దక్కన్ పీఠభూమిలో పాలమూరు జిల్లాకో ప్రత్యేకత ఉన్నది. ప్రజల కోసం పరితపించిన వారికిక్కడ కొదవ లేదు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీకలై నిలిచినవారూ తక్కువేమీ కాదు. కాలం ఏదైనా, యావత్ సమాజం బాగుండాలని భావించినవారు, కుల మత ప్రసక్తి లేకుండా జీవించాలని ఎల్లజనుల హితాన్ని కోరుకున్నవారెందరో ఈ కరువు జిల్లాలో జన్మించారు. ఆ వరుసలో ఉన్నవారే గేయ కవి అస్కాని నర్సింహాసాగర్ గారు.
పాలమూరు జిల్లా ప్రజలు దేశమంతా ప్రాజెక్టులు, రహదారులు నిర్మించారు. తమ శక్తిని ఉజ్వల భారత్‌కు అంకితం ఇచ్చారు. సరిగ్గా ఆ ప్రాంతం నుంచే ‘ఎడారి పూలు’ గేయ కవితా సంపుటిని నర్సింహాసాగర్ వెలువరించారు. 1975-76 ప్రాంతంలో వచ్చిందీ సంకలనం. ఇందులో మొత్తం 20 గేయాలున్నాయి. ఇందులో ఉన్నవన్నీ సర్వమానవ సోదరభావాన్ని పెంపొందించాలని కోరుకున్నవే. అంతేకాదు, ఆధునిక సమాజపు పోకడలకు పునాదులు పడుతున్న సందర్భంలో ఈ గేయాలు వచ్చాయి. తానొక తెలుగు పండితుడిగా, తన చుట్టూ ఉన్న సమాజాన్ని గమనించి రాసినవే. ఒక్క మాటలో చెప్పాలంటే తన జీవితంలో జీవితాన్ని రంగరించి రాసుకున్నవే. ఇదో వలపోత లాంటి గేయాల సమాహారం.
ఈ గేయాల సంపుటి వెలువడిన కాలం కూడా చాలా ప్రత్యేకమైనది. తను పుట్టింది 1944, ఏప్రిల్ 21న ముసాపేటలో. ఇది హైవేపై ఉన్న గ్రామం. యాభై ఏండ్ల కింద కూడా ప్రధానమైన రహదారే. ఇది వనపర్తి సంస్థానం. ఇటు పాలమూరు, అటు బాలానగర్, ఫరూఖ్‌నగర్ సంస్థానాలు ఈ రహదారిపైనే ఉంటాయి. సమాజంలో వచ్చిన మార్పులు తొలుత రహదారి గ్రామాలను తాకుతాయి.
1960ల నుంచి చైనాతో భారత్ యుద్ధం, బంగ్లాదేశ్ యుద్ధం.. నెహ్రూ సంస్కరణలు, ‘జై జైవాన్-జైకిసాన్’ నినాదాలు, ఇందిరాగాంధీ రాజాభరణాల రద్దు.. ఎస్సీ, ఎస్టీల కోసం కేంద్రప్రభుత్వం సంక్షేమ పథకాల రూపకల్పన.. ఇత్యాది విషయాలన్నీ జనంలో చర్చ జరుగుతున్న సందర్భమది. అంతేకాదు, ఆధునిక మార్పులు, మన దేశంలోకి ఎఫ్‌డీఐలను ఎట్లా అనుమతించాలనే రాజకీయ నిర్ణయాలు జరుగుతున్న సందర్భం కూడా. ఆధునిక భారతదేశం మార్పు వైపు అడుగులు వేస్తున్న తరుణంలో ఈ గేయ సంపుటి వచ్చింది. ఈ పుస్తకం వచ్చిన సందర్భంలో నుంచి గేయాల ప్రభావాన్ని అంచనా వేయొచ్చు.
