రుతు పవనాల ఆగమనంతో వేసవి తాపం మెల్లమెల్లగా చల్లారిపోతున్నది. కానీ, దేశవ్యాప్తంగా ఈసారి వేసవి సృష్టించిన కడగండ్లను మాత్రం అంత సులభంగా మరచిపోలేం. ఉష్ణతాపంతో పాటుగా నీటి ఎద్దడి విషయంలో చుక్కలు చూపించింది. దక్షిణాదిలో కర్ణాటక ఎదుర్కొన్న నీటి సమస్యలు దేశవ్యాప్తంగా చర్చాంశమయ్యాయి. ముఖ్యంగా రాజధాని బెంగళూరు నీటి కటకటతో విలవిలలాడటం చూశాం. నగరానికి 60 శాతం నీటిని సమకూర్చే కావేరీ బేసిన్‌కు వర్షాభావం వల్ల వరద తగ్గిపోవడమే ఇందుకు కారణం. ధగ ధగ వెలిగే ఐటీ నగరం నీటి కొరతతో వెల వెల పోవడం చూసి దేశమే నివ్వెరపోయింది.
దక్షిణాఫ్రికాలో నీటి కొరత కారణంగా నివాసయోగ్యత కోల్పోతున్న కేప్‌టౌన్ నగరంతో బెంగళూరుకు పోలికలు చెప్పుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టింది. అయితే నీటి సమస్య కేవలం కర్ణాటకకో, బెంగళూరుకో పరిమితం కాదు. చెన్నై, కోల్‌కతా నగరాల పరిస్థితి తెలిసిందే. సీజన్ ఆరంభంలో కొంత భయపెట్టినప్పటికీ హైదరాబాద్ పరిస్థితి మాత్రం చాలావరకు మెరుగ్గానే ఉంది. మండే కొలిమి లాంటి వేసవి ఎండలకు దేశ రాజధాని ఢిల్లీలో సైతం ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఇరుగు పొరుగు రాష్ర్టాలతో జల వివాదం ఓ అదనపు జోడింపు. ఢిల్లీ ప్రభుత్వం గత నెల యమునా నదీ జలాల కోసం సుప్రీంకోర్టు గడప తొక్కాల్సి వచ్చింది. 137 క్యూసెక్కుల నీటిని విడుదల చేయమని హిమాచల్‌ప్రదేశ్‌ను, నీటి తరలింపులో తోడ్పడమని హర్యానాను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించాల్సి రావడం గమనార్హం.
వర్షాభావానికి అంతర్రాష్ట్ర జల వివాదాలు అగ్నికి ఆజ్యంలా తోడవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తున్నది. ఇంకా అనేక అంశాలు నగరాల నీటి సమస్యలకు కారణమవుతున్నాయి. అందులో ముఖ్యమైనవి అడ్డూ అదుపూ లేని పట్టణీకరణ, అసమర్థ జల నిర్వహణ, భూగర్భ జలాల అతి వినియోగం, అడవుల నరికివేత, చాలీచాలని నీటి సరఫరా, మురుగునీటి శుద్ధి వ్యవస్థలు. అడవులు తగ్గిపోవడం వల్ల భూతాపం పెరిగిపోయి రుతువులు గతి తప్పుతున్నాయి. అతివృష్టి అనావృష్టి దాగుడు మూతలు ఆడుతున్నాయి. వానలు ఎక్కువగా కురిసినప్పుడు నీరు సముద్రంలోకి పోతుంది. తక్కువ వర్షపాతం నమోదైన పరిస్థితుల్లో ఎండలు మండితే ఉపరితల, భూగర్భ జలాలు ఇంకిపోయి నీటికి ఇక్కట్లు తప్పడం లేదు. ఇదంతా ఒక గొలుసుకట్టు చర్యలా లేదా విష వలయంలా తయారైంది.
ఈ సమస్యకు పైపై మెరుగుల పరిష్కారాలు పనిచేయవు. దీర్ఘకాలిక పరిష్కారం మాత్రమే సమస్య నుంచి బైటపడేస్తుంది. ఓం ప్రథమంగా చేయాల్సింది జలవనరుల లెక్కలు తేల్చి పట్టణీకరణ వాటిపై దురాక్రమణ జరుపకుండా చూడటం. ఆ తర్వాత చేయాల్సింది పదే పదే కొరతకు దారితీస్తున్న పరిస్థితులను చక్కదిద్దడం. నీటి ఉపరితల, భూగర్భ, నీటిపారుదల, తాగునీటి విభాగాల మధ్య అంతంతమాత్రంగా ఉన్న సమన్వయాన్ని పెంపొందించడం చాలా అవసరం. వివిధ రాష్ర్టాల మధ్య నీటి పంపిణీ సర్దుబాట్లకు నీటి కొరత ఏర్పడ్డప్పుడు తగాదాలకు దారితీస్తుంటాయి. వీటికి నికరమైన పరిష్కారం చూపడం కేంద్రం బాధ్యత. వర్షపు నీటిని ఒడిసిపట్టడం అనేది జాతీయస్థాయిలో చూస్తే కేవలం కాగితాలకే పరిమితం అని చెప్పాలి. సమస్య ఎదురైనప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉరుకులాడడం, ఆ తర్వాత చల్లబడిపోవడం మన దేశంలో సర్వసాధారణ విషయమైపోయింది. పైన తెలిపిన దీర్ఘకాలిక పరిష్కారాలు కేంద్ర, రాష్ర్టాల సమన్వయంతోనే ఒక కొలిక్కి వస్తాయని చెప్పక తప్పదు.