సాహిత్యంలో ప్రతి ప్రక్రియ ముఖ్యమైనదే. ఏ ప్రక్రియ అయినా సాహితీ విలువలతో సమాజాన్ని, ప్రపంచాన్ని దర్శింపజేస్తూ జీవితాన్ని పరిచయం చేయడం, జీవితాన్ని అనుభవించడంలోని ఎరుకను, మార్మికతను అందజేయగలిగేదిగా ఉండాలి. ప్రతి సాహితీ ప్రక్రియకు వాటి నిర్దేశిత లక్షణాలు, లక్ష్యాలు ఉంటాయి. అయినా కాలంతోపాటు ప్రతి వ్యవస్థ పరిణామ వికాసాల చట్రంలో ఇమిడి, మార్పులకు లోనవుతూ ఉంటుంది. ఆధునిక సాంకేతికత, పరిశ్రమల ప్రగతి, ప్రపంచ అగ్రదేశాల ఆధిపత్య ధోరణి, స్వార్థపూరితమైన వ్యాపారాత్మకత, రాజకీయ, ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లో పెత్తనాలపై ఉండే కాంక్ష, సంస్కృతి, సంప్రదాయాల్లో విపరీత పోకడలు ఇవన్నీ మూకుమ్మడిగా మానవ సమాజంపై తీవ్ర ప్రభావం చూపాయి. ప్రకృతి, పర్యావరణ రంగాల్లో అసమతుల్యత, సంక్షోభాలు కూడా వీటితో జతకూడాయి.
జపాన్ సాహిత్యంలో హైకూ ఒక విలక్షణ పద్యరూపంగా గుర్తింపు పొందింది. 500 ఏండ్లకుపైగా జపానీయ కవులు హైకూను సృష్టిస్తున్నారు. హైకూ మౌలికంగా సౌందర్యాశ్రయి. సౌందర్యాన్ని ఉద్దేశించడమంటే హైకూ కవి అనుభవంలోకి రాగలిగే వస్తువు గుణాన్ని ఉద్దేశించడం. దర్శించగలిగిన సౌందర్యం, వస్తువు ద్వారా అనుభవంలోకి వచ్చినపుడు, వస్తు గుణ సౌందర్యాన్ని వైయుక్తికంగా గుర్తించినప్పుడు కలిగిన లేదా అనుభూతి చెందిన అద్భుతమైన లిప్తకాలాన్ని ‘హైకూ సమయం’గా భావిస్తారు.
అంటే, సౌందర్యానుభవం తర్వాత జీవించి ఉండే రమ్యత్వం గల సమయం. ఎప్పుడైతే మనం ప్రకృతి ముందు స్వేచ్ఛగా, భయరహితంగా, నిజాయితీగా, వినమ్రతతో ఉంటామో, ప్రకృతితో విడదీయరాని బంధాన్ని ఏర్పరచుకొని ఒకటిగా మమేకమైపోతామో, మనకు తోచిన కాల్పనిక ఊహల్ని ప్రకృతిలోకి ప్రవేశపెట్టమో..అప్పుడు మనకు ‘హైకూ ధోరణి’ ఏర్పడడానికి మార్గం సుగమమవుతుంది. ప్రకృతి, ప్రశాంతత, బాల్యంలోని అమాయకత్వం, ధ్యానం, ఇత్యాది అంశాలతో సాగే హైకూ సమకాలీన సందర్భంలో విపరీతమైన మానవ చర్యల వల్ల కూలిపోతున్న అనేక వ్యవస్థలతో పాటు ప్రకృతి, పర్యావరణం కూడా దెబ్బతింటున్నాయి.
