టేబుల్‌పై కొత్త పుస్తకం!
నేనింకా చదువలేదు!
కానీ కిటికిలోంచి ఆసక్తిగా గాలి వచ్చి
పేజీలు పేజీలుగా
గట్టిగా రెపరెపల శబ్దంతో
మొత్తం పుస్తకాన్ని ఎన్ని సార్లో
చదివి వెళ్లిపోయింది
గాలి ఎంత తొందరగా చదివేసిందో
గాలి చదువుడంటే మాటలా!
తిరగేయటమే తిరగేయటమే
నేను మెల్లమెల్లగా చదవాలి
గాలి చదువుడు కాదు నాది
గాలికేం ఇలా చదివింది
అలా వెళ్లింది
ఏం చదివావని గాలిని ఎవరు అడుగుతారు!!
నాది గాలి చదువుడు కాదు
మెల్లిగా చదవాలి
ఎవరైనా అడిగితే పుస్తకాన్ని
విశేషంగా చెప్పాలి!
చదువుతుంటే చదువుతుంటే
ప్రతి పేజీలో రచయిత హృదయం
చప్పుడుగా వినిపిస్తోంది నాకు!!
ఎవరైనా పుస్తకాన్ని గాలి గాలిగా
చదువొద్దు సుమా!
ఒకటికి రెండుసార్లు చదవాలి
పుస్తకం మన మస్తకం కావాలి కదా!
– కందాళై రాఘవాచార్య 87905 93638