తెలుగు సాహిత్యంలో జీవిత కథలు.. జీవన ప్రయాణాల చరిత్ర నిక్షిప్తాలు కొత్త కాదు. అతడు-ఆమె.. కాశీయాత్ర నుంచి దాశరథి ‘జీవనయానం’ వరకు సుసంపన్నమైన సాహితీ భాండాగారం తెలుగు జాతిది. దాశరథి రంగాచార్యులు ఆంధ్రదేశపు రాజకీయ, సాంఘిక, సామాజిక చరిత్రతో సమాంతరంగా పయనించి రచనలు చేసిన సాహితీ స్రష్ట. నాడు-నేడు పై అంశాలలో పది నవలలు పేర్కొంటే వాటిలో సగం దాశరథి రచనలే ఉంటాయి. మోదుగు పూలు, చిల్లర దేవుళ్లు వంటివి కొన్ని మాత్రమే.
దాశరథి రంగాచార్యకు వేదం తెలుసు, జీవననాదం తెలుసు. అతని సోదరులు దాశరథి కృష్ణమాచార్యులు అక్షరాలతో అగ్నిధారలు కురిపించిన కవి. సినీగేయ రచయితగానూ సుప్రసిద్ధులు. తమ్ముడు దాశరథి రంగాచార్యులు ఆధ్యాత్మిక సాహితీ శిఖరంలా వెలిగారు. తెలుగు సాహిత్యాన్ని అన్ని ప్రక్రియలలో సుసంపన్నం చేశారు. ‘పలికెడిది భాగవతమట పలికించెడు వాడు రామభద్రుడని’ వినయంగా చెప్పుకొన్న పోతన మాదిరిగా అత్యంత వినయంతో ‘నేను నాలుగు వేదాల వచనానువాదం- కేవలం భగవదనుగ్రహంతో (24-1-1998 నాటికి) పూర్తి చేశాను’ అన్నారు రంగాచార్యులు. వేదం ఆయన ప్రాణం, జీవననాదం. తెలుగుజాతి (కాదు.. భారతీయ) సంస్కృతి. సంప్రదాయ జీవనాడి ఆధారం.
‘అన్ని వేదాల్లోనే ఉన్నాయిష’ అన్న కన్యాశుల్కం వాక్కు అక్షర సత్యం. దాశరథి రంగాచార్యులు అక్షర నిధులతో రుజువు చేసిన వాస్తవం. ‘ఈ మానవ జీవితం – సమాజ జీవితం – నాగరికత – సంస్కృతి అన్నీ వేదం నుంచి అవతరించినవే! జీవననాదం వేదం నుంచి ఆవిర్భవించింది’ అని ఆయనే చెప్పుకున్నారు. వేదం మానవజాతికి వెలుగు ప్రసాదించింది. కనువిప్పు కలిగించింది. జీవననాదం వినిపించింది. జీవనాధారం చూపింది. జీవనసారం బోధించింది. దాశరథిగారి అక్షరరమ్యతను, జీవనానుభవాన్ని, జీవన సూత్రాల విస్తరణను ఈ చిన్న వ్యాసంలో వివరించడం సాధ్యం కాదు. ఆయనది సాహితీ వామనుని విశ్వరూప సందర్శనం. సాహిత్యంలో వేదానికి సంబంధించిన అతి సరళమైన వచనంతో వెలువడిన గ్రంథం ‘వేదం జీవనాదం’.
దాశరథి జ్ఞాన సంపాదన సూత్రం వేదం. ఈ రచనలో ఆయన చరిత్ర, పోరాటాలు, సామాజికంగా ‘మనిషి’లో కలిగిన పరిణామాలు, మృత్యు పరిష్వంగనలు వంటి వాటితో పాటు స్త్రీ సాధికారత కోసం ప్రారంభమైన పోరాటాలు ఈనాటివి కావని, నాటి రామాయణ, మహాభారత కాలాల నుంచి ఉన్నాయనేది ఇతిహాసపు రుజువులతో వివరిస్తారు.
ఇతిహాసాల చరిత్రలో మహిళా విముక్తి ఉద్యమాల గురించి ఆయన స్థాలీపులాకన్యాయంగా ఉదహరించారు. ఇందుకు ఉదాహరణలుగా- మహిష్మతి నగరాన్ని పరిపాలించిన నిషధుడు, విశ్వామిత్రుడు- మేనక, మమత, బృహస్పతి వృత్తాంతాలను ప్రస్తావిస్తారు. యవనాశ్వుడు అనే ఇక్ష్వాకు వంశరాజు గురించి వివరించే క్రమంలో మగవారి గర్భధారణ గురించి ఆశ్చర్యపోయే అంశాలను అత్యంత సరళంగా, స్పష్టంగా చెప్పారు. కృత్రిమ సంతానం (టెస్ట్ ట్యూబ్ బేబీ) ఉదంతాన్ని ఐతిహాసిక ఆధారాలతో వివరించిన వైనం దాశరథి వేద విజ్ఞాన పటిమకు నిదర్శనం. ఏ ప్రక్రియ తీసుకున్నా ఆయన తనదైన ముద్రనే వేశారు. అక్షరాలకు భారతీయ ఆత్మతో కూడిన సంప్రదాయాత్మకమైన తాత్వికతనద్దిన ఆధ్యాత్మిక శీలి దాశరథి.
దాశరథి రంగాచార్యులు తెలంగాణ స్వాతంత్య్ర పోరాట యోధుడు. కలం వీరుడు. 1928 ఆగస్టు 24న మహబూబ్ నగర్ జిల్లాలోని చిన్న గూడూరులో జన్మించారు. మార్క్సిజం, సంప్రదాయం భిన్న ధ్రువాలు. ఆ రెండింటి లక్ష్యం ఒక్కటే అయినా దారులు వేరని గ్రహించిన దాశరథి నూతన చక్షువులతో సంప్రదాయాన్ని మార్క్సిజం దృక్పథంతో, మార్క్సిజాన్ని మానవతాదృక్పథంతో అనుసృజన చేశారు. ఉద్యమకాలంలో భారత, రామాయణాలను వ్యతిరేకించినా, స్వాతంత్య్రం సిద్ధించి ఉద్యమాల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన దృక్పథంలో మార్పు వచ్చింది. నవలలు, కథలు, కవిత్వం, అనువాదాలు, వ్యాస సంకలనాలు వెలువరించారు. వేద సాహిత్యాన్ని, భారత, భాగవత, రామాయణాలను తమదైన శైలిలో రచించారు. ఆయనకు అనేక పురస్కారాలు లభించాయి. 2015 జూన్ 7న తన 86వ ఏట ఆయన మరణించారు. జాషువా అన్నట్టు ‘కవియు మరణించె ఒక తార గగనమెక్కె’. ప్రజల నాలుకలపైన, సాహితీ సహృదయులు నిరంతరం స్మరించుకునే చిరస్మరణీయులు దాశరథి రంగాచార్యులు.
భమిడిపాటి , గౌరీశంకర్
94928 58395