుకున్న పాండిత్యానికీ, సహజంగా వికసించిన సృజనాత్మకతకూ నడుమ అర్థవంతమైన వంతెన నిర్మించిన ఘనత ఆయనది. పేలవమైపోయిన తెలుగు వాక్యాన్ని ఊహశక్తి. ఉక్తి వైచిత్రి, రంగుల ఈకలతో తీర్చిదిద్ది కొత్త ఆకర్షణ కలిగించిన కవి, కవులకు సేన ఉండాలని కలగన్న కవి, కవిసేనను ప్రతిపాదించిన కవి, సమాజాభివృద్ధి వైజ్ఞానిక నాయకత్వంతోనే సాధ్యమని భావించిన కవి స్వాప్నికుడు గుంటూరు శేషేంద్ర శర్మ.
గుంటూరు శేషేంద్ర శర్మ నెల్లూరు జిల్లా నాగరాజపాడులో 1927 అక్టోబర్ 20వ తేదీన సుబ్రహ్మణ్యశర్మ, అమ్మాయమ్మ దంపతులకు జన్మించారు. గుంటూరు ఎ.సి. కాలేజీ నుంచి పట్టభద్రుడయ్యారు. మద్రాస్ లా కాలేజీలో లా చదివారు. ఏపీ ప్రభుత్వ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేశారు. హిందీ అకాడమీ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో శేషేంద్ర శర్మను సత్కరించింది.
మండే సూర్యుడు, గొరిల్లా, నా దేశం నా ప్రజలు నీరైపారిపోయింది, జనవంశం, రుతుఘోష ఆయన కవితా సంపుటాలు. రక్తరేఖ, కవిసేన మ్యానిఫెస్టో, షోడశి రామాయణ రహస్యాలు, సాహిత్యకౌముది శేషేంద్ర వచన రచనలు. తెలుగు కవిత్వంలో సంచలనం సృష్టించిన శేషేంద్ర రచన గొరిల్లా.
మనిషి బంతిగా ఎగురగొట్టాడు
సూర్యుడ్ని ఆకాశంలోకి-
అదే నా రస్తా
ఏ రస్తా ప్రజాకోట్ల అడుగులతో
పునీతం అయిందో
అదే నా రస్తా
ఏ రస్తా నా దేశం శరీరంలో
పల్లెలగుండా పట్నాల గుండా
మండే రక్తనాళంలా
పరుగెత్తుతుందో
అదే నా రస్తా
ఏ రస్తా
లోకం సుఖం కోసం
తను కష్టాల్ని వరించిందో
అదే నా రస్తా
ఏ రస్తా యుద్ధాలు చేస్తుందో
ప్రాణాల్ని ఆటబంతుల్లా
విసిరేస్తుందో
గెలుస్తుందో ఓడుతుందో
అదే నా రస్తా
ఏ రస్తాలో సంకెళ్లు కూడా
సవాల్ చేస్తాయో
ఏ రస్తాలో అపజయం కూడా
అగ్నిజ్వాలై మండుతుందో
ఏ రస్తాలో మరణం
మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో
అదే నా రస్తా….
– గుంటూరు శేషేంద్ర శర్మ (‘ఆధునిక మహాభారతము’ నుంచి)
– (వ్యాసకర్త: కవి, విమర్శకులు, మాజీ అధ్యక్షుడు తెలంగాణ సాహిత్య అకాడమీ)
డాక్టర్ నందిని సిధారెడ్డి