సాహిత్యమే ఊపిరిగా, సంస్కృతియే ప్రాణంగా జీవించిన పీవీ నరసింహారావు కన్ను మూసేదాక పెన్ను వదలలేదు. నిరంతర అధ్యయనం, అవిశ్రాంత రచనా వ్యాసంగం ఆయన జీవితంలో ఉచ్ఛాస నిశ్వాసాలయ్యాయి. అక్షరాన్ని ఆరాధించి, అక్షర తపస్విగా పరివర్తనం చెందారు పీవీ.
సాహిత్యంలో అన్ని ప్రక్రియలను స్పృశించినప్పటికీ, అనువాదంలో ఆరితేరారు పీవీ. హైస్కులు విద్యార్థిగా ఉన్నపుడే ‘థామస్ గ్రే’ ఎలిజీని తెలుగులోకి అనువదించారు. కాలక్రమేణ పలు భాషల్లో పాండిత్యం సంపాదించి అనువాద ప్రక్రియ వైపు మరలి విలువైన రచనలు అందించారు. ఆయన అనువాదం ఒక్క భాషకే పరిమితం కాలేదు. తెలుగు నుంచి హిందీ (సహస్ర ఫణ్), మరాఠి నుంచి తెలుగు (అబలా జీవితం), ఇంగ్లీషు నుంచి తెలుగు (భారతీయ సంస్కృతి పునాదులు), ఇంగ్లీషు నుంచి హిందీ (భారతీయ్ సంవిధాన్).. ఇలా అనేక భాషానువాదాలు చేసిన ప్రతిభామూర్తి ఆయన. ఆయన చివరి రోజుల్లో ప్రముఖ స్త్రీవాద కవయిత్రి జయప్రభ రాసిన‘అనుకోని అనురాగం’ కవితా సంకలనాన్ని Unforseen Affection శీర్షికన ఆంగ్లానువాదం చేసి కాల్పనిక కవిగా సమున్నత స్థానం పొందారు.
జయప్రభ 1993-2000 మధ్య కాలంలో ‘ఉదయం’ దిన పత్రిక కోసం రాసిన 75 వచన కవితల్లోని వస్తువు, తాత్వికత, పీవీని ఎంతో కదిలించాయి. స్థూలదృష్టికి ఈ కవితలన్నీ ప్రేమ భూమికపై రాసినట్లు కనిపించినా, ఇందులోని మార్మికత, ప్రేమ తత్వానికి సంబంధించిన అనిర్వచనీయమైన తాత్వికత పీవీని ఆకట్టుకోవడంతో ఆంగ్లంలోకి అనువదించడానికి పూనుకొన్నారు.
ఓసారి జయప్రభ రచించిన ‘పబ్ ఆఫ్ వైజాగ్ పట్నం’ కవితలను యాదృచ్ఛికంగా చదివిన పీవీ ఎంతో ముగ్ధులై, అవగాహన కోసం ఆధునిక తెలుగు కవిత్వం గురించి సమగ్రంగా అధ్యయనం చేశారు. ఆ తర్వాత జయప్రభ రచించిన ‘అనుకోని అనురాగం’ ప్రేమ కవితలను చదివి.. మన తెలుగు కవిత్వం ఆంగ్లంలోకి రాకపోవడం వలన మంచికవులకు గుర్తింపు రావడం లేదని, ఈ కవితలని ఇంగ్లీషులోకి ఎందుకు అనువదించలేదని ప్రశ్నించారు. దానికి జయప్రభ, మనవద్ద అనువాదకులు లేరని, ఎవరు చేయగలరని బదులు పలికారట. దాంతో పీవీ తనే స్వయంగా ఆంగ్లంలోకి చేద్దామనుకొంటున్నాననే నిర్ణయాన్ని ప్రకటించి జయప్రభను సంభ్రమాశ్చర్యపరిచారు. 80 ఏండ్ల వయసులో అనారోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా తదేకదీక్షతో అనువదించి, చనిపోవడానికి ఆరునెలల ముందు జూన్ 2004 వరకు పూర్తిచేశారు. తర్వాత దీన్ని ద్విభాషా గ్రంథంగా పెంగ్విన్ గ్రూప్ వారు 2005లో ప్రచురించారు.
