Gaddar | ఆధునిక తెలుగు సాహిత్యంలో గద్దర్ ఒక ప్రత్యేకమైన పాటల అధ్యాయం. కాలం కనీవినీ ఎరుగని ప్రజావిముక్తి గీతం. ఐదు దశాబ్దాల సామాజిక, రాజకీయ పోరాటాల గమనానికి గద్దర్ తన పాటలతో బాటలు వేశాడు. వర్గ, కుల, లింగ వివక్షల సంకెళ్లలో బందీలైన పీడిత ప్రజావాణికి మైక్ అమర్చి నింగి చెవులు మార్మోగేలా స్వేచ్ఛాగీతాలు ఆలపించాడు. భంగపడ్డ తెలంగాణ జాతి బాధలను కలమెత్తి, గళమెత్తి చాటిచెప్పాడు. అసాధారణమైన ప్రజా వాగ్గేయకారునిగా భారతదేశంలో ప్రఖ్యాతిగాంచాడు.
‘గద్దర్ లాంటి కళాకారుల సంస్కృతీ ప్రదర్శన వల్లనే విప్లవం పట్ల నాకు న్న నమ్మకం నానాటికీ బలపడుతున్నది’ (ప్ర.జ.) అన్న శ్రీశ్రీ మాటల్లో గద్దర్ పాట ఔన్నత్యం తేటతెల్లమవుతుంది. ‘అడవిలో ఎన్నెలమ్మ ఆకును ముద్దాడినట్టు’గా గద్దర్ గొంతును పాటమ్మ ముద్దాడింది. తల్లి లచ్చుమమ్మ ఆలపించే పల్లెపదాలు, తండ్రి శేష య్య బోధించే వేమన, కబీర్, మరాఠీ కవుల తత్వాలు, ఊరిలో వినిపించే జానపద గీతా లు, ఒగ్గు కథలు, బుర్ర కథలు, పాఠశాలలో ప్రదర్శించే ఏకపాత్రాభినయాలు.. వీటన్నిటి ఉమ్మడి ప్రేరణలోనుంచి గద్దర్ గాయకుడిగా తొలి అడుగులు వేశాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆయనలో తెలంగాణ ఉద్యమోత్తేజాన్ని రగిలించింది. అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్రలను బుర్రకథలుగా చెప్తూ కళాకారుడిగా ఎదుగుతున్న గద్దర్లో ఆర్ట్ లవర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, మిత్రులు సాంస్కృతిక విప్లవ సోయిని, సామ్యవాద సృజన స్ఫూర్తిని కలిగించారు. ‘అది వెయ్యికాళ్ల జెర్రి బిడ్డా! అటు వెళ్లొద్దు, మనది కాని యుద్ధంలో మనమెందుకు పోరాడాలి. నువ్వెక్కిన పడవ ఎక్కడో మునిగిపోతుంది, లేదా ముంచుతా రు’ అని తన సోదరి ఎంత నచ్చజెప్పినా వినకుండా, బ్యాంక్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి పాట ల నిధిగా గద్దర్ ఉద్యమానికి అంకితమయ్యా డు. విరసం ప్రభావంతో ‘నా ప్రాణం నువ్వే పాటమ్మా/పోరు బాటవు నువ్వేపాటమ్మా’ అంటూ జననాట్య మండలి జాడలో జనం గుండె చప్పుడుగా గానగర్జన చేశాడు.
‘ప్రజల గుండెల కొండల్లో మాటు కాసి/ ట్రిగ్గర్ నొక్క కలిగినవాడే ద్రష్ట/ ప్రజల్ని సాయుధం చేస్తున్న రెవల్యూషనరీ నేటి కవి’ అని శివసాగర్ విప్లవ ఎరుకతో కవిని పుననిర్వచించాడు. ఈ నిర్వచనానికి నిలువెత్తు నిదర్శనంగా గద్దర్ తెలుగు సాహిత్యంలోకి దూసుకు వచ్చాడు. ప్రజా కళారూపాలను అధ్యయనం చేసి, తదనుగుణంగా ప్రజల సమస్యలను ప్రజ ల బాణిలోనే, వారి భాషలోనే పాటగా మలిచే నైపుణ్యాన్ని గద్దర్ అందిపుచ్చుకున్నాడు.
‘రిక్షా తొక్కే రహీమన్న, రాళ్ళు గొట్టే రామన్న, హమాలి కొమ్రన్నల’ వం టి పీడిత జనుల మూకీ బాష్పాలను, శ్రమతత్వాన్ని కలంలోకి బట్వాడా చేసుకొని, గళంలోకి ఒంపుకొని, పాటలల్లి వారిని విప్లవోన్ముఖంగా కదిలించాడు. ‘దుక్కులు దున్నే నాగలి ఈ దుక్కులు నావంటున్నది, కోతలు కోసే కొడవలి ఈ పంటలు నావంటున్నది’ అంటూ కష్టజీవులకే శ్రమఫలితం దక్కాలనే సామ్యవాద వాస్తవికతను గద్దర్ సముచితంగా పాటబద్ధం చేశాడు. ‘దళిత పులులమ్మా’ అనే పాటతో అంటరాని ప్రజల్లో తిరుగుబాటు తత్వాన్ని నూరిపోశాడు.
