దేశాలను గౌరవిస్తారు. ప్రభుత్వాలను ప్రశ్నిస్తారు. గోదీ మీడియా మోదీ మానియాను ఎగదోసే మనదేశంలో ఈ రెండింటి మధ్య పెద్దగా తేడా లేకుండా పోతున్నది. మోదీని విమర్శిస్తే దేశాన్ని అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. దేశద్రోహం కింద కేసులు కూడా పెడుతుంటారు. కానీ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ఇదంతా కుదరదు. ప్రశ్నలు ఎదురైతే..వీలైతే దీటుగా సమాధానాలివ్వాలి. లేకపోతే ఊరుకోవాలి తప్ప మరో అవకాశం ఉండదు. ఖరీదైన సూటూ బూటూ వేసుకుని, ఖరీదైన కళ్లద్దాలు పెట్టుకుని, అనవసరపు కౌగలింతలు, చేయి వదలకుండా ఉడుంపట్టు బిగించే షేక్హ్యాండ్లూ సరేసరి. ఆపై ఎవరో చక్కిలిగింతలు పెట్టినట్టుగా పకపకా నవ్వేయడాలు దౌత్యంగా చలామణి అవుతున్నాయి మోదీ హయాంలో. ఇవన్నీ పైపై హంగులే. అసలు సమస్యలు ఎదురైనప్పుడే తెలుస్తుంది దౌత్యం విలువ ఏమిటో?. ఇంట్లో ఈగల మోత పెట్టుకుని బైట పల్లకీమోతలకు తయారైతే దౌత్యపరంగా ఇబ్బందులు తప్పవు. మొన్న ప్రధాని మోదీ నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. అక్కడి ప్రధాని రాబ్ జెట్టెన్ మన ప్రధానికి దౌత్య మర్యాదలు బాగానే చేశారు. అధికార లాంఛనాలతో ఘనస్వాగతం పలికారు.
కానీ అంతకుముందే మీడియాతో మాట్లాడుతూ భారత్ స్థితిగతులపై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. భారత్లో మైనారిటీల రక్షణ, పత్రికా స్వేచ్ఛ, చట్టబద్ధ పాలన లోపించాయని అన్నారు. మోదీ నేతృత్వంలోని హిందూ జాతీయవాద బీజేపీ పాలన కింద భారత్లో జరుగుతున్న పరిణామాలు ఆందోళనకరంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ ఆందోళన కేవలం తన దేశానిది మాత్రమే కాదని, యావత్తు యూరోపియన్ యూనియన్ దేశాల భావన కూడా ఇదేనని చెప్పటం గమనార్హం. ఈ ఆందోళనల గురించి భారత ప్రభుత్వంతో పలు సందర్భాల్లో ప్రస్తావించినట్టు నెదర్లాండ్స్ ప్రధాని చెప్పారు. ఈ వ్యాఖ్యలను రెండు ప్రముఖ డచ్ పత్రికలు పతాక శీర్షికలతో వేశాయి. భారత్ దీనిపై వివరణలు ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇరుదేశాల చర్చల్లో ఈ వ్యవహారం ప్రస్తావనకు రాలేదని మనదేశ దౌత్యవర్గాలు తర్వాత సర్దిచెప్పాయి. బాహాటంగా మీడియా ముందు మాట్లాడిన అంశాలు నాలుగు గోడల మధ్య సమావేశంలో చర్చకు వచ్చాయా? లేదా? అనేది అంత ముఖ్యం కాదు. పైగా తమను ప్రశ్నలు అడిగిన పాత్రికేయుల పట్ల అవమానకరంగా మాట్లాడటం బాధ్యతాయుతం అనిపించుకోదు. మీడియాలో జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత చేతులు కాలిన తర్వాత ఎంతగా ఆకులు పట్టుకుంటే ఏం లాభం? సమ్మిళిత సమాజమైన భారత్లో అందరికీ సమాన హక్కులు లభించాల్సిన అవసరం గురించి ఆతిథేయ దేశ ప్రధాని మన దేశ ప్రధానికి గుర్తుచేయటం ఆలోచించాల్సిన విషయమే.
ప్రస్తుతం రెండు దేశాల సంబంధాలు వ్యూహాత్మక స్థాయికి చేరుకున్నాయనే ప్రకటనలు వెలువడుతున్న నేపథ్యంలో పొరపొచ్చాలు ముందుకు రావటం గమనార్హం. ఇవి కేవలం మనదేశ పరిస్థితులపై విమర్శలకే పరిమితం కాదు. పౌరస్వేచ్ఛలకు, హక్కులకు సర్వోన్నత ప్రాముఖ్యమిచ్చే శాంతికాముక దేశాలుగా పేరుపొందిన స్కాండినేవియా దేశాల్లో నెదర్లాండ్స్ ఒకటి. ప్రపంచ అభివృద్ధి సూచీలో ఎప్పుడూ అగ్రస్థానంలో నిలిచే నెదర్లాండ్స్ కుటుంబ వ్యవహారాల్లో, ముఖ్యంగా పిల్లల సంరక్షణ అంశాల్లో పటిష్టమైన చట్టాలను కలిగి ఉన్నది. ఈ నేపథ్యంలో 2016లో చిన్నారి ఇన్సియాను ఆమె తండ్రి నెదర్లాండ్స్ నుంచి అక్రమంగా జర్మనీ మీదుగా ఇండియాకు ఎత్తుకు రావటం రెండు దేశాల మధ్య గడ్డు సమస్యగా మారింది. పదేండ్లు గడిచినా దౌత్యపరంగా ఇదొక కొరకరాని కొయ్యగా మిగిలిపోవటం విచారకరం. పత్రికా స్వేచ్ఛ సూచీలో 180 దేశాల్లో భారత్ 157వ స్థానంలో ఉంటే, నార్వే తర్వాత నెదర్లాండ్స్ రెండోస్థానంలో ఉన్నది. అలాంటిచోట మీడియా నుంచి ఇబ్బందికరమైన ప్రశ్నలు ఎదురైతే నిందలు వేసి తప్పించుకోజూడటం దౌత్యపరిణతి అనిపించుకోదు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా మోదీ నార్వే కూడా వెళ్లారు. అక్కడి ప్రధానితో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పకుండా వెళ్లిపోవటం కొట్టొచ్చినట్టు కనిపించింది. ‘ప్రపంచంలోని స్వేచ్ఛాయుత మీడియా వేసే ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి మోదీ’ అని ఓ జర్నలిస్ట్ అడగటం విశేషం సమాధానమిస్తే ఆయన మోదీ ఎందుకు అవుతారు?