కవి తాను అచ్చువేసిన 20 గేయాల నిం డా మానవత్వాన్ని నింపారు. ఆధునిక మానవుడు ఎట్లా ఉండాలో సూచించారు. చదువుల పట్ల విద్యార్థుల అశ్రద్ధను చెప్తాడు. అంతేకాదు, కు సమత అనే గేయంలో ‘అందరిని సమముగా జూచిన/ అన్ని మతములు కలిసి పోవును/ అన్నదమ్ముల వలెనె యుందురు/ ఐక్యమున వడి సాగిరండి’… అంటారు. ‘కలిసిమెలసి భుజించరండి/ కులమతమ్ములు వలదు మనకిక’ అని బోధిస్తాడు. ఈ సంపుటిలోని ‘కుత్సితం’ అనే గేయంలో ఆధునిక మానవుని గాయాల గురించి, హృదయం మరిచి తిరుగుతున్న జనుల గురించి వేదన చాలా స్పష్టంగా కన్పిస్తుంది. ‘ఆజ్ఞలలో కుత్సితం/ అభయాలలో కుత్సితం/ మాటలో మమతలలో వాక్కులలో మాదనలలో’ ఈ మాటలు మరింతగా సరిపోతాయి ఈ తరం వారికి. రాజకీయాల గురించి, మనుషుల మధ్య ఉండే అనుబంధాల గురించి ప్రత్యక్షంగా కొన్ని, పరోక్షంగా మరికొన్ని సూచనలు, ఆవేదనలు, ఆర్తి ఈ గేయాల్లో పుష్కలంగా కన్పిస్తుంది. ఈ సంపుటిలో మరో ఆసక్తిని కలించే గేయం ‘కలిసి వుందాము-తెలిసి కొందాము’ ఈ గేయంలో అత్యయిక పరిస్థితి అనంతరం పరిణామాలు, నాటి ప్రభుత్వ నిర్ణయాలతో పాటు చాలాచాలా విషయాలు చాలా విపులంగా రాశారు.
ప్రజలు సులభంగా తత్వాలు పాడుకునేలా రాగయుక్తంగా రాశారు. ఈ గేయంలో ఒకచోట ఇట్లా అన్నారు… ‘గ్రామ లక్ష్మీలని/ గ్రామ సేవికలని/మిడ్ వైఫ్ శిస్టర్లు వెలిశారయా’ అని చెప్పారు. అంటే ఆ నాడు మహిళల కోసం ప్రభుత్వ పథకాలు వచ్చిన తీరు, వారి జీవితాల్లో మార్పు తదితర అంశాలున్నాయి. గొర్లు, బర్ల పెంపకాలు, ప్రభుత్వం పేదలకు ఇస్తున్న సదుపాయాలన్నీ అందులో వ్యక్తీకరించారు. మొన్నటివరకు గత ప్రభుత్వం గొర్ల, బర్ల పెంపకాన్ని ప్రోత్సహించింది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు ప్రవేశపెట్టింది. గ్రామీణ జీవన ఆర్థిక పరిపుష్టి కలిగించే అంశాలకు ఆ నాడే పునాది పడిందనే విషయాన్నీ ఈ గేయాల ద్వారా తెలుసుకోవచ్చు. నెహ్రూ, ఇందిరాగాంధీ పాలన నుంచి ఆధునిక సమాజానికి అన్వయించుకునే చాలా విషయాలు ఈ ‘ఎడారి పూలు’లో వికసింపజేశారు కవి. రచయిత నర్సింహాసాగర్ చెప్పినట్టుగా అంతఃపురాలలో ఉండే పువ్వుల వికాసం గురించి కాదు, పల్లె ప్రాంతపు ప్రజల మనసులను చూరగొనాలి. అందుకోసం ఈ గేయ సంపుటి నూటికి నూరుపాళ్లు కృషి చేస్తుంది.
ఆధునిక తరానికీ ఈ గేయాలు అందుబాటులో ఉంచాలనే సదుద్దేశంతో వారి కుటుంబీకులు ఈ గ్రంథాన్ని డిజిటల్ రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రఖ్యాత వాగ్గేయకారులు గోరటి వెంకన్న, సుప్రసిద్ధ సంపాదకులు, కవి, విమర్శకులు కె.శ్రీనివాస్, అల్లం నారాయణ, అధ్యాపకులు, టీఎస్పీఎస్సీ తొలి చైర్మన్, సామాజిక, రాజకీయాంశాల విశ్లేషకులు ఘంటా చక్రపాణి, జూలూరు గౌరీశంకర్ చేతుల మీదుగా ఈ గేయ సంపుటి ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా ఇదే కరువు జిల్లాకు చెందిన జర్నలిస్టుగా ఎడారి పూలు గేయ సంపుటి గురించి ఈ నాలుగు మాటలు మీతో పంచుకుంటున్నా.
(వ్యాసకర్త:సీనియర్ జర్నలిస్టు)
గోర్ల బుచ్చన్న
87909 99116