ఈ పొలంపై నిలిచే వరి దిబ్బలు
కాసేపైనా ఆనందాన్ని
ఎగరనీయటం లేదు
వర్షంలో మునిగిన పంట మాదిరి
అప్పుల్లో తడిసిన బతుకు మాదిరి
ఆదుకోని ధరలతో పతనమైన చిరునవ్వు మాదిరి
రైతు కళ్ళల్లో మిరప మంటలు రేపుతూ
ఉల్లి కోసి కన్నీళ్ళను తోడుతున్నవి.
పంట నూర్పు పసిడి కల అనుకుంటే
పొరపాటైపోలా
మద్దతు ధర ముంచి పోయాక
తేరుకోవటం తెల్ల ముఖం వేయటం
అలవాటైపోయింది.
పైరు ఎండిపోతే తడబడ్డాం
పురుగు కొరుకుతుంటే దిగులు పడ్డాం
వర్షం ముంచిపోతే
కన్నీళ్లలో కొట్టుకుపోయాం
బీమా లేని బతుకుల్లో
ధీమా చూడమంటే ఎట్లా
దళారులు పన్నే పన్నాగంలో
దగాకోరులు విసిరే వలలో
విలవిలలాడే రైతులకు
ఇప్పుడు సంక్రాంతులు
ఎలా చేసుకోవాలో తెలియదు…
వెన్నెముకకు ఊతమిచ్చే
రాజ్యాధికారం బలంగా
నిలబడే వరకూ
పంట నూర్పులు నిట్టూర్పులు గానే
మిగులుతున్నాయి.
-గవిడి శ్రీనివాస్
70192 78368