ఒక పాట రాసే క్రమంలో ఆయా సంఘటనల పూర్వాపరాలను పరిశోధించి, వివిధ వర్గాల శ్రామికుల పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించి, ఈ అనుభవం ప్రాతిపదికగా సృజన చేయడం వల్ల గద్దర్ పాటల్లో సహజత్వంతో పాటు ప్రామాణికత ఉట్టిపడుతుంది. తల్లిరక్తం బిడ్డలో ప్రవహించినంత సహజంగా తెలంగాణ తత్వం గద్దర్ పాటల్లో ఆద్యంతం పరిమళిస్తుంది. మలిదశ తెలంగాణ పోరాటానికి గద్దర్ పాటలు ఎంతో ఉత్తేజాన్ని అందించాయి. ‘అమ్మా తెలంగాణ మా ఆకలి కేకల గానమా’ అనే గీతంలో తెలంగాణ భౌగోళిక, చారిత్రక, సాంస్కృతి క, ఆధ్యాత్మిక వైభవ ప్రాభవాలను గద్దర్ అద్భుతంగా కవిత్వీకరించాడు. ‘ఎడ్డోల్ల మట్టి చిప్పవు/ గాయిదోల్ల గండ్ర గొడ్డలిని’ అంటూ దళిత, బహుజనుల అస్తిత్వం కేంద్రంగా తెలంగాణను ఔచితీమంతంగా అభివర్ణించాడు. విశిష్టమైన ఈ రెండు సంబోధనల్లో అణగారినవర్గాల శ్రమతత్వాన్ని, వారిలోని ప్రతిఘటనాత్మక వైఖరిని గద్దర్ ప్రతీకాత్మకంగా ప్రస్తుతించాడు.
బాల్యంలో తల్లి, తర్వాత సోదరి, నిశ్శబ్ద విప్లవంలా నిరంతరం తోడు ఉన్న సహచరి విమల, ఈ ముగ్గురి ప్రభావం వల్ల స్త్రీ వ్యక్తిత్వాన్ని, త్యాగనిరతిని, శ్రమతత్వాన్ని గద్దర్ సమున్నతంగా అర్థం చేసుకున్నాడు. గద్దర్ పాటల్లో స్త్రీలపట్ల అపారమైన గౌరవ మర్యాదలు దర్శనమిస్తాయి. ‘నిండూ అమాస నాడు’, ‘తెచ్చీపెడితే తిని కూర్చుంటవ్/తిన్నది అరగక పంటానంటవ్’, ‘మల్లెతీగకు పందిరి వోలె’ లాంటి పాటల ద్వారా గద్దర్ పితృస్వామ్యంపై ప్రశ్నల మ్యానిఫెస్టో సంధించాడు. ‘అడుగడుగో అడుగో చూడు అమెరికోడొస్తుండు’ అంటూ సామ్రాజ్యవాదం గురించి హెచ్చరించాడు. ‘పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే’, ‘వరిసేలు అడిగినాయి నీరుదాపే రైతేడని’ లాంటి పాటలు గద్దర్ రచనా శిల్పానికి తార్కాణంగా నిలుస్తాయి. ప్రకృతి, అడవి, విరులు, తరువులు ఇత్యాది పచ్చని ప్రతీకలతో సాగే గద్దర్ పాటల్లో పర్యావరణ స్పృహ కనిపిస్తుంది. అమరవీరుల యాదిలో గద్దర్ ఆలపిస్తే కాలం కూడా కన్నీరుమున్నీరుగా విలపించింది.
మనిషి లాగానే ‘ఇంటిలోని చీపురుకు, చెప్పునకు కూడా ఒక సామాజిక విలువ ఉం టుందని’ ఆయన తన పాటల ద్వారా ఉదాత్తంగా నిరూపించాడు. ‘చక్కనైన బొమ్మ మా ఇంటిలున్నదమ్మ’ అనే పాటలో చీపురు కట్ట సమకూర్చే మేలును విశ్లేషించాడు. ‘ఎంత చక్కగా ఉన్నది చెత్తకుండి’ అనే పాటలో అనాథలకు, పశుపక్ష్యాదులకు ఆకలితీర్చి, మొలిచే మొక్కకు సత్తువనిస్తుందని, పంటసేలకు ఎరువునిస్తుందని, పరమాన్నం వొండి పెడుతుందని’ చెత్తకుండీ ప్రయోజనాలను గద్దర్ అద్భుతంగా అక్షరబద్ధం చేశాడు. ‘గూటం దెబ్బతోని నాదు గుండెనంతా చితక కొట్టి/ మనిషి కాళ్ళ సైజు కొరకు మనసునంత కోసి కోసి/ ఏసు ప్రభువును శిలువ వేసి/ మేకులు దిగ గొట్టినట్టు నావొంటి మీద కదలకుండా మొలమీద మొలగొట్టి’ (కిర్రుకిర్రు చెప్పునోయమ్మ) అంటూ పాదరక్షలు రూపుదిద్దుకొనే పని విధానాన్ని, తదనుగుణమైన మాదిగల కళాకౌశలా న్ని గద్దర్ అపురూపంగా పాటగట్టాడు. కోడిపెట్ట, ఉల్లిగడ్డ, గాలిపంక, కల్లుముంత లాంటి అరుదైన వస్తువులను స్వీకరించి, వాటిని మహోన్నతంగా మానవీకరించాడు.
