నుడికారాల రసార్ద్రపు పారవశ్యంతో
ముఖ్యమంత్రి ఇంత చక్కగ
జనం గుండెల్లో గూడు గట్టుకుంటడు
యేతమేసి లేపి కుమ్మరించిన స్వచ్ఛ జలంలా..
మంత్రులేది మాట్లాడినా
ఇట్టే హృదయాలకు తగిలిపోద్ది!
గల్లీ భాషలో ప్రజలతో మమేకమై
గిలి వెడ్తరు ఎమ్మెల్లేలు!
వీళ్ళు జెప్పినయన్నీ
తన్మయత్వంతో విన్నట్టే విని కూడా
ఆత్మెల్లిపోయిన డెడ్ బాడీ లెక్కన
ఇంగ్లీషు జీవో దీసేదెవరు..?
మనుషుల మనసెరిగిన ఊరాయన
సర్పంచ్ ముద్దుగ
అమ్మ భాషల మాట్లాడ్తడు
ఎవరి కొరకున్నననుకుంటడో
వాళ్ళ మాటల్ల ఎంపీపీ
రాగరంజితమైన ముచ్చట జెప్తడు..!
వార్డు వార్డుకు మేయర్
తేనె భాషతోటి
సమస్యలకు మలాము రాస్తడు
ఐనా, రసం పిండిన చెరుకు పిప్పి లెక్క
ఇకారపు ఇంగ్లీషు సర్క్యులర్ ఇచ్చేదెవరు..?
చట్టసభలు రెండూ
తూనీగ భాష మీద
రింగన పురుగు సవ్వడిల
ఊరేగుతై..!
చట్టం కొయ్యను
ఆత్మలేని ఆంగ్లంలో
చెక్కే సూటు బాబులెవ్వరు
తేలాలె
తేట తెలుగు రాజ్యానికెక్కాలె..!!
–ఏనుగు నరసింహారెడ్డి , 89788 69183