వాస్తవ పరిస్థితులను క్రమంగా గ్రహిస్తున్న తెలంగాణ ప్రజల నుంచి, నరేంద్ర మోదీ పరిపాలన తీరుపై ప్రశ్నలు కొల్లలుగా వినవస్తున్నాయి. కానీ అందుకు ఆయన ప్రభుత్వం నుంచి గానీ, బీజేపీ స్థానిక నాయకుల నుంచి గాని ఒక్కటంటే ఒక్క సమాధానమైనా రావటం లేదు. ఈ ప్రశ్నలకు తాజా ఉదాహరణలు రెండింటిని చూడండి. ప్రజల సంక్షేమం కోసమైనా సరే ‘ఉచితాలు’ వద్దనే మోదీ ప్రభుత్వం సూపర్ ధనవంతులకు 20 లక్షల కోట్ల రుణాలు ఎందుకు మాఫీ చేసింది? అవే వర్గాలకు పన్నులు రద్దు చేస్తూ, ప్రజలు వాడే బియ్యం, గోధుమ, పాలు, పెరుగులపై పన్నులు కొత్తగా ఎందుకు వేస్తున్నది? తెలంగాణకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నలకు గత నెల ప్లీనరీలో ప్రధాని మోదీ ఒక్క జవాబైనా ఇవ్వనట్లు, ఈ ఆదివారం మునుగోడులో అమిత్ షా కూడా సమాధానం ఇవ్వలేకపోయారు ఎందుకు?
ఇవి ఎవరికైనా తట్టే సందేహాలు. ఇందులో రాజకీయం ఏమీ లేదు. రాజకీయ ప్రత్యర్థులు అడగనక్కరలేదు. పై రెండు ప్రశ్నల్లోని అంశాలు ప్రతి మనిషి జీవితానికి సంబంధించినవి. పేదలకు, మధ్య తరగతికి, ఇంకా ఆ పైవారికి కూడా. అందుకే గత కొన్ని వారాలుగా ఈ ప్రశ్నలు అందరి నుంచి వినవస్తున్నాయి. ఇవేకాదు, ఇంతే సూటిగా మరికొన్ని అంశాల గురించి కూడా. ఇవి రెండు తాజావి అయినందున వాటిగురించి మొదట చెప్పుకొంటున్నాము. సంక్షేమం, ఉచితాల మధ్య తేడా గురించి ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ బుధవారం నాడు చూపిన విజ్ఞత అయినా మోదీకి లేకపోయింది.
ఇతర విషయాల్లోకి వెళ్లేముందు ఈ రెండింటి గురించి కొద్దిగా చర్చించుకుందాము. ఈ రెండింటి వార్తలు మొదట ప్రతికల్లో వెలువడినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఇది నిజమేనా అనుకున్నారు. ఎందుకంటే, కొద్దిపాటి వివేకం ఉన్న ఏ ప్రభుత్వమైనా ఇటువంటి పనులు చేయదు, చేయకూడదు. ఇవి యావన్మంది ప్రజల నిత్య జీవితాలకు సంబంధించినవి. కానీ ఆ వార్తలు పదే పదే రావటంతో, ప్రభుత్వ పెద్దలు అందుకు సమర్థనగా సుప్రీంకోర్టులో బాహాటంగా అఫిడవిట్ దాఖలు చేయ టం, టీవీలలో వాదించటంతో ఇక అది నిజమని నమ్మక తప్పలేదు. మోదీ ప్రభుత్వపు నిజ స్వరూపం ఏమిటో అంతకు ముందునుంచే నెమ్మదిగా కనిపిస్తుండినప్పటికీ, తాజాగా ఈ రెండింటితో ఒక్కసారిగా బట్టబయలు అయినట్లయింది. ఎందుకంటే, అవి వారువీరని గాక ప్రజలందరి జీవితాలను అంతగా ప్రభావితం చేస్తాయి.
ముందుగా ‘ఉచితాల’ను, తర్వాత పన్నులను చూద్దాం. వాస్తవానికి ఈ రెండింటిపై ఇప్పటికే తగినంత చర్చ జరిగింది. కానీ, పైన అనుకున్నట్లు, వాటికి కేంద్ర ప్రభుత్వం నుంచి గాని, తెలంగాణ బీజేపీ నాయకత్వం నుంచి గాని ఎటువంటి సమాధానాలు నేటికీ రానందువల్ల ఈ చర్చను కొనసాగించవలసి వస్తున్నది. మోదీ ప్రభుత్వం ‘ఉచితాలు’ వద్దని, అందువల్ల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని వాదిస్తున్నది గాని, ‘ఉచితాలు’ అంటే ఏమిటో నేటికీ నిర్వచించి చెప్పటం లేదు. సంక్షేమం, ఉచితాల మధ్య తేడా గురించి ప్రధాన న్యాయమూర్తి రమణ బుధవారం వివరించిన మాత్రమైనా మాట్లాడటం లేదు. వర్ధమాన దేశాలలో ప్రజల వెనుకబాటుతనానికి ప్రధాన కారణం అభివృద్ధి సాధనలో ప్రభుత్వాల వైఫల్యాలు. ఇందులో బీజేపీ ప్రభుత్వాలు కూడా ఉన్నాయి.
