‘భాష్యతే ఇతి భాషః!’ భాషింపబడునది భాష. ఉన్నత విద్యకు, వ్యక్తిత్వ వికాసానికి, పునాదులు వేసేది భాష. పిల్లల ఊహలకు రెక్కలు తొడుగుతూ అభివృద్ధికి బాటలు పరిచేది భాష. భాష ముందుతరాలకు అందాలంటే, భాష బతికి బట్టకట్టాలంటే దానికి సాహిత్యం తోడ్పాటు అవసరం. హితంతో కూడుకున్నదే సాహిత్యం. (స హితస్య సాహిత్యం). మంచి విషయాలను నేర్పే సాహిత్యం ఏ కాలానికైనా అవసరమే.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత బాల సాహిత్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెరిగింది. ప్రభుత్వంతో పాటు వివిధ సంస్థలు బాలల కోసం, బాలల సాహిత్యాన్ని సృజన చేస్తున్న పెద్దలకు సాహిత్య కార్యశాలలు ఏర్పాటుచేశాయి. విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు, బాల సాహిత్య కార్యకర్త గరిపెల్లి అశోక్ సంపాదకత్వంలో 2016లో ముస్తాబాద్ ప్రభుత్వ పాఠశాల పిల్లల కథల పుస్తకం ‘జాంపండ్లు’ వెలువడింది. బాల సాహిత్య పరిషత్తు, తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలంగాణ సారస్వత పరిషత్తు, రంగినేని ట్రస్ట్, బాలచెలిమి, మంచి పుస్తకం, బాలగోకులం, మాడభూషి రంగాచార్య స్మారక ట్రస్ట్, కంచర్ల గోపన్న సాహితీ సమాఖ్య, పెందోట బాలసాహిత్య పీఠం, సుగుణ సాహితీ సమితి లాంటి ఎన్నో సంస్థలు బాలసాహిత్య కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా బాలలకు రచనా పోటీలు నిర్వహించి బహుమతులను ఇచ్చి ప్రోత్సాహం అందిస్తున్నాయి.
కొన్ని సంస్థలు బాలసాహిత్యం సృజిస్తున్న వారికి బిరుదులు ఇస్తూ గౌరవిస్తున్నాయి. మరికొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు వ్యక్తిగతంగా పిల్లల రచనలను పుస్తకరూపంలో తీసుకొని వస్తున్నారు. పిల్లల లోకం బాలసాహిత్య వేదిక వారు ఒక అడుగు ముందుకేసి 2017లో పిల్లలకు వీడియో కథల పోటీ నిర్వహించారు. ఈ పోటీలో మా పాఠశాల విద్యార్థి వెన్నెలకు ప్రథమ స్థానం రావడం ఇంకా మదిలో మెదులుతూనే ఉంటుంది.
2017లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలలో బాల సాహిత్యానికి ప్రత్యేక వేదిక ఏర్పాటుచేసి గౌరవాన్ని కల్పించింది. 2020లో మణికొండ వేదకుమార్ పిల్లల కథలను సేకరించి చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ తరపున పాత పది జిల్లాల వారీగా ప్రచురించారు.
2022లో తెలంగాణ సాహిత్య అకాడమీ పాఠశాల విద్యాశాఖ సహకారంతో ‘మన ఊరు-మన చెట్టు’ పేరుతో విద్యార్థులకు కథల పోటీని నిర్వహించింది. అకాడమీ వారి లెక్కల ప్రకారం ఐదు లక్షల మంది బాలలు ఈ మహత్తర కార్యక్రమంలో పాలు పంచుకొని స్వీయ రచనలు చేశారు. ఉత్సాహం కలిగిన కొందరు ఉపాధ్యాయులు తమ పాఠశాల విద్యార్థుల కథా సంకలనాలను ప్రచురించారు. చాలా కథలు అకాడమీ వారి వద్ద భద్రంగా ఉన్నాయి.
భాషా సాహిత్యాల పరిరక్షణ కోసం 1943లో ఏర్పడిన ఆంధ్ర సారస్వత పరిషత్తు (ప్రస్తుత తెలంగాణ సారస్వత పరిషత్తు) తెలుగు భాషా పరీక్షల నిర్వహణ, సర్టిఫికెట్ల ప్రదానంతో పాటు అనేక గ్రంథాలను ప్రచురించింది. తెలుగు భాషా పరిరక్షణకు నిర్విరామ కృషి చేస్తూనే ఉన్నది. పెద్దవారికి సంబంధించిన సాహిత్యానికి ప్రాధాన్యం ఇస్తూ వస్తున్న పరిషత్ గత మూడేండ్ల కిందటి నుంచి బాల సాహిత్యంపై దృష్టి నిలపడం హర్షించదగిన పరిణామం. గతంలో తెలుగు భాషోపాధ్యాయుల సమ్మేళనం నిర్వహించి మాతృభాషకు పట్టం గట్టిన పరిషత్తు ఈ నెల 29, 30 తేదీలలో 200 మందికి పైగా బాల సాహితీవేత్తలతో, పిల్లలతో, తెలుగు ఉపాధ్యాయులతో, భాషాభిమానులతో పద్మభూషణ్ డాక్టర్ వరప్రసాదరెడ్డి సౌజన్యంతో మాతృమూర్తి కోడూరు శాంతమ్మ స్మారక బాల సాహిత్య సమ్మేళనం ఘనంగా నిర్వహించింది.