‘మసవో కుమె’. ఆయన ‘సంతేయి’ అనే కలం పేరు గల ప్రసిద్ధ నవలా రచయిత. అయినా హైకూకు జపాన్ సాహితీ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని ఆపాదించి ‘వాడిపోని పువ్వు’ అని వ్యాఖ్యానించారు. ఆధునిక సమాజం సాంప్రదాయ కవిత్వం పేరుతో వాతావరణ సంక్షోభాలపై చిన్నచూపు చూడడం ఒక సామూహిక తప్పిదమని అంటారు ప్రసిద్ధ భారతీయ బెంగాలీ-ఆంగ్ల రచయిత అమితాబ్ ఘోష్. వాతావరణ కాలుష్యం భవిష్యత్తులో చూపే పరిణామాలను ఊహించలేకపోవడం, వాటి తీవ్రత, ఉపద్రవాలపై అవగాహన లేకపోవడం విచారించదగిన విషయం. ఈ విషయంలో ఆంగ్ల కవులు వాతావరణ మార్పులను రికార్డు చేయడంలో హైకూ ఒక శక్తివంతమైన సాధనంగా గుర్తించడంలో ముందున్నారని చెప్పవచ్చు. మానవ కేంద్రీకృత (ఆంథ్రోపోసెంట్రిక్) దృక్పథంతో రాసే హైకూకు సాంప్రదాయక లక్షణాలపై అంతగా దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. ఈ సందర్భంగా హైకూ పితామహుడు మత్సువో బషో ప్రసిద్ధ, అత్యంత ప్రజాదరణ పొందిన హైకూ ‘ఓల్డ్ పాండ్’ను, మోరిస్ సమకాలీన హైకూను పరిశీలిద్దాం.
మత్సువో బషో హైకూ:‘Old pond A frog jumps in, Sound of the water’ (పాత కోనేరు కప్పు దుమికింది
నీళ్ల చప్పుడు’–అనువాదం: ఇస్మాయిల్)
Kaea Morris హైకు:‘Ashes On the frog pond Wildfire moon’
‘బూడిద వాన కప్పల మడుగుపై- పొగ చూరిన చంద్రుడు’–స్వేచ్ఛానువాదం: రూప్‌కుమార్ డబ్బీకార్)
పై రెండు హైకూలకు ‘ఫ్రాగ్ పాండ్’ ప్రధాన కేంద్ర బిందువు. కానీ ఉద్దేశంలో తేడా ఉన్నది. బషో హైకూలో సంతానోత్పత్తి దశకు వచ్చిన కప్ప ఒకానొక నిశ్చలమైన సమయంలో నీటిని చెదురుమదురు చేస్తుంది. ‘Morris’ ‘Frog Pond’లో కప్పు చెరువులో నివసించడానికి రాలేదు అని చెప్పడానికి సంకేతాలు ఉన్నాయి. అడవులు తగలబడిపోవడం వలన ఎడతెరిపి లేకుండా ఉత్పన్నమైన బూడిద, మడుగు ఉపరితలంపై కప్పబడి ఉన్నది. బషో కవితలో మడుగు జీవచరాలతో నిండి అవి శ్వాసించడానికి అనువుగా ఉన్నది (బషో హైకూను కవులు భిన్న సందర్భాల్లో, భిన్నరీతుల్లో వ్యాఖ్యానించారు).
మోరిస్ కవితలో మడుగు నిశ్శబ్దంగా దావానలంలోని అగ్నికీలలతో నిండి ఉన్నది. బషో కవితలో సంప్రదాయ విలక్షణతో ‘ఆహ’ (ah) అనే స్వభావంతో మానవాళి వైపు చూస్తుంది. మోరిస్ కవితలో మనిషి చర్యల వలన ప్రకృతిపై పడే దుష్ప్రభావం ఫలితంగా వాటి విధ్వంసం కనబడుతుందని Jasmine Kirkbride అనే ఆంగ్ల రచయిత్రి అభిప్రాయపడుతున్నారు. ‘Wildfire moon’ అనే పదబంధం భారీ ప్రళయానికి సంకేతం, సాహిత్యపరంగా కావ్యరూపకాన్ని ప్రతిబింబిస్తుంది.
తెలుగులో పర్యావరణ కవిత్వం, కాలుష్య సమస్యలు, జీవవైవిధ్య పరిరక్షణ స్పృహతో రాసిన కవితలు చాలా తక్కువ. హైకూ కవిత్వంలో అరుదు. ఈ మధ్య పర్యావరణ స్పృహతో తెలుగులో వచన కవులు రచనలు చేస్తున్నారు. ఆంగ్ల కవులు తక్కువ పదాలతో పర్యావరణ సంక్షోభంపై విస్తృతమైన అవగాహన కలిగించడానికి హైకూను ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగిస్తున్నారు. ఫలితంగా ఆంగ్లంలో రాస్తున్న హైకూల్లో సమకాలీన వాతావరణ సంక్షోభం ప్రధాన వస్తువుగా తీసుకుంటున్నారు.