వజ్రానికి అనేక ముఖాలున్నట్టు, ఏకకాలంలో గద్దర్లో అనేక అరుదైన కళాప్రతిభా పార్శ్వాలు కనిపిస్తాయి. పాట సృజన, బాణీ, గానం, నృత్యాభినయం సమ్మిళితమైన కళాసాధనా సంపత్తితో గద్దర్ సాంస్కృతిక ప్రదర్శన ఆబాలగోపాలానికి అత్యం త ప్రీతిపాత్రమైం ది. గోసి, గొంగడితోకూడిన ఆకర్షణీయమైన వేషధారణతో, ఎర్రజెండా చుట్టిన కర్రతో విప్లవరుషిలా గద్దర్ పాడుతూ, ఆడుతుంటే ఆయన తల మీద ముంగురులు కూడా ముచ్చటపడి గానానుకూలంగా నృత్యం చేస్తాయి.
సింహ కంఠనాదంతో, అగ్నిగానంతో గద్దర్ వేలాది సభావేదికలను చైతన్యభరితం చేశాడు. ప్రజా వాగ్గేయకారుల పాట, మాట, ఆట ఎంత ప్రభావశీలంగా ఉండాలో గద్దర్ తన కళా కార్యాచరణ ద్వారా మిగతావారికి మార్గదర్శనం చేశాడు. వేమన ఆటవెలదిలోని మూడోపాదం లాగా గద్దర్ పాటలోని ప్రతి చరణంలో చమత్కార బంధురమైన ‘పంచ్’ అందరినీ ఆలోచింపజేస్తుంది. గ్రామీణ ప్రజల నిత్య వ్యవహారంలో జాలువారే తెలంగాణ జీవభాషతో గద్దర్ తన పాటలకు కొత్త సొబగులు దిద్దుకున్నాడు. ఎర్రమందారంలా విరబూసిన గద్దర్ పాట, పరిణామక్రమంలో తీరొక్క పూలతో బతుకమ్మలాగా పరిమళించింది.
ప్రారంభదశలో సాయుధ పోరాట స్ఫూర్తి తో ‘పోరు తప్ప దారి లేదని’ తెగేసి చెప్పిన గద్దర్, అంతిమదశలో ఆత్మగౌరవ పోరాటాల ఎరుకతో భారత రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్య రాస్త్తాలోకి నడచివచ్చాడు. ‘ఏడుతరాల త్యాగాల జ్ఞానయుద్ధాల గ్రంథం, మానవ జాతి విముక్తిగీతం’ అంటూ రాజ్యాం గ విలువల ఆచరణ ఆవశ్యకతను విశదపరిచాడు. ఈ రకమైన గుణాత్మక పరివర్తనతోనే ‘బాబాసాహెబ్ బాటరా.. భావితరాల బాటరా! అని గద్దర్ నిర్ధారించాడు. దం డకారణ్యాన్ని మండించిన ‘ప్రజాయుద్ధ నౌక’ గద్దర్ చివరికి ధమ్మపథంలో సేదతీరాడు.
‘మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో? పగిలిపోయిన డప్పుపై దరువులెవరు వేసేదరో? ఆ తెగిపోయిన వీణతీగలకు నరాలెవరు అల్లెదరో’ అని కాలం కోటి ఆశలతో ఎదురు చూస్తున్నది.
‘పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా! పోరు తెలంగాణమా’, ‘గోదావరి అలలమీద కోటి కలల గానమా/ కృష్ణమ్మ పరుగులకు నురుగుల హారమా’ అంటూ మహోన్నతమైన తెలంగాణ ఉద్యమ ఉధృతిని శిల్పశోభితంగా చిత్రించాడు. ‘మర్లబడ్డ గానమా’, ‘తిరగబడ్డ రాగమా’, ‘కత్తుల కోలాటమా’, ‘పువ్వులు పుప్పొడిలా పవిత్ర బంధమా’, ‘పరమాత్ముని రూపమా’ లాంటి అపురూపమైన సంబోధనలతో అభివ్యక్తి సుందరంగా తెలంగాణ పోరు తత్వానికి గద్దర్ కొత్త భాష్యం చెప్పాడు. తెలంగాణపై జరిగిన వనరుల దోపిడిని తీవ్రంగా ఎండగట్టాడు.