చదువుల తల్లికి
దండం పెట్టాల్సినవారు
పిండం పెడుతుండ్రు
ప్రజాపాలన కృతఘ్నత
భూమి జాతీయసంపద
తాకట్టుకు విలాసాలకు వెంచర్లకు
ఆట వస్తువు కాదు
అందాల పోటీల వ్యాపారం అసలే కాదు
విజ్ఞాన చంద్రికల చదువుల ఒడి
దేశ విదేశాల వలస పక్షులు
విజ్ఞానార్జనకై వాలే జ్ఞానతోట
భూమి బిడ్డలు తీవ్రవాదులు కారు
జ్ఞానకెరటాలు
తమ గుండెను కోస్తున్నప్పుడు
ప్రతిఘటించడం జన్మహక్కు
విశ్వవిద్యాలయ విద్యార్థులు
సమాజపు దివిటీలు ఆశయాల వెలుగులు
ఇందిరమ్మ ఉట్టిగనే దానమియ్యలే
సిక్స్ పాయింట్ ఫార్ములా కింద
అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం
జై ఆంధ్ర ఉద్యమం
సంఘర్షణల తొలి ఫలితమే
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ
హరిణాలను పశుపక్ష్యాదులను
వన్యజీవులను నేలమట్టం చేసే
పర్యావరణ విధ్వంస ప్రతిఘాతుకం
నగరీకరణ పేరున
ఆకుపచ్చటి శ్వాసకోశల భాగ్యనగరంపై
బుల్డోజర్ల దండయాత్రలు
బువ్వ పెట్టినందుకు
బతుకునిచ్చినందుకు
రాజకీయ అధికారాన్నిచ్చిన ‘ధరణి’ని
అమ్ముకోవడం
జన్మనిచ్చిన తల్లిని వంచించటమే!
దశాబ్దాల స్వాతంత్య్ర చరిత్ర
రజతోత్సవాలు, స్వర్ణోత్సవాలు,
వజ్రోత్సవాలు, అమృతోత్సవాలు
భవిష్య శతోత్సవాల సంబురాలపై
ప్రజాపాలన కండ్ల మంటలు
ఆకుపచ్చని ఆకులపై కుబుసాలు
అవనిపై
రక్తపుటేరులు కాదు పూలు పూయించు
విశ్వవ్యాప్తమై పరిమళిస్తాయి
చెట్లను పెంచు
పర్యావరణ హితమై హరితవర్ణమవుతుంది
అక్షరాల మొక్కలు నాటు
జ్ఞానబోధులై దారిని చూపుత
– వనపట్ల సుబ్బయ్య 94927 65358