‘పోతుగంటి’ కరీంనగర్ పట్టణానికి పక్కనే ఉన్న ఓ ముంపు గ్రామం. ఈ ప్రాంతంలో గోదావరి నదిని గంగ అని పిలుస్తరు. గంగ దిక్కు నిలిపిన దర్వాజను ‘గంగదర్వాజ’ అని అంటరు. ‘పుట్టినమంటే గంగ-పుటుక్కుమంటే గంగ’ అనే సామెతనే ఇక్కడి జీవితాలు గంగతో ఏ విధంగా ముడిపడి ఉన్నాయో తెలుపుతుంది. ఊరుమ్మడి బతుకును మనసున పట్టించుకున్నడు కనుకనే రచయిత డాక్టర్ మట్టా సంపత్‌కుమార్ రెడ్డి ‘గంగదర్వాజ’ అనే పేరును ఈ పుస్తకానికి పెట్టిండు.
‘మురిపాల ముచ్చట్లు’గా చెప్పుకున్నడు. డబ్బు ఒక్క ముచ్చట్లుగా విస్తరించిన ఈ సంస్కృతీ విశేషం ఒక రకంగా ఒడువని ముచ్చట. గంగలాగే ఇది కూడా జీవధార. ఇతని రచన కవిత్వమై వెలిగిన కథనం. తీయటి ఈతకల్లు లాంటి ప్రాంతోచిత భాష పుట్ల కొద్దీ సామెతలతో రచనా ప్రవాహంలా సాగింది. అనుభవాత్మకం, ఆత్మగతం ఈ రచనా లక్షణం. ముందు తరానికి సంస్కృతిని తెలియపరచాలనే ఈ సంభాషణకు రచయిత పూనుకున్నారు.
గ్రామీణ గర్భంలో పురుడు పోసుకొని, పెరిగి విస్తరించిన సంపత్‌కుమార్ తన కుదురును మరిచిపోలేదు. వ్యావసాయిక వాతావరణాన్ని జీర్ణించుకు న్న రచయిత. దాన్ని నెమరువేసుకుంటూ మందితో పంచుకున్నారు. సుఖదుఃఖాల ను, ఆప్యాయతలను, స్నేహాలను, ఊరుమ్మడి తనాన్ని, పలకరించాడు, పులకించా డు. రచనకు ఒక క్రమాన్ని ఏర్పర్చుకోలే దు. దాన్ని వింగడిస్తే అనేక విభాగాలు ఏర్పడతాయి. వ్యవసాయం, వైద్యం, ఆహారం, భౌగోళికం, పంటలు, పండుగలు, పురు ళ్లు,- పుట్టెంటికలు అన్నట్టు అనేక విషయాలను పూసగుచ్చినట్టు చెప్పారు. ‘ఊదుక బుక్కుడు-ఊరు మొకాన సూసుడు’ అనే సామెతను వాడిన సందర్భం రచయిత వైఖరిని తెలుపుతుంది.
రాజన్న గుడిలో జరిగిన సీతారాముల పెండ్లి ముచ్చట, సంక్రాంతి పీడ పండుగైన వైనం, గరిబుడ్డికి మరో రూపం గర్భధారణ అని తెలపడం రచయి త ఆసక్తికి నిదర్శనం. శివుడుని ‘లోకాల శం కరుడు’ అని పిలుచుకున్న ప్రజల హృదయ సంస్కారం గొప్పది. ‘దేవుని తలువాలు’ ఎంత అర్థవంతమైన పదం. ‘ధారణ’ కార్యక్రమం ముచ్చటగొల్పుతుంది. వ్యావసాయిక సమాజం అందించిన ‘గంజేగాసం’, ‘గంజిల మెతుకు’, ‘గంజివోసుడు’, ‘పసిగడుగులు, ‘పులగడుగులు’, ‘గంజినీళ్లు’, ‘కలినీళ్లు’ మొదలైన పదాలు పలుకుబడులుగా నానుడిలుగా, జాతీయాలుగా జన జీవనంలో ఇంకిపోయిన తీరును కండ్లకు కట్టినట్టుగా చూపాడు. చలిమిడిముద్దలు, నువ్వుల ముద్ద లు మధ్య గల భేదాన్ని ఇగురంగా చెప్పడం ఈయనకే చెల్లింది. నాగరీకంలో బతుకుతున్నా రచయిత నవనాడుల్లో వ్యవసాయ సంస్కృతి పాదుకొని ఉన్నది.
నాటి పంటల చక్రాన్ని చెప్పిన విధం చూడండి. ‘కాముని పున్నానికి చింతకాయ రాలుడు మొదలయి/ ఉగాది పండుక్కు తోట పెరండ్లు లూటి పోవుడు పూర్తయి/ రాముని తలువాలు పడ్డయంటే కాయగూరలు ఖతం’ కాముని పున్నం, తోట పెరం డ్లు, తలువాలు, పండుక్కు, ఖతం ఇలాం టి పదాలతో కూడిన ఇతని రచన నిసర్గ భాషా సౌందర్యాన్ని పాఠకునికి అందిస్తుం ది. పప్పు-పచ్చిపులుసు, నికార్సయిన తెలంగాణ వంటకం. పప్పు వండటంలోని రకాలను ఆయన ఏకరువు పెట్టిన తీరు నవ్విస్తుంది. రాముల్కాయ రుచిని, పచ్చికొత్తిమీర వాసనలను, నల్లరేగళ్ల రంగులను పొదువుకున్న ఈ రచన మనల్ని వర్తమాన ఉక్కపోత నుంచి గతంలోకి, పల్లెలోకి, అమ్మమ్మ నాయనమ్మల సమక్షంలోకి తీసుకెళ్తుంది. ఇవాళ ఊరు లేదు. ఊరి యాది మాత్రం ఉంది. అందుకే ఈ తలపోత. ఎవరి తలపోత వాళ్లది. వాటిని పోతపోసి ముందుతరానికి అందివ్వాలని, ఆ బాధ్యతను నిర్వర్తించిన రచయితకు అభినందనలు.
– డాక్టర్ బీవీఎన్ స్వామి 92478 17732