పీవీ తన అనువాద విధానం గురించి పీఠికలో తెలియజేస్తూ జయప్రభ వ్యక్తిత్వాన్ని, కవిత్వాన్ని సమగ్రంగా విశ్లేషించి పాఠకులకు మూలరచయిత గురించి సదవగాహన కలిగించటం విశేషం. జయప్రభ ‘స్త్రీ వాదం’ ఏ ‘ఇజా’నికి ఆలంబన కాదని, దాన్ని ఒక సర్వవ్యాపక కారుణ్యవాదంగా భావించారని, ఆమె కవిత్వం ఆధునిక భారతీయ మహిళా లోకానికి ప్రతిబింబమని Love of an Eternal journey శీర్షికతో రాసిన 13 పేజీల ముందుమాటలో సోదాహరణంగా వివరించారు. ఇందులో ఎక్కడా తన అనువాద ప్రజ్ఞ గురించి చెప్పుకోలేదు. పైగా తానొక సామాన్యుడినని వినయంగా
చెప్పుకొన్నారు.
సాధారణంగా ప్రసంగాలను, కథలను, నవలలను అనువదించడం సులభం. కానీ కవిత్వాన్ని అనువదించడం అంత తేలిక కాదు. కవిత్వంలోని వస్తువు, అభివ్యక్తి, ధ్వని, మార్మికత, జాతీయత మొదలైన అంశాలను అదే స్థాయిలో అనువదించాల్సి ఉంటుంది. ఆయా కవితలు ఆవిర్భవించిన దేశ కాల పరిస్థితులు, నేపథ్యం అనువాదిత భాషలోకి అనువర్తితమా? కాదా? అనే విచక్షణ అవసరం. అనువాదకులకు ఉభయ భాషల పట్ల సాధికారత ఉండాలి.
పీవీ బహు భాషాకోవిదుడు. సుదీర్ఘ రాజకీయ జీవన ప్రస్థానంలో చేసిన ప్రపంచ దేశాల పర్యటనలో వేలాది మనుషులను, మనస్తత్వాలను చదివిన తాత్వికుడు. తన అనుభవాన్ని జోడించి అధ్యయనం భూమికగా జయప్రభ కవితలను అనువదించారు. ఇంకో విషయమేమంటే.. తనే స్వయంగా తెలుగులో, ఇంగ్లీషులో టైప్ చేయడం.
జయప్రభ కవితలలోని ప్రత్యేకతలను పీవీ ఎంతో ప్రామాణికంగా విశ్లేషించారు. ‘సాయంత్రం కాంతి లాంటి కోరిక నాది’ కవితలో పరమాత్మ తత్వాన్ని తెలిపారు. ప్రణయ తత్వానికి ప్రతీకలైన శివపార్వతులను ప్రస్తావించడంతో దైవీభావన గోచరించిందని ఉదహరించారు. పీవీ ఒకవిధంగా జయప్రభ కవనశక్తితో తాదా త్మ్యం చెంది ఆ కవితలను అనుసృజించారని చెప్పాలి. ఒక్కోసారి మూలాన్ని మించి వ్యక్తం చేశారేమోనని అనిపిస్తుంది. ఉదా: ‘నా పద్యాలలోని పంక్తులు’ కవిత..
‘నా పద్యాలలోని క్రీడావాటికని, కళల పేటికని కుంకుమ వర్ణాన్ని, కేతకీ గుఛ్ఛాన్ని
చూస్తూ నీపాల పడెయ్యలేక నువ్వులేని వేళ, శర్విలకుడిలా చొరబడి నా ప్రేమగీతాలని నేనే సంగ్రహించాను..