పర్యావరణానికి సంబంధించిన హైకూ రచనలు చేసేవారిని రెండు తరగతులుగా విభజించవచ్చు. ఒకటి సామాజిక స్పృహతో కేవలం వాతావరణ సమస్యలను దృష్టిలో పెట్టుకొని రచన చేసేవారు (ఇందులో శాస్త్రవేత్తలు, పరిశోధకులు వంటి మేధోవర్గం వస్తుంది). రెండవ వర్గంలో అసంకల్పితంగా సృజనాత్మకతతో రాసేవారు (పత్రికలకు రాసే జర్నలిస్టులు, సాధారణ ప్రజలు). మానవ చర్యల కారణంగా ప్రకృతి సిద్ధమైన ఆవాసాల విధ్వంసం జరుగడం, పురుగు మందుల వాడకం కారణంగా అనేక జీవరాశులు నశించిపోతాయి. 30, 40 ఏండ్లలో హైకూలో సీతాకోకలు ఒక ప్రధాన వస్తువుగా ఉండేవి. అలాంటి సీతాకోకల సంఖ్య కూడా తగ్గిపోతున్నదన్న విషయాన్ని పరిశోధనలు చెప్తున్నాయి.
గ్లోబల్ వార్మింగ్ ఫలితంగా అడవులు పలుచబడిపోవడం, జంతువుల సంఖ్య తగ్గి జీవవైవిధ్యంపై విపరీత ప్రభావం పడుతున్నది. అనేక కీటకాలు అధిక శాతంలో విలుప్తమయ్యాయి. Curlew (బలాకము, ఉల్లంకాయ పక్షి) అనే పక్షి అంతరించిపోయే దశలో ఉన్నదని UK 1990లో రెడ్‌లిస్ట్‌లో చేర్చిన ఏడేండ్ల తర్వాత అంటే 1997లో సామాజిక కార్యకర్త Caroline Gourley ఈ కింది హైకూను రాశారు:
Daylight fading
A Curlew’s cry
Lengthens hill
‘మసక చీకట్లు వాలుతున్నా Curlew పక్షి ధ్వనిని వినాలన్న కాంక్షతో కొండనెక్కే వాడి నడకను నెమ్మదించింది’ అనే భావన ఈ హైకూలో ఉన్నది. అలాంటి పక్షి పర్యావరణ కాలుష్యానికి గురై వాటి ఉనికి ప్రమాదంలో పడుతున్నదని మరో కవయిత్రి, విమర్శకురాలు జాస్మిన్ (Jasmine Kirkbride) తన రచనలో ఒకచోట ఆవేదనను వ్యక్తపరుస్తారు.
‘బషో’ ప్రకృతికి లొంగిపొండి’,
‘ప్రకృతికి మరలిపొండి’ అన్నాడు.
కానీ, మనిషి చర్యల వల్ల ప్రకృతి,
పర్యావరణం కలుషితమవుతున్న
సందర్భంలో హైకూ కూడా తన
సాంప్రదాయక స్వభావం నుంచి
పక్కకు జరిగి పర్యావరణ సంక్షోభాలను, జీవవైవిధ్య సమస్యలను వ్యక్తీకరించే సమయం, సందర్భం వచ్చిందని ఆంగ్ల హైకూ కవులు భావించడంలో ఔచిత్యం ఉన్నది.
పర్యావరణ స్థితిగతులు, భవిష్యత్ పరిణామాలను ప్రపంచానికి ఎరుకజేయడం కవి బాధ్యత. హైకూ వర్తమానంలో జీవించాలి అంటుంది. ఆధునిక సమకాలీన హైకూ వర్తమానంలో జీవిస్తూ భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకోవాలన్న ఆశయంతో కవులు హైకూలు సృష్టించాలని ఆశిస్తుంది. ఈ ప్రయత్నంలో ఋతువును సూచించే పదం ‘కిగో’ కూడా తన ఉద్దేశాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ నేపథ్యంలో హైకూ రూపంలో, భావంలో అద్భుతాల పునఃసృష్టి తెలుగు సాహిత్యంలో జరగాలి.
– డా. రూప్‌కుమార్ డబ్బీకార్ 9277857389