‘నెరుసు’ అనగా ‘పలుగురాళ్ల పొడి’ అని నిఘంటువు అర్థం. రైతులు మొలక చల్లడానికి ముందు అలుకుడు బోనం చేసి, పలుగురాళ్లను ఏరుకొచ్చి, శుభ్రంగా కడిగి, పసుపుతో పుదిచ్చి, కుంకుమబొట్లు పెట్టి, కొబ్బరికాయను కొట్టి సేద్యాన్ని పండుగగా మొదలుపెడతారు. ఇది అచ్చమైన ప్రాకృతిక స్థానిక ఆధ్యాత్మికత.
డాక్టర్ తండు కృష్ణకౌండిన్య రాసిన ‘నెరుసు’ విమర్శవ్యాసాల సంపుటిలో బహుజన దృక్ప థం, తెలంగాణ పోరాట అస్తిత్వం ప్రధానంగా కనిపిస్తాయి. బహుజన సాహిత్యానికి నెరుసు పూసి పదునుపెట్టిన మెరుపు వ్యాసాలు ఇందులో ఉన్నాయి. నెరుసు శీర్షికలో గొప్ప బహుజన తాత్వికత, స్ఫూర్తి ఉన్నాయి. గీతకత్తిని పదును పెట్టడానికి గౌడు బొడ్లో నెరుసు బద్ద లేదా చిడతబద్ద ఉంటుంది. దీనిని కుంకుడుచెట్టు కలపతో చేస్తారు. తెల్లటి పలుగురాళ్లను ముక్కలుగా చేసి, నెరుసు బండపై మెత్తగా దంచుతారు. ఈ రాతిపొడిని నెరుసు అంటారు. తండు కృష్ణకౌండిన్య బహుజన సాహిత్యాన్ని ఇరుసుగా, శాస్త్రీయ అలంకారిక విమర్శా పద్ధతులనే నెరుసును వాడి సునిశితమైన విమర్శామొగిని చేరారు. కర్మ సిద్ధాంతం కాదు, బతుకు సిద్ధాంతం కావాలని… తలరాతలు కాదు, బతుకు రాతలు మారాలని చెప్పిన మహాత్మా జ్యోతిబా ఫూలేపై వనపట్ల సుబ్బయ్య రాసిన దీర్ఘకవిత ‘బహుజన బావుటా’పై దీర్ఘకవితా లక్షణాలైన ఏక వస్తురూపం, సుదీర్ఘత, ప్రవాహగుణం, భాషాసారళ్యం గురించి అవసరానికి తగినట్టుగా కౌండిన్య చక్కగా విశ్లేషించారు. కవిత్వం ద్వారా ప్రకృతిని చిత్రించడంలో దిట్ట మునాసు వెంకట్ అని ‘సరికొత్త కవిత్వానికి చిరునామా మెద’లో పేర్కొన్నారు.
బీఎస్ రాములు, వల్లంపాటి వెంకట సుబ్బయ్య లాంటి వాళ్లస్థాయి కృషి ఈ పుస్తకంలో కనిపిస్తుంది. మేరెడ్డి యాదగిరిరెడ్డి మట్టికథకులు. ఈయన మట్టికథలు, కొలిమి, బొడ్రాయి కథల్లో పేదరికం, కరువు, మూఢ నమ్మకాలతోపాటు రచయిత అలంకారిక ప్రయోగాన్ని విశ్లేషించారు. శీలం భద్రయ్య రాసిన ‘లొట్టపీసు పూలు’ కథల్లోని బహుజన అస్తిత్వాన్ని రచయిత విలక్షణ పదప్రయోగాలనూ పట్టి చూపించారు.
దేవులపల్లి కృష్ణమూర్తి రాసిన బయటి గుడిసెలు నవలలో మొండిజాతి జీవితాల్లో నమ్మకాలను ‘అట్టడుగు వర్గాల జీవన ప్రతిబింబం’ పేరుతో వ్యాసం రాశారు. విజయం శాశ్వతం కాదని, పోరాటమే శాశ్వతమనే వట్టికోట జీవితం, సాహిత్యం గురించి రాసిన వ్యాసంలో సూత్రీకరించారు. బహుజన కవితోద్యమంలో నీలగిరి సాహితీ వృక్షమందించిన సాహిత్య ఫలం పగడాల నాగేందర్ అని ‘మొగురం’పై అధివిమర్శవ్యాసంలో రాశారు.
నిజాం నిరంకుశత్వానికి నిలువెత్తు దర్పణం గుర్రం బుచ్చిరాములు రాసిన యక్షగానం ‘వీర తెలంగాణ’. ఇందులో నవీన రచనా ప్రయోగాలైన గణపతిస్తుతి మినహాయింపు, ఇష్టదైవ ప్రార్థన నిరసన, తెలంగాణ మాండలికం, దరువులు, పాటలున్నాయని పరిశోధించి చెప్పారు. ఆత్రేయ పాటల తాత్వికుడు. మాటల మాంత్రికుడు. ఆయన సాహిత్యాన్ని వ్యక్తినిష్టం చేయకుండా, సమాజనిష్టమైన సాహిత్యాన్ని రాశారని తెలిపారు. కూరెళ్ల కవిత్వంలోని మానవతా దృక్పథం, సాగర్ల సత్తయ్య కందపద్యాలతో మానవీయ విలువలు, నందిని సిధారెడ్డి కవితా హృదయం, ఏనుగు నరసింహారెడ్డి తెలంగాణ రుబాయీల కవిత్వ విశిష్టత, సవివరంగా విశ్లేషించారు. పిల్లల కోసం వ్యవహారభాషలో కథలు రాసిన అరుదైన కథకుడు పెండెం జగదీశ్వర్ అని పేర్కొన్నారు. పెరుమాళ్ల ఆనంద్ రెక్కవిప్పిన బాల్యం పిల్లల కవితల్లో అనుభూతి, సందేశం, మానవత, ఆలోచనాత్మక కవితలను వివరించారు.
ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష నిండిన కవులు జూలూరు గౌరీశంకర్ దీర్ఘకవిత జూలూరి పథం, సుంకిరెడ్డి నారాయణరెడ్డి తెలంగాణ అస్తిత్వ సాహిత్యం, కరీంనగర్ కవుల సంకలనం వల్లుబండ, అల్లం నారాయణ ప్రాణహిత వ్యాసాలు, సుంకర రమేష్ తెలంగాణ కవిత, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి కవితాసంకలనం ఢమరుకం. తెలంగాణ నేలలో ఆధ్యాత్మికత, తాత్వికత ఉంది. కౌండిన్య తండ్రి అచలగురువు. ఆ ప్రభావం పోతులూరి వీరబ్రహ్మం కాలజ్ఞానం ఆధ్యాత్మికత వ్యాసంలో ప్రస్పుటంగా కనిపిస్తుంది. ఇందులో కాలజ్ఞాన మార్మికతను అర్థం చేసుకోవాల్సిన తీరు, సంఘ సంస్కరణ, ఆధ్యాత్మికతను చక్కగా విశ్లేషించారు.
– శీలం భద్రయ్య 98858 38288