ఇందులో ‘కుంకుమ’, ‘కేతకీ’ మొదలు అన్నిపదాలను అనువదించవచ్చు. కానీ,‘శర్విలకుడు’ అనే పదమే కష్టం! సంస్కృతంలో రాసిన ‘మృచ్ఛకటికం’ నాటకంలోని పాత్ర ఇది. నాటకంలో ప్రేయసి (మదనిక) కోసం దొంగతనానికి పాల్పడిన పాత్ర. ఈ నాటకం గురించి తెలిసినవారికే కవితలోని మార్మికత తెలుస్తుంది. దీన్ని పీవీ కవితలో ప్రస్తావించకుండా, బదులుగా వేరే సముచిత పదాన్ని వాడి అనువదించారు.
I tiptoed in when you were not around
And purloined my own love poems..
ఇక్కడ purloined (సంగ్రహించుట) పదంలోనే ప్రేమ తాలూకు చిలిపితనపు చౌర్యం ధ్వనిస్తుంది. కవితల్లో ఎక్కువశాతం జయప్రభ ప్రయోగించిన శబ్దాలనే వాడి, అథోదీపిక (foot notes)ల్లో వాటి గురించి పీవీ వివరించారు. ఉదాహరణకు, ‘గదిలోకి వెళ్ళాను’ (I went into the Room) కవిత మూలంలో ‘వానప్రస్థం’ అనే పదాన్ని యథాతథంగా వాడి ఫుట్నోట్స్లో వివరించారు. కారణం పాశ్చాత్యుల సంస్కృతిలో ఆశ్రమ వ్యవస్థ లేకపోవడమే.
పీవీ ప్రయోగించిన ఆంగ్ల పదాలు ఆయనకు ఆ భాషపై గల సాధికారతను, శబ్దసంపద ప్రతిభను తెలియజేస్తున్నవి. ‘సాయంత్రపు కాంతి’, ‘మళ్ళీ పగటివేళ’, ‘అనుకోని అనురాగం’ కవితలను పీవీ అనువదించిన తీరు అద్భుతం. ఈ పుస్తకానికి శీర్షికగా చేర్చిన ‘అనుకోని అనురాగం’ దీర్ఘకవిత. ఇందులో ప్రేమ మనిషిని బానిసని చేయకూడదని రాస్తూ.. చాలాకాలం వియోగం తదుపరి ఊడిపడిన ప్రేమికుడి ఆగమనాన్ని unforeseen affection అని ముగించారు.
మనకు గాంధీ, టాగూరు, అంబేద్కర్ పేరుతో అధ్యయన కేంద్రాలున్నాయి. ఇదే క్రమంలో పీవీ రచనలపై ఏదేని విశ్వవిద్యాలయం అధ్యయన కేంద్రం స్థాపిస్తే భావితరాలకు ఆయన ఆలోచనాధార అందుతుంది. పీవీ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ అధ్యయన కేంద్రం గురించి కూడా పూనుకొంటే అదే పీవీగారికి మన జాతి ఇవ్వగలిగిన ఘన నివాళి అవుతుంది.
కవితా సంపుటిని పీవీ తనే స్వయంగా ఆంగ్లంలోకి చేద్దామనుకొంటున్నాననే నిర్ణయాన్ని చెప్పి జయప్రభను సంభ్రమాశ్చర్యపరిచారు. 80 ఏండ్ల వయసులో అనారోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా తదేకదీక్షతో అనువదించి, చనిపోవడానికి ఆరునెలల ముందు జూన్ 2004 వరకు పూర్తిచేశారు.
ఈ పుస్తకాన్ని పీవీకే అంకితమిస్తూ-
To P.V…
Who also translates dreams into reality అని జయప్రభ రాసిన వాక్యం పీవీ ప్రతిభా పాటవాలను తెలియజేస్తుంది. పీవీ తన చివరి దశలో ఈ బృహత్తర
రచనకు పూనుకొని జయప్రభకే కాదు, సమస్త సాహితీలోకానికి అనుకోని అనురాగంగా నిలిచారు.