అటు అభివృద్ధి గాని, ఇటు సంక్షేమ చర్యలు గాని సక్రమంగా లేక ఇండియాతో సహా అనేక దేశాలలో అశాంతి, అపుడపుడు ఉద్యమాలు, తిరుగుబాట్లు రావటం తెలిసిందే. దీనంతటికి కారణం బీజేపీతో పాటు వివిధ ప్రభుత్వాల వైఫల్యమని మళ్లీ చెప్పనక్కరలేదు. అటువంటపుడు, మోదీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి, సమర్థత ఉంటే, ప్రజలకు సంక్షేమ చర్యలు అవసరం ఉండని స్థాయికి సర్వతోముఖాభివృద్ధిని సాధించాలి.
ఈ వెనుకబాటుతనం వల్ల ప్రజలు రెండు పూటల తినగలగటం నుంచి ఒక మోస్తరుగా బతకటం వరకు పాలక వ్యవస్థ నుంచి సహాయం తప్పనిసరి అవసరం. లేనట్లయితే ఆ ప్రజలు ఇంకా నికృష్ట స్థాయిలోకి వెళ్లటం సరేసరి కాగా వారినుంచి తిరుగుబాట్లు వస్తాయి. ఈ మాటను సూటి గా, స్పష్టంగా ఆధునిక కాలంలో జర్మన్ పాలకుడు బిస్మా ర్క్ నుంచి ఇంగ్లాండ్ పారిశ్రామిక విప్లవకారుల వరకు చెప్పారు. ఈ అవసరాలు మాజీ వలస దేశాలలోనూ కొనసాగుతున్నాయి. ఒక మేరకు ధనిక దేశాలలోనూ ఉన్నా యి. కనుక సంక్షేమ వ్యవస్థలు అనేవాటిని దశాబ్దాలుగా కొనసాగిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి చెప్పే మానవాభివృద్ధి గాని, దాని సూచికలు గాని ఈ వ్యవస్థలపైనే ఆధారపడి ఉన్నాయి.
అటు అభివృద్ధి గాని, ఇటు సంక్షేమ చర్యలు గాని సక్రమంగా లేక ఇండియాతో సహా అనేక దేశాలలో అశాంతి, అపుడపుడు ఉద్యమాలు, తిరుగుబాట్లు రావటం తెలిసిందే. దీనంతటికి కారణం బీజేపీతో పాటు వివిధ ప్రభుత్వాల వైఫల్యమని మళ్లీ చెప్పనక్కరలేదు. అటువంటపుడు, మోదీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి, సమర్థత ఉంటే, ప్రజలకు సంక్షేమ చర్యలు అవసరం ఉండని స్థాయికి సర్వతోముఖాభివృద్ధిని సాధించాలి. ఉచితాలు, సబ్సిడీలు క్రమంగా రద్దుచేయాలంటూ ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ బోధనల మేరకు ఆర్థిక సంస్కరణల సిద్ధాంతకర్తలు, కొందరు పాలకులు ఇంతకాలం ప్రయత్నించి విఫలమై, తిరిగి సంక్షేమబాట పట్టారు. వాస్తవానికి మోదీ సహా బీజేపీ పాలకులు సైతం చేసిన పనే ఇది. ఇపుడు అకస్మాత్తుగా మోదీ ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా ఎందుకు మాట్లాడుతున్నది? ఇందుకు రెండే కారణాలు కన్పిస్తున్నాయి. తాము ప్రజలను మతం పేరిట రెచ్చగొట్టి అధికారం సంపాదించటానికి వివిధ ప్రతిపక్షాల సంక్షేమ విధానాలు అడ్డుగా నిలుస్తుండటం ఒకటి. సంక్షేమానికి కోత పెట్టడం వల్ల మిగిలే నిధులను తమవారైన భారీ పెట్టుబడిదారులకు అప్పగించవచ్చుననేది రెండు. ప్రజలు దీనిని నిరసించినా వారిని మతం పేర రెచ్చగొట్టి గెలవవచ్చునన్నది భరోసా.
ఇకపోతే, ఇదే భారీ పెట్టుబడిదారులకు లక్షల కోట్ల రుణాల మాఫీతో పాటు, వారిపై పన్నులు రద్దుచేస్తూ, మరొకవైపు ప్రజలంతా వాడే బియ్యం తదితర సరుకులపై కొత్తగా పన్నుల విధింపులో కనిపించేది కూడా ఇదే. ‘ప్రజలను అన్నివిధాలా పీడించు, ధనికులకు అన్నివిధాలా దోచిపెట్టు’ అన్నది మోదీ ప్రభుత్వపు విధానంగా మారిందని, మతం అనేది ఆయుధంగా ఉపయోగపడినంతకాలం ప్రజలను తప్పుదారి పట్టిస్తూనే ఉండవచ్చునన్న భరోసా ఆయనకు ఏర్పడిపోయిందని మనకు ఈ విధంగా అర్థమవుతున్నది.కనుక, మాయల ఫకీరు ప్రాణం ఏ చిలుకలో ఉందో గ్రహించవచ్చు.
ఇవి రెండూగాక, ధరలు, నిరుద్యోగం, ప్రైవేటీకరణలు, అభివృద్ధి రాహిత్యం, వివిధ సూచీలు అన్నింటిలో నానాటికి వెనుకబడుతుండటం, హామీలు నెరవేర్చకపోవటం, తెలంగాణ పట్ల తీవ్రమైన వివక్ష, రాష్ర్టాల హక్కులను హరించివేయటం వంటి ఇంకా అనేకమైన సూటి ప్రశ్నలకు కూడా మోదీ నుంచి ఈనాటికీ జవాబులు శూన్యం.
టంకశాల అశోక్