రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు దోపిడికి తెరలేపాయి. అడ్మిషన్ల పేరిట ఫీజుల మోత మోగిస్తున్నాయి. కొన్ని పాఠశాలల్లో అయితే ఇప్పటికే అడ్మిషన్లు పూర్తయినట్టు బోర్డులు వెలిశాయి. తమ పిల్లలకు ఆంగ్ల మీడియం చదువులు చెప్పించాలనుకునే తల్లిదండ్రులు ఫీజులను చూసి బెంబేలెత్తిపోతున్నారు. కొన్ని స్కూళ్లల్లో ఎల్కేజీ ఫీజులే సుమారు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఉండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
జీవోలు, నిబంధనలు పేరిట నియంత్రణలు విధిస్తున్నట్టు అధికారులు చెప్తున్నప్పటికీ పాఠశాలల దోపిడి ఆగడం లేదు. అడ్మిషన్ టెస్టుల పేరిట రూ.500 నుంచి రూ.5,500 వరకు వసూలు చేస్తు న్నారు. ఆ పాఠశాలలో సీటు వచ్చినా, రాకపోయినా ఈ నగదు వాపస్ ఇవ్వక పోవడం గమనార్హం. ఫీజులను నియంత్రిస్తామని ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులెత్తేసింది. విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నది.
ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యం కారణంగా ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలు ‘ఆడిందే ఆట.. పాడిం దే పాట’గా అవుతున్నది.2009 విద్యాహక్కు చట్టం ప్రకారం.. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో మొత్తం సీట్లలో 25 శాతం పేద పిల్లలకు ఇవ్వాలి. కానీ, రాష్ట్రంలోని ఏ పాఠశాలలోనూ ఈ నిబంధన అమలు కావడం లేదు. మరోవైపు యూనిఫామ్స్, పుస్తకాలు, నోట్ పుస్తకాల వ్యాపారానికి ప్రైవేట్ పాఠశాలలు వేదికలుగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా కొన్ని కార్పొరేట్ పాఠశాలల్లో ప్రభుత్వం రూపొందించిన సిలబస్‌కు భిన్నంగా బోధన జరుగుతున్నది. అయినప్పటికీ అటు ప్రభుత్వం గాని, ఇటు అధికారులు గాని చర్యలు చేపట్టడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలి. పాఠశాలల యాజమాన్యాల పై చర్యలు చేపట్టాలి.
– ముంజంపల్లి దేవేందర్, 89784 58611