గతేడాది రెండు తెలుగు రాష్ర్టాల్లోని బాల రచయితల నుంచి ఆహ్వానించిన కథల్లో ఎంపిక చేసిన కథలతో ఒక సంకలనాన్ని, బాలల కోసం కథలు రాసే పెద్దల నుంచి కథలను ఆహ్వానించగా వచ్చిన కథలలో ఎంపిక చేసిన కథలతో ప్రచురించిన నాలుగు సంకలనాలను ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు. భాషా సాహిత్య వైభవం, ఆరోగ్యం-విజ్ఞానంతో పాటు మరికొంత మంది బాల సాహితీవేత్తల పుస్తకాలూ ఆవిష్కరించారు. అంతేకాక ఉత్తమ కథలు రాసిన బాల సాహితీవేత్తలకు, బాల కథకులకు నగదు పారితోషికం అందించారు. తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి జుర్రు చెన్నయ్యలు చక్కటి రూపకల్పనతో ‘బడిలో తెలుగు భాష’, ‘పత్రికలు బాలసాహిత్యం’ పేర చర్చాగోష్టులతో పాటు ‘కథ చెప్పే కళ’, ‘లలితకళా పరిచయం’, ‘బాలసాహిత్యం-ప్రమాణాలు’, ‘బాలసాహిత్యం-గ్రంథాలయాలు’ పేరిట సదస్సులను నిర్వహించారు.
ప్రభుత్వ పూర్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి, కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కార గ్రహీతలు డాక్టర్ దాసరి వెంకటరమణ, చొక్కాపు వెంకటరమణ, ప్రముఖ బాలసాహితీవేత్తలు వీఆర్ శర్మ, గరిపల్లి అశోక్, పైడిమర్రి రామకృష్ణ, డాక్టర్ గంగిశెట్టి శివకుమార్, ఆర్సీ కృష్ణస్వామిరాజు, సీఏ ప్రసాద్, శాంతారావు, మహమ్మద్ షఫీ, కథల తాతయ్య ఎన్నవెళ్లి రాజమౌళి, డాక్టర్ బీవీఎన్ స్వామి, డాక్టర్ కాసర్ల నరేశ్రావు, కూకట్ల తిరుపతి, ఉండ్రాళ్ల రాజేశం, గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ, ముంజులూరి కృష్ణకుమారి, డాక్టర్ అమరవాది నీరజ, మణికొండ వేదకుమార్, బైసా దేవదాసు, డాక్టర్ నమిలేటి కిట్టన్న, టి.వేదాంతసూరి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి తదితర భాషాభిమానులు బాల సాహితీవేత్తలు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
రెండురోజుల సదస్సులో వక్తల అభిప్రాయాలను క్రోడీకరిస్తే ఆంగ్లభాష, సెల్ఫోన్, ఇంటర్నెట్ లాంటి సాంకేతిక విప్లవం కారణంగా నేటి బాలలు మాతృభాషకు దూరమవుతున్నారని, మన మాతృభాష అయిన తెలుగును కాపాడవలసిన బాధ్యత అందరిపైనా ఉన్నది. మార్పు ముందుగా తెలుగువారి ఇంటినుంచే ప్రారంభం కావాలి. గతంలో కన్నా బాలలు సాహిత్య సృజన బాగా చేస్తున్నారు కాబట్టి పత్రికా ఎడిటర్లు కూడా వారికి ప్రోత్సాహం ఇవ్వాలి. చదువంటే కేవలం పాఠ్యపుస్తకాల్లో ఉన్నదే కాదని, బయటి పుస్తకాలను కూడా చదువాలని, వాటితో పాటు కళల పట్ల అభిరుచిని కూడా పిల్లల్లో పెంపొందించాలి. పిల్లల మానసిక స్థాయికి తగిన ప్రామాణిక బాల సాహిత్యాన్ని రచయితలు అందించాలి. పాఠశాల గ్రంథాలయాలను విరివిగా ఉపయోగించుకోవాలి. కథను చెప్పే కళను పిల్లలకు నేర్పించాలి. భాషా పరిరక్షణకు బాల సాహిత్యమే పునాది. కాబట్టి మంచి బాల సాహిత్యాన్ని సృష్టిస్తూ కాపాడుకోవాలి.
నేటి బాలలే రేపటి పౌరులు, దేశ సంపదకు వారసులు. అందుకే భాషా సాహిత్య సంపద ముందుతరాలకు అందాలంటే బాల సాహిత్యాన్ని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఈ బాధ్యతను భుజాలకెత్తుకున్న వ్యక్తులను, సంస్థలను అభినందించాల్సిన అవసరమూ ఉన్నది.
గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ
79896 63675