వేల ఏండ్ల క్రితమెప్పుడో!
అందమైన ఆకులతో
రంగురంగుల పూల పరిమళాలతో
భూమ్యాకాశాల సహజసంకేతమై
ఈ మట్టిలోంచి మొలకెత్తిన
పురాతన మహావృక్షం
ఎండావాన ఉరుముల్లో
సుడిగాలుల తుపానుల్లో
ఎముకలు కొరికే చలిలో
తన కొమ్మల్ని రక్షించుకునే
సహజ రక్షణకవచధారి
రకరకాల పక్షులకు గూడై
బాటసారులకీ చల్లని నీడై
ఆకలితో ఉన్నోళ్ళకు పండై
ప్రతిఫలం ఆశించని ప్రకృతి
ఈ భూమితో పెనవేసుకున్న పేగు బంధం
ఇప్పుడెవరో!
సూర్యుని మీద కాలుష్యం మబ్బుల్తో
కిరణజన్య సంయోగ క్రియను ఆపే
కుట్ర జరుపుతున్నట్టు
ఏదో నిశ్శబ్ద అలజడి
అకస్మాత్తుగా…
ఆకులన్నీ ఒక్కొక్కటిగా
రాలిపడుతున్న శబ్దం
కొమ్మలు పెళపెళమని
విరిగి కలవరపెడుతున్న
భయానక వాతావరణం
గూళ్లు వదల్లేని పక్షులు
రెక్కలల్లార్చుతూ..
ఎగిరిపోతున్న సమూహ దుఃఖం
ముఖాన ముసుగుల్తో
భుజాన అదృశ్యాయుధాలతో
వడివడిగా వస్తున్న ఆగంతకులు
మసకమసకగా కన్నీటి పొరల వెనుక
కన్పిస్తున్న దుఃఖ దృశ్యం
వృక్ష అస్తిత్వానికి ప్రమాద సంకేతంలా
కీచురాళ్ళ విషాదగానం
ఇక.. ఇప్పుడు
ఎడారులైన భూమి పొరల్లో
నీటి చెలిమెల్ని వెతుక్కుంటూ
విస్తరిస్తున్న వేర్లు
చిటారు కొమ్మల చిగుర్లని బతికించుకొని
పాపలకు పాలిచ్చే అమ్మలా
ప్రపంచానికి ప్రాణవాయువును
పంచుతున్న వృక్షమాత..
– డాక్టర్ బాణాల శ్రీనివాసరావు 94404 71423