స్ఫూర్తి మంత్రంనా తెలంగాణ ఓ ప్రాంతం కాదు
ఓ స్ఫూర్తి మంత్రం..ప్రాపంచిక దృక్పథం
నా తెలంగాణ ఆత్మ గల్ల ప్రాంతం
అక్కున చేర్చుకునే నేస్తం
సర్వ మత సమ్మేళనం..చరిత్రకెక్కిన పాఠం
అమరులు పంచిన త్యాగం
ప్రపంచానికి తన ‘ఉనికి’ని చాటిన ఉద్యమం
శతాబ్దాల సంస్కృతిని ఒడిసిపట్టుకున్న ఛత్రం
దశాబ్దాల స్వప్నాన్ని సాకారం చేసుకున్న పోరాటం
చరిత్ర పుటల్లో ఎక్కడ చూసినా
ఉద్యమాల ఉసిల్ల పుట్టలే!
నా తెలంగాణ నిలువెల్లా గాయాలే
అడుగడుగునా చైతన్య దీపికలే
దారి పొడుగునా త్యాగాల పూలజల్లులే!!
స్వేచ్ఛా తెలంగాణకై
రజాకార్ల ఆగడాలను ఎదిరించిన పోరాటాలెన్నో!
ఉద్యమ కాగడాలను వెలిగించిన ఊపిరులెన్నో!!
నా తెలంగాణ భాష స్వేచ్ఛా ప్రపంచానికై గొంతుకనిచ్చిన భాష
అమాయకత్వం నిండిన గమ్మత్తైన గడుసరి యాస
నా తెలంగాణ భాష
అవమానాలు అవహేళనలు అణచివేతల
గోసలు భరించి తలెత్తుకున్న తేటతెలుగు యాస
నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణి
సిరులు కురిపించే సింగరేణి
వెలుగులు జిమ్మే విద్యుత్ తరంగిణి
మిషను కాకతీయ మిషను భగీరథ
ప్రాజెక్టుల పెన్నిధి రైతు బంధుతో బడుగుల భరోసా నిధి
‘ఆసరా’ తో పండుటాకులకి
ఆపన్న హస్తానిచ్చే చెలిమి
గల గలా గోదారి నడకలతో
బిర బిరా కృష్ణమ్మ హొయలుతో
మంజీరా నాదమై
సాగే సాగర ప్రభంజనం
అస్తిత్వానికై తలవంచని పౌరుషం నా తెలంగాణ
ప్రేమకు ప్రతీక నా తెలంగాణ
స్వరాష్ట్ర సాధనకై
సకల జనుల నినాదమై సింహనాదం చేశాం నాడు
అంతే పదిలంగా భావితరాలకి
తెలంగాణ స్ఫూర్తిని మోసుకెళ్ళుదాం నేడు
-డాక్టర్ రానవేయిన రమేష్, 98492 94694