భూతాపం కారణంగా రుతుపవనాలు అస్తవ్యస్తంగా మారుతున్నాయి. ఎప్పుడు వస్తాయో, ఎలా మారుతాయో చెప్పలేని అస్థిరతలను కలిగి ఉంటున్నాయి. పదేండ్లపాటు సాగిన ఇండో-జర్మన్ నిపుణుల అధ్యయనం ఇదే విషయాన్ని స్పష్టంచేసింది. రుతుపవనాల రాక, ప్రభావం గురించి అంచనా వేయగలిగితే తగిన జాగ్రత్తలు పాటించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వాలు, అధికారులు, ప్రజలు, రైతులు సన్నద్ధంగా ఉంటారు. కానీ ఎప్పుడు ఎలా వస్తాయో తెలియకుండా ముందస్తుగా అంచనా వేయడానికి వీలు లేకుండా రుతుపవనాలు ముంచుకొస్తున్నాయి. ఇదంతటికీ కారణం భూతాపం అని అధ్యయనంలో నిపుణులు స్పష్టంచేశారు. కాబట్టి రుతుపవనాల ఆరంభం, ముగింపు పట్ల ఉన్న అభిప్రాయాలను మార్చుకోవాల్సిన అవసరమున్నది. ప్రస్తుతం ఎల్ నినో కరువు పరిస్థితులు పొంచి ఉన్న నేపథ్యంలో అప్రమత్తత చాలా అవసరం.
వాతావరణ అధ్యయనంలో సాధారణంగా రెండు ప్రధానమైన అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఒకటి అధిక వర్షాలు కురిసిన రోజుల సంఖ్య, రెండోది అధిక ఎండలు ఉన్న రోజుల సంఖ్య. ఇవే రెండు అంశాల ప్రాతిపదికన జరిగిన ఇండో-జర్మన్ అధ్యయనంలో నిపుణులు ఆసక్తికరమైన అంశాలను గుర్తించారు. రోజుకు 80 మిల్లీ మీటర్లకు పైగా కురిసే అత్యంత భారీ వర్షాలు ప్రస్తుతం రెండేండ్లకు ఓసారి కురుస్తున్నాయని అధ్యయనంలో తేలింది. కర్బన ఉద్గారాలు ఎలా ఉన్నప్పటికీ ఇలాంటి భారీ వర్షాలు 2050 నాటికి 60 శాతం వరకు పెరిగే అవకాశం ఉన్నదని వెల్లడయింది. ఇలాంటిది భారీ వర్షాలే వరదలకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. అదే విధంగా అత్యంత ఉష్ణోగ్రతలు కలిగిన రోజుల సంఖ్య కూడా గణనీయంగా పెరగనున్నది. ప్రజల ఆరోగ్యాలపై ఎండలు ప్రతికూల ప్రభావం చూపుతా యి. ప్రమాదాలు జరగడం, కార్మికుల పనితీరు తగ్గిపోవడం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న సగటు తో పోల్చితే కర్బన ఉద్గారాల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ 2050 నాటికి ఏడాదిలో 20 రోజులు, 2100 నాటికి 40 రోజులు తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నదని అధ్యయనం హెచ్చరిస్తున్నది.
మరోవైపు ఈ ఏడాది ఎల్నినో పరిస్థితులు ఏర్పడుతున్నట్టు ఇప్పటికే స్పష్టమవుతున్నది. భూమధ్యరేఖ వద్ద పసిఫిక్ మహాసముద్రం వేగంగా వేడెక్కడం వల్ల రుతుపవనాల వ్యవస్థ బలహీనపడుతున్నది. మరోవైపు హిందూ మహాసముద్రంలోని తూర్పు, పడమర ఉష్ణధ్రువాలు తటస్థ దశలో ఉండటంతో రుతుపవనాలకు అదనపు తేమ అందించే పరిస్థితి కనిపించడంలేదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రుతుపవనాల ప్రవేశం ఆలస్యమైంది. దీంతో ఎల్ నినో ఏర్పడనున్నట్టు తెలుస్తున్నది. తెలంగాణపై ఎల్ నినో తీవ్రమైన ప్రభావాలను చూపే అవకాశం ఉన్నది. ఇది కరువు పరిస్థితులను తీవ్రం చేయడంతోపాటు వ్యవసాయంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇండో-జర్మన్ అధ్యయనంతోపాటు, భారత వాతావరణ విభాగం అంచనాలను గమనిస్తే ఇటీవలి సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత స్థాయిలో అత్యంత సవాళ్లు ఎదురుకానున్నాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు నాలుగు రోజులు ఆలస్యంగా జూన్ 8, 9 తేదీలలో జోగుళాంబ గద్వాల జిల్లా మీదుగా తెలంగాణలోకి ప్రవేశించాయి. కానీ ఇవి బలహీనంగానే ఉన్నాయి. జూన్, జూలైలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఎల్నినో ప్రభావం బలపడి, వర్షపాతం భారీగా తగ్గిపోతుందని తెలుస్తున్నది.
ఎల్ నినో ప్రభావం తెలంగాణలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలపై అధికంగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. హైదరాబాద్ సహా మధ్య తెలంగాణ ప్రాంతంలో మాత్రమే సగటు వర్షపాతం నమోదయ్యే పరిస్థితులు నెలకొన్నాయని అంటున్నారు. అలాగే, వర్షాలు స్థిరంగా పడకుండా తక్కువ సమయంలో భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసి, ఆ తర్వాత వారాల తరబడి ఎండలు కొనసాగే పరిస్థితి ఏర్పడవచ్చు.
సాధారణంగా రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత ఎండలు తగ్గుతాయి. కానీ ఈ సారి ఎల్ నినో ప్రభావం వల్ల రుతుపవనాల ప్రవేశం తర్వాత కూడా చాలా ప్రాంతాల్లో వడగాలులు, అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. ఇది ప్రజారోగ్యంతోపాటు వ్యవసాయ కార్యకలాపాలపై కూడా ప్రభావం చూపే ప్రమాదం ఉన్నది. సాధారణంగా ఎగువ రాష్ర్టాల నుంచి కృష్ణా, గోదావరి నదుల్లోకి వచ్చే వరదపై తెలంగాణ నీటి అవసరాలు ఆధారపడి ఉంటాయి. కానీ కర్నాటక, మహారాష్ట్రల్లో కూడా కరువు పరిస్థితులే నెలకొనడంతో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లోకి నీటి ప్రవాహాలు నిలిచిపోవడం, తగ్గిపోవడం వంటివి జరుగుతాయి. ఫలితంగా తెలంగాణలో నీటి ఎద్దడి సమస్య ఎదురవుతుంది. పట్టణాలు, నగరాలకు తాగునీటి సరఫరాకు కూడా కటకట తప్పదు. మరోవైపు ఎల్ నినో పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం కరువు హెచ్చరికలను జారీ చేసింది.
అధిక నీరు అవసరమయ్యే వరి సాగును తగ్గించుకోవాలని రైతులకు సూచించింది. కాలువల ద్వారా సాగు నీరు అందే ప్రాంతాల్లో మాత్రమే వరి వేయాలని చెప్పింది. తక్కువ కాలంలో, తక్కువ నీరు అవసరమయ్యే, కరువును తట్టుకొనే పప్పు ధాన్యాలు, నూనె గింజలు, సోయాబీన్, పత్తి వంటి పంటల సాగు వైపు రైతులు మళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.
ఎల్నినో ప్రభావం వానకాలం పంటలపైనే కాదు, యాసంగి సాగుపై కూడా ప్రభావం చూపే అవకాశమున్నది. వర్షాకాలం ముగిసే సమయానికి జలాశయాల్లో నీటిని నిల్వలు తగ్గిపోతే చలికాలం నాటికి పంటలకు అవసరమయ్యే నీటి సమకూర్చడం కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో కరువును ఎదుర్కోవడంలో కాళేశ్వరం ప్రాజెక్టు కీలక పాత్ర పోషించగలదని నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. గోదావరి జలాలను జలాశయాలు, చెరువుల్లోకి తరలించడం ద్వారా వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన సంవత్సరాల్లో సాగు, తాగునీటి అవసరాలు తీర్చేలా కాళేశ్వరం ప్రాజెక్టును రూపొందించారు. కానీ మరమ్మతుల ఆలస్యం కారణంగా ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యాన్ని ప్రభుత్వం వినియోగించలేకపోతున్నది. ప్రస్తుతం తెలంగాణపై ఎల్ నినో కరువు కోరలు చాచిన నేపథ్యంలో కాళేశ్వరం మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, వ్యవసాయరంగానికి భరోసా కల్పించాల్సిన అవసరమున్నది.
మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా భవిష్యత్తులో వర్షాలను అంచనా వేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ముందస్తుగా తీసుకోవాల్సిన సరైన జాగ్రత్తలపై కూడా స్పష్టత ఉండదు. గ్రామాల్లో రైతులు ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి, పట్టణ ప్రాంతాల్లోని పరిశ్రమలు, సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది అంతుపట్టదు. అంతుపట్టని వాతావరణం, కరువు పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలి. రైతులకు సరైన సమయంలో సూచనలు అందించాలి. సాగునీటి నిర్వహణ, పెట్టుబడి సాయం పథకాలను సక్రమంగా అమలు చేయాలి. పంట కొనుగోలు విధానాలు, ఆహారభద్రత పథకాలను మెరుగుపర్చాలి. ఇవే వ్యవసాయరంగ భవిష్యత్తును నిర్ణయించే కీలక అంశాలుగా మారనున